Samudrayaan Mission: చంద్రుడి గుట్టు మట్లు తెలుసుకుంది. సూర్యుడి మీద కూడా ప్రయోగాలు చేస్తోంది. అంతరిక్షంలో భారతీయ జెండాలు రెపరెపలాడించింది. నింగి, నేల, అంతరిక్షం.. ఇలా మూడు విభాగాలలో భారత్ తన సత్తాను చూపించింది. ఇకపై నీటిలో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోబోతోంది.
అంతరిక్ష ప్రయోగాలతో ప్రపంచాన్ని మొత్తం తన వైపు తిప్పుకున్న భారత్.. ఇప్పుడు సముద్రంలో కూడా ప్రయోగాలను మొదలు పెట్టబోతోంది. ఎందుకంటే సముద్రంలో విపరీతమైన ఖనిజాలు.. విలువైన నిక్షేపాలు ఉన్నాయి. ఆ విలువైన నిక్షేపాలను గనుక బయటికి తీస్తే భారత ఆర్థిక ముఖ చిత్రం పూర్తిగా మారిపోతుంది. మన దేశ పరిశోధకులు సముద్రయాన్ ప్రయోగాన్ని మొదలుపెట్టారు. ఈ ప్రయోగంలో భాగంగా చెన్నై NIOT(National institute of ocean technology) ఆధ్వర్యంలో నాలుగో తరం సబ్ మెరైన్ మత్స్య 600 ను మే నెలలో సముద్ర జలాల్లోకి ప్రవేశపెడతారు.
డీప్ ఓషియన్ మిషన్ (DOM) లో భాగంగా ఈ సబ్ మెరైన్ ను రూపొందించారు. 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వా నాట్స్ ఇందులో ప్రయాణిస్తారు. ఒకవేళ కనుక ఈ ప్రయోగం విజయవంతం అయితే అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది. సముద్ర జలాల్లో విలువైన నిక్షేపాలతో పాటు, అరుదైన ఖనిజాలు కూడా ఉన్నాయి. కాకపోతే వీటిని అన్వేషించడం అంత సులువు కాదు. సముద్ర అంతర్భాగంలో అత్యంత కఠినమైన వాతావరణం ఉంటుంది. సముద్రాలలో నిత్యం జలాలు ఆటుపోట్లకు గురవుతుంటాయి. అంతర్భాగంలో కూడా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు అందులో ప్రయోగాలు చేయడం కత్తి మీద సాము లాంటిది. సబ్ మెరైన్ లు కూడా కొన్ని సందర్భాలలో ప్రమాదాలకు గురవుతుంటాయి. ఇన్ని ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి.. సముద్రంలో ప్రయోగాలు చేయడం అంత ఈజీ కాదు.
అయితే సముద్ర గర్భంలో నిక్షేపాలను బయటకు తీస్తే.. వాటి ద్వారా ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఫలితంగా భారత ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది. భారత్ అభివృద్ధి చెందిన దేశంలా కాకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతుంది. ఉపాధి కోసం మన దేశ యువత విదేశాలకు వెళ్లకుండా.. ఇక్కడే పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది.