AP Govt: పైసల్ లేవు.. అందుకే చెల్లింపులు లేవు.. జగన్ సర్కార్ ఖజానా నిండుకోవడంతో బిల్స్ ఆగిపోయాయి. ఈ క్రమంలోనే చర్యలు మొదలయ్యాయి. ఏపికి వైద్యపరికరాలు నిలిపివేస్తూ ఐఏండీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ప్రజల ప్రాణాలకే ప్రమాదం. మరి పైసలు లేని జగన్ సర్కార్ ఈ ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కొంటుందన్నది వేచిచూడాలి.
ఏపీలోని జగన్ సర్కార్ కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. పాలనలోని వైఫల్యాలు, నిర్వహణ లోపాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర సంస్థల నుంచి ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైద్యసేవలు, మౌళిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు ఇండియన్ డివైసెస్ రెడ్ నోటీసులను జారీ చేసింది. మెడికల్ ఉపకరణాలను రాష్ట్రానికి సరఫరా నిలిపివేయాలని శుక్రవారం ఐఏండీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎంఎస్ఐడీసీకి పరికరాలు ఎవరూ సరఫరా చేయరాదని ఆదేశాలు జారీ చేసింది.
గత 4 ఏళ్ల నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని అందుకే ఈ రెడ్ నోటీసులు జారీ చేసినట్టు ఐఎండీ తెలిపింది. బకాయి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వ అధికారులతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.
ఏపీకి ఎవరైనా సరఫరా చేస్తే వారి సొంత రిస్క్ అని నోటీసులో వివరించింది. ఏ సంస్థ అయినా ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన టెండర్లలో పాల్గొనరాదని హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.
ఇక నుంచి ఏపీ ప్రభుత్వం 100 శాతం బకాయిలు చెల్లిస్తేనే ఇక పరికరాలు సరఫరా చేయాలని అన్ని పరిశ్రమలకు రెడ్ నోటీసులో సూచించింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏపీలోని వైద్య నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవలే పాలు సరఫరా చేయలేమంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. రూ.31 కోట్లు చెల్లించాలని లేని పక్షంలో అంగన్ వాడీలకు సరఫరా చేసే పాలు వచ్చే నెల నుంచి నిలిపివేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు రెడ్ నోటీసుతో ఏపీకి మెడికల్ సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. మెడికల్స్ కొరతతో వైద్య చికిత్సలకు ఆటంకం ఏర్పడనుంది. మరి జగన్ సర్కార్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తుందన్నది వేచిచూడాలి.