https://oktelugu.com/

చైనా పెట్టుబడులపై కన్నేసిన భారత్

చైనా విషయం లో అనుకున్నంతా జరుగుతుంది. కరోనా వైరస్ ఏమోగాని చైనా ని  ప్రపంచం మొత్తం  అనుమానంగా చూస్తుంది. ఈ రోజు భారత్ కూడా ఆ కోవలో చేరింది. కరోనా వైరస్ మహమ్మారి తో ప్రపంచం మొత్తం ఒకవైపు వణికిపోతుంటే రెండోవైపు దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ కంపెనీలని చైనా ఎక్కడ కొనేస్తుందోనని ఆదుర్దా ఎక్కువయ్యింది. యూరప్ లో కరోనా మహమ్మారి విశృంఖలత తో ప్రభుత్వాలు క్షణం తీరిక లేకుండా వుండి కూడా విదేశీ పెట్టుబడుల విషయం […]

Written By:
  • Ram
  • , Updated On : April 18, 2020 / 08:11 PM IST
    Follow us on

    చైనా విషయం లో అనుకున్నంతా జరుగుతుంది. కరోనా వైరస్ ఏమోగాని చైనా ని  ప్రపంచం మొత్తం  అనుమానంగా చూస్తుంది. ఈ రోజు భారత్ కూడా ఆ కోవలో చేరింది. కరోనా వైరస్ మహమ్మారి తో ప్రపంచం మొత్తం ఒకవైపు వణికిపోతుంటే రెండోవైపు దీన్ని అవకాశంగా తీసుకొని వాళ్ళ కంపెనీలని చైనా ఎక్కడ కొనేస్తుందోనని ఆదుర్దా ఎక్కువయ్యింది. యూరప్ లో కరోనా మహమ్మారి విశృంఖలత తో ప్రభుత్వాలు క్షణం తీరిక లేకుండా వుండి కూడా విదేశీ పెట్టుబడుల విషయం లో నిబంధనలు మార్పు చేసుకున్నారు. ఎందుకంటే చైనా ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని షేర్లు డీలాపడిన తరుణం లో వాటిలో పెట్టుబడులు పెట్టి మెజారిటీ వాటా చేజిక్కించుకోవచ్చునని అంచనా వేశాయి. ఆ మేరకు వాళ్లకు ఉప్పందటం తో అత్యవసరంగా వాళ్ళ చట్టాలను మార్చుకున్నారు. ముఖ్యంగా యూరప్ , ఆస్ట్రేలియా దేశాలు ఇందులో వున్నాయి. ఇప్పటికే దీనితో సంబంధం లేకుండా  ఇటలీ లో చాలా కంపెనీలను చైనా సంస్థలు కోనేశాయి. ఆ చరిత్ర తెలుసుకాబట్టే జర్మనీ, ఫ్రాన్స్ లాంటి అనేక దేశాలు మేలుకున్నాయి.

    భారత్ లో కూడా ఇటీవలి కాలం లో చైనా పెట్టుబడులు గణనీయం గా పెరిగాయి. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత పడిపోయిన స్టాక్ మార్కెట్ నేపధ్యం లో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు లో దాదాపు ౩ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి 1 శాతం వాటాని చేజిక్కించుకుంది .దీనితో సెబి మేల్కొంది. అసలు భారత్ లో చైనా ఏయే రంగాల్లో పెట్టుబడి పెట్టిందో ఆరా తీస్తుంది. ఇప్పటికే పేటిఎం లాంటి సంస్థ లో 40 శాతం వాటాని చేజిక్కించుకుంది. గత రెండు సంవత్సరాల్లోనే విపరీతమైన పెట్టుబడులు పెట్టింది. రెండో వైపు  వాణిజ్య లోటు తగ్గటం లేదు. భారత్ ఇప్పుడు రక్షణ రంగం కూడా విదేశీ పెట్టుబడులకు గేట్లు బార్లా తెరిచింది. టెలికాం రంగం లో ఇప్పటికే చైనా ప్రవేశించింది. హువే 5 జి సేవలు వాడుకోవాలా వద్దా అనేది పెద్ద చర్చ నీయాంశమయ్యింది. అతిసున్నితమయిన రంగాల్లో విదేశీ పెట్టుబడులను సునిశిత పరిశీలన చేయాల్సి వుంది. అదేసమయం లో విదేశీ పెట్టుబడులు, సాంకేతికత బదిలీ అవసరం ఎంతయినా వుంది.

    మరి ఈ నేపధ్యం లో భారత్ నిర్ణయాన్ని చూడాల్సి వుంది. ఇప్పటికే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి విదేశీ పెట్టుబడులు దానంతట అవే ( ఆటోమేటిక్ దారిలో) రావటాన్ని నిషేదించారు. ఇప్పుడు దీన్ని అన్ని భూ సరిహద్దు దేశాలకు విస్తరించారు. ఇది చైనాని దృష్టి లో పెట్టుకొనే మార్చటం జరిగింది. అదేసమయం లో వీటిని నిషేదించలేదు. సరిహద్దు దేశాలనుంచి ప్రభుత్వ అనుమతి ద్వారానే రావాలి. అంటే ఏ రంగాల్లో పెట్టుబడులను అనుమతించాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే చైనా పై ఓ కన్ను వేసివుంచుతుందన్న మాట. కొంతమందికి సందేహం రావచ్చు. కేవలం ఈ దేశాలనుంచే ఎందుకు అనుమతించటం లేదని .

    చైనా పెట్టుబడులపై ఎందుకు వ్యతిరేకత?

    పాకిస్తాన్ విషయం లో ఎవరికీ సందేహం లేదు. బంగ్లాదేశ్ విషయం లో ఇప్పటికే అక్కడ చైనా సంస్థలు బాగా వేళ్ళూనుకున్నాయి. అవి ఆ వైపు నుంచి వస్తాయేమోనని సందేహం వుండివుండొచ్చు. ఇక చైనా విషయం లో  ఇన్నాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చింది.   వాస్తవానికి అన్నిదేశాల కన్నా ముందే భారత్ గట్టి వైఖరి తీసుకోవాల్సింది. కాకపోతే ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్న మనం ఆచి తూచి అడుగేయాల్సి వుంది. అందుకే ఈ ఆలస్యం. ఇప్పుడు తప్పని పరిస్థితి. చైనా వైఖరి వలన ఎక్కువ నష్టపోయిన దేశ మేదన్నా వుందంటే అది భారత్ .

    మొదట్నుంచీ భారత్ వ్యతిరేక వైఖరి తీసుకుంటూనే వుంది. అన్ని ప్రపంచవేదికల పై భారత్ ని వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ ని సమర్ధిస్తూ వచ్చింది. 1962 యుద్ధాని కి ముందే గుట్టుచప్పుడు కాకుండా ఆక్సాయ్ చిన్ ని ఆక్రమించుకుంది. యుద్ధం తర్వాత 1963 లో పాకిస్తాన్ ఆక్రమణ లో వున్న మన  భూభాగాన్ని పాకిస్తాన్ నుంచి తీసుకుంది. అలాగే మన భూభాగం లో చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా పేరుతో రహదారి నిర్మించింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ప్రపంచ సంస్థ లపై ఎండకడుతుంటే పాకిస్తాన్ ని వెనకేసుకొస్తూ భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. భారత్ చుట్టూ సైనిక స్థావరాలు నిర్మిస్తుంది. చైనా రాబోయే కాలం లో భారత రక్షణ కు అత్యంత ముప్పుగా మారింది. ప్రశాంతంగా వున్న హిందూ మహాసముద్రంలో తన కదలికలను ముమ్మరం చేసింది. ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యత్వం భారత్ కి రాకుండా మొకాలడ్డుతుంది. అయినా భారత్ చైనా తో సత్సంబంధాల కోసమే కృషిచేస్తుంది. అదీగాక ప్రపంచం లో రెండో శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థ కాబట్టి జాగ్రత్తగా లౌక్యంతో వ్యవహరిస్తుంది. కానీ ఇప్పుడు భారత్ లోని కంపనీలపై కన్నేయటంతో భారత్ ఈ చర్యకు పూనుకోవాల్సి వచ్చింది. అదే సమయం లో విదేశీ పెట్టుబడులను భారత్ ఆహ్వానిస్తూనే వుంది. అవి లేకుండా ఏ దేశ ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధి సాధించలేదు. ఇప్పుడు తీసుకున్న చర్యతో చైనా భారత్ కు  నమ్మదగ్గ దేశం కాదని అర్ధమయ్యింది. ఈ విషయం లోలోపల వున్నా మొట్టమొదటసారి  తప్పని పరిస్థితుల్లో ప్రత్యక్షంగా బయట ప్రపంచానికి, ముఖ్యంగా చైనా కి అర్ధమయ్యేటట్లు చెప్పింది. ముందు ముందు భారత్ ప్రపంచ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతుంది. అది ఎలావుండబోతుందో ఈ ప్రభుత్వ చర్య సూచనప్రాయంగా  చెప్పినట్లయ్యింది.