Bharat: మన దేశం పేరు భారతా? లేక ఇండియానా? ఎందుకంటే జి20 సదస్సు డిన్నర్ ఆహ్వానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిన్నర్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను ” ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్” అని పేర్కొనడమే ఇందుకు కారణమైంది. ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్నారంటూ దేశవ్యాప్తంగా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికిప్పుడు దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై అవి విమర్శలు చేస్తున్నాయి. ప్రస్తుతం మరో ఏడాదిలో దేశంలో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో.. అసలు దేశం పేరు గురించి మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు ఏమన్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..
రాష్ట్రాల సమాఖ్య
ఇండియా అంటే రాష్ట్ర సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది.. రాజ్యాంగం గుర్తించిన ఇండియా, భారత్ పదాలు రెండూ దేశానికి అధికారిక పేర్లేనని ఆర్టికల్ 1 ద్వారా చెప్పవచ్చు. ఇదే రాజ్యాంగం నుంచి ఇండియా అనే పేరును తొలగించి కేవలం భారత్ అనే పేరును మాత్రమే ఉంచాలని భారతీయ జనతా పార్టీ భావిస్తుందా? అనే సందేహాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి.
అప్పట్లో సుప్రీంకోర్టు ఏమన్నదంటే..
దేశం పేరును ఇండియా నుంచి భారత్ గా మార్చాలని 2016 మార్చి లో సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు అయింది.. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని కొట్టిపారేసింది. సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ లలిత్ కూడిన ధర్మాసనం అలాంటి పిటిషన్లను విచారించబోమని స్పష్టం చేసింది.” ఇండియా లేదా భారత్? మీరు ఈ దేశాన్ని ఎలా పిలవాలి అనుకుంటే అలా ముందుకు సాగండి. ఎవరైనా దీన్ని ఇండియా గా పిలవాలి అనుకుంటే అలానే పిల్వనీయండి. ఒకవేళ భారత్ అని పిలవాలి అనుకుంటే అలానే పిలువనీయండి. ” జస్టిస్ ఠాకూర్ ఆ కేసుకు సంబంధించి ప్రస్తావన వచ్చినప్పుడు అలా మాట్లాడారు. మూడేళ్ల క్రితం అంటే 2020లో ఇదే తరహా పిటిషన్ విచారణకు వస్తే సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. పిటిషన్ ను అభ్యర్థనగా మార్చుకొని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చని పిటిషనర్ కు సూచించింది. ” భారత్, ఇండియా రెండూ రాజ్యాంగంలో ఉన్న పేర్లు.. దేశాన్ని ఇప్పటికీ రాజ్యాంగంలో భారత్ అని పిలుస్తారు. ” అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే వ్యాఖ్యానించారు.
రాజ్యాంగాన్ని సవరించవచ్చా?
కేంద్ర ప్రభుత్వం ఒకవేళ భారత అనే పేరును మాత్రమే అధికారికంగా మార్చాలి అనుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిని సవరించేందుకు పార్లమెంట్లో బిల్లు కచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 కు అనుగుణంగా సాధారణ మెజారిటీ సవరణ సవరణ ద్వారా రాజ్యాంగంలో మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఇదే కొత్త రాష్ట్రం ఏర్పాటు లేదా రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వంటి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ సవరణలకు హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సాధారణ మెజారిటీ (అంటే 50% కంటే ఎక్కువ) అవసరం ఉంటుంది. ఇక ఆర్టికల్ 1 వంటి ప్రత్యేక సవరణ కోసం సభకు హాజరైన సభ్యుల్లో మూడంట రెండు వంతులు తక్కువ కాకుండా ప్రత్యేక మెజారిటీ (66 శాతం) అవసరం ఉంటుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. విపక్షాలు ఇండియా కూటమి అని పేరు పెట్టుకున్న నాటి నుంచి.. ఆ కూటమిని నిర్వీర్యం చేసేందుకు పావులు కదుపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం.. తాజాగా దేశానికి ఇండియాకు బదులు భారత్ అనే పేరు తెరపైకి తీసుకురావడం విశేషం. కాగా జీ20 సమావేశాలకు సంబంధించి డిన్నర్ నోట్ పై ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.