
కొంత కాలంగా భారత్ – చైనా మధ్య ఉద్రిక్తతలు ఏ స్థాయిలో కొనసాగుతున్నాయో తెలిసిందే. చర్చల ద్వారా వాతావరణం చల్లబడినట్టే అనిపిస్తున్నప్పటికీ.. అది నివురు గప్పిన నిప్పుమాదిరిగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనా సరిహద్దుకు బలగాలను తరలిస్తుండడం.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. డ్రాగన్ ఆగడాలను అడ్డుకోవడమే లక్ష్యంగా.. 50 వేల మంది సైనికులతోపాటు యుద్ధ విమానాలను సైతం మోహరిస్తోందట. ప్రముఖ వార్తా సంస్థ బ్లూమ్ బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించింది.
గతంలో గల్వాన్ లోయలో జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని, భవిష్యత్ లో జరగబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు ఈ సైన్యాన్ని తరలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చైనా సరిహద్దుల్లో సుమారు 2 లక్షల మంది కాపలాగా ఉన్నట్టు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే.. ఏకంగా 40 శాతం మంది సైనికులు పెంచినట్టు బ్లూమ్ బర్గ్ పేర్కొంది. చైనాను అడ్డుకోవడమే కాకుండా.. అవసరమైతే దాడి చేసేందుకు సైతం భారత్ సిద్ధమవుతోందని వెల్లడించింది.
ఫ్రాన్స్ నుంచి తెప్పించిన రాఫెల్ యుద్ధ విమానాలతోపాటు ఫైటర్ జెట్లను కూడా చైనా సరిహద్దుకు తరలించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. బార్డర్ వద్ద చైనా సైన్యం ఎంత మంది ఉన్నారనే విషయమై క్లారిటీ లేదు. స్పష్టత లేకపోయినప్పటికీ.. గతంతో పోలిస్తే సైనికులతోపాటు యుద్ధ సామగ్రిని పెంచినట్టు మాత్రం భారత్ గుర్తించిందట. కొత్త రన్ వేలు మొదలు యుద్ధ ట్యాంకుల వరకు చైనా సమకూర్చుకుంటోందని బ్లూమ్ బర్గ్ తెలిపింది.
ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో ఎటువైపు దారితీస్తుందోననే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. రెండు దేశాలూ ఇలా భారీగా సైన్యాన్ని మోహరించడం వల్ల ముప్పు వాటిల్లే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మరి, భవిష్యత్ లో ఏం జరుగుతుందన్నది చూడాలి.