K Padmarajan: పంచాయితీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నిక వరకు ఆయన బరిలో లేని ఎన్నిక లేదు. అలాగని గెలుపు గుర్రం ఎక్కింది కూడా లేదు. జీవితమంతా ఓటములు ఎదుర్కొంటున్నా ఎన్నికల్లో పోటీని మాత్రం ఆపలేదు. ఒక్కసారి ఓడిపోతేనే నేతలు నిరసించి పోతారు. ప్రజలు తిరస్కరించారని బాధపడి పోతారు. అలాంటిది ఒకటి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా 238 సార్లు పోటీ చేసి ఓటమి చవి చూశారు ఆయన. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నారు తమిళనాడులోని సేలం కు చెందిన పద్మరాజన్.
పద్మరాజన్ అనేకంటే స్థానికంగా ఎలక్షన్ కింగ్ గా ఆయన సుపరిచితులు. 65 సంవత్సరాల పద్మరాజన్ రిపేర్ షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అవి పంచాయితీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలు అయినా.. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉత్సాహంగా రంగంలోకి దిగుతారు. ఓడిపోయినా నిరుత్సాహపడరు. అయితే ఆయన ప్రజల అభిమానాన్ని దక్కించుకోకపోయినా.. ప్రజలు ఆదరించకపోయినా.. వరల్డ్ రికార్డ్ బుక్ ల్లో మాత్రం స్థానం దక్కించుకున్నారు. ఎన్నికల చరిత్రలో అత్యధిక సార్లు విఫలమైన వ్యక్తిగా పద్మరాజన్ కు లిమ్ కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఢిల్లీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఆయన విఫలనేత అయినా.. ఆయన ప్రయత్నం విఫలం కాలేదు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గెలుపుతో సంబంధం లేకుండా పోటీ చేయడం కూడా ఒక స్ఫూర్తిదాయకమైన విషయంగా గుర్తించుకోవాలి.
ఓటు వేసేందుకే విద్యాధికులు ముందుకు రాని రోజుల్లో.. ఏకంగా 238 సార్లు నామినేషన్ దాఖలు చేసిన పద్మరాజన్ అభినందనీయులు. నేను గెలవాలని లేదు.. ఓడిపోవాలనేదే నా కోరిక.. గెలుపు తాత్కాలికం, ఓటమి శాశ్వతం అని గుర్తించుకోవాలని చెబుతున్నారు పద్మరాజన్. అయితే పద్మరాజన్ హేమాహేమీలతో తలపడ్డారు. అటల్ బిహారీ వాజపేయి, పీవీ నరసింహారావు, కరుణానిధి, ఏకే అంటోనీ, వాయిలార్ రవి, యడ్యూరప్ప, బంగారప్ప, ఎస్ఎం కృష్ణ, విజయ్ మాల్యా, సదానంద గౌడ, అన్బుమని రామదాసు వంటి హేమహేమీలపై పద్మరాజన్ పోటీ చేశారు. కానీ ఎప్పుడు కూడా ధరావత్తు దక్కకపోవడం దురదృష్టకరం.