సరిహద్దుల్లో 20మంది భారత సైనికులను చంపిన చైనాపై దేశ ప్రజల్లో ఆగ్రహం ఎంత ఉందో తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఇప్పటికే 59 చైనా యాప్స్ పై కేంద్రం నిషేధం విధించగా.. దేశ ప్రజలు స్వచ్ఛందంగా చైనా వస్తువులను బహిష్కరిస్తున్నారు.
Also Read: చైనా మరో బయో వెపన్.. పాక్ లో తయారీ?
ఈ క్రమంలోనే యాప్స్ తోపాటు తాజాగా చైనా ఫోన్లను సైతం భారతీయులు కొనడం లేదని తాజా అధ్యయనం తేల్చింది. తాజాగా ‘కౌంటర్ పాయింట్ రీసెర్చ్’ అధ్యయనంలో చైనీస్ స్మార్ ఫోన్ బ్రాండ్ మార్కెట్ షేర్ భారీగా పడిపోవడం గమనార్హం. దీంతో చైనా వస్తువులను భారతీయులు బాయ్ కాట్ చేస్తున్నారనే విషయం తేటతెల్లమైంది.
చైనా కంపెనీలపై షియోమీ, ఒప్పో , వీవోలే భారత దేశంలో 81శాతం వాటా కలిగి ఉండేవి. కానీ కరోనా, భారత్ పై చైనా దండయాత్రతో చైనా ఫోన్లను కొనడం భారతీయులు తగ్గించేశారు. దీంతో జనవరి -మార్చిలో 81శాతం ఉన్న చైనా ఫోన్ల వాటా తాజాగా ఏప్రిల్ -జూన్ లో 72శాతానికి పడిపోయిందని అధ్యయనం తేల్చింది.
ఇక ఇదే సమయంలో చైనా ఫోన్ల స్థానంలో దక్షిణకొరియాకు చెందిన శాంసంగ్ తోపాటు దేశీయ మైక్రో మాక్స్, లావా బ్రాండ్స్ అమ్మకాలు పెరగడం విశేషం.
Also Read: ఆ రాష్ట్రానికి కరోనా తలవంచనుందా?
దేశంలో షియోమీ మార్చిలో 30శాతం వాటాతో దేశంలోనే మార్కెట్ వాటాలో మొదటి స్థానంలో ఉండేది. ఆ తర్వాత 16శాతం వాటాతో శాంసంగ్ మూడో స్థానంలో ఉండేది. రెండో స్థానంలో వీవో 17శాతంతో ఉండేది.
కానీ జూన్ కు వచ్చేసరికి చైనాతో యుద్ధ మేఘాల తర్వాత షియోమీ వాటా 1శాతం తగ్గి 29శాతం వాటాకు పరిమితమైంది. అదే సమయంలో 3వ స్థానంలో ఉన్న శాంసంగ్ ఏకంగా బాగా పుంజుకొని 26శాతం వాటాతో రెండో స్థానంలో నిలవడం విశేషం. కేవలం 3 శాతం వాటా మాత్రమే షియోమీ, శాంసంగ్ మధ్య ఉంది. దీంతో చైనా ఫోన్లను తగ్గించి కొరియన్ శాంసంగ్ ను దేశ ప్రజలు ఎక్కువగా కొంటున్నట్టు తేటతెల్లమైంది. చైనా మిగతా ఫోన్ల అమ్మకాలు బాగా పడిపోవడంతో భారతీయులు చైనా వస్తువుల బాయ్ కాట్ ను సీరియస్ గా తీసుకున్నట్టు అర్థమవుతోంది.