Monsoon : ఈసారి రుతుపవనాలు ఏం చేస్తాయో.. పొంతనలేని ప్రభుత్వ, ప్రైవేటు అంచనాలు!

Monsoon : మన దేశంలో వర్షపాతం నివేదికలు అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయి. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో వాతావరణ నివేదికల క కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై భిన్నమైన నివేదికలు వచ్చాయి. సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఇక ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మాత్రం ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో […]

Written By: NARESH, Updated On : April 11, 2023 8:31 pm
Follow us on

Monsoon : మన దేశంలో వర్షపాతం నివేదికలు అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తాయి. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న దేశంలో వాతావరణ నివేదికల క కోసం రైతులు ఎదురు చూస్తుంటారు. అయితే ఈ ఏడాది దేశంలో వర్షపాతంపై భిన్నమైన నివేదికలు వచ్చాయి. సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఇక ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ మాత్రం ఈ ఏడాది సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఏది నిజమన్న చర్చ మొదలైంది.
దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం..
వాతావరణ నివేదిక దేశ ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే దేశంలో 60 శాతం జనాభా వ‍్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. కోట్లాది మంది రైతులు వ్యవసాయం చేసు‍్తన్నారు. పంటలు పండిస్తూ దేశానికి అన్నం పెడుతున్నారు. వ్యవసాయం ద్వారా దేశానికి 18 శాతం ఆదాయం సమకూరుస్తున్నారు. అయితే వాతావరణ నివేదికలో మార్పులు వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులను నిర్దేశిస్తాయి. ద్రవ్యోల్బణంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. అందుకే భారత వాతావరణ సంస్థ ఏటా వేసవిలోనే రుతుపవనాలను అంచనా వేసి వర్షపాతంపై నివేదిక ఇస్తుంది. ప్రైవేటు సంస్థ స్మైమేట్‌ కూడా కొన్నేళ్లుగా వాతావరణం, వర్షపాతంపై నివేదిక విడుదల చేస్తోంది. ఏటా రెండ నివేదికలు దాదాపు ఒకేలా ఉండేవి. ఈ ఏడాది మాత్రం భిన్నంగా ఉన్నాయి.
సాధారణమే అంటున్న ఐఎండీ..
ఈ ఏడాది దేశంలో సాధారణ రుతుపవన వర్షాలు కురుస్తాయని భారత అధికారిక వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్-సెప్టెంబర్ మధ్య దీర్ఘకాలిక సగటులో 96% వర్షాలు నమోదవుతాయని తెలిపింది. రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అయితే అది ద్వితీయార్ధంలో ఉండవచ్చని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావంతో కొన్నిసార్లు అధిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళ దక్షిణ తీరాన్ని తాకుతాయని తెలిపింది. సెప్టెంబర్ నాటికి తిరోగమనం చెందుతాయని పేర్కొంది.ఈ నాలుగు నెలల సీజన్‌లో 50 సంవత్సరాల సగటు 87 సెం.మీ (35 అంగుళాలు)లో 96% మరియు 104% మధ్య సగటు లేదా సాధారణ వర్షపాతం ఉంటుందని వివరించింది.
సాధారణం కంటే తక్కువ అంటున్న స్కైమేట్‌.. 
మరోవైపు ప్రైవేటు వాతావరణ అంచనా సంస్థ స్కైమేట్‌ మాత్రం దేశంలో ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ఎల్నినో (దక్షిణ అమెరికా సమీపంలో పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు వేడెక్కడం) ప్రభావం కారణంగా ఈసారి ఆసియాలో పొడి వాతావరణం నెలకొంటుందని, దీనివల్ల మన దేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావంతో రుతుపవనాలు బలహీనపడతాయని ఆ సంస్థ తన నివేదికలో తెలిపింది. వర్షపాతానికి సంబంధించి దీర్ఘకాలిక సగటుతో పోలిస్తే ఈ సీజన్ లో 94% వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు కొనసాగే వర్షాకాలం సీజన్ లో 88 సెంటీమీటర్ల వర్షపాతాన్ని దీర్ఘకాలిక (50 ఏండ్ల) సగటు వర్షపాతంగా పరిగణిస్తారు. ఇందులో 96% నుంచి 104% మధ్య వర్షపాతం నమోదైతే దానిని సాధారణంగా భావిస్తారు. అయితే, ఈ సారి వర్షాలు ఇంతకంటే తక్కువే పడతాయని స్కైమేట్‌ ప్రకటించింది.
నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో లోటు వర్షపాతం  
దేశంలో దాదాపు సగం సాగు భూముల్లో వర్షాలపై ఆధారపడే పంటలు సాగు చేస్తారు. ఈసారి ఎల్‌నినో ప్రభావం కారణంగా తక్కువ వర్షపాతం నమోదు కానుండటంతో దేశంలోని నార్త్, సెంట్రల్ ప్రాంతాల్లో లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని స్కైమెట్ వెల్లడించింది. ప్రధానంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ రాష్ట్రాల్లో సీజన్ రెండో సగంలో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ సమయంలో వివిధ పంటలపై ప్రభావం పడుతుందని తెలిపింది.