Maharashtra elections : త్వరలో మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. పొత్తులతో ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.. అయితే ఈ ఎన్నికల క్రతువులో ఓ అభ్యర్థి ఎన్నికల సంఘాన్ని చేసిన డిమాండ్ సరికొత్తగా ఉంది. మహారాష్ట్రలోని పరంద నియోజకవర్గం నుంచి గురుదాస్ శంభాజీ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.. ఈయనకు ఎన్నికల సంఘం “చెప్పుల” గుర్తును కేటాయించింది. ఎన్నికల నిబంధనలు చెప్పులు ధరించడం ఎన్నికల కోడ్ ను అపహస్యం చేసినట్టవుతుందని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం అభ్యర్థులు పోలింగ్ బూత్ ల వద్ద ఎన్నికల గుర్తులను ప్రదర్శించకూడదని ఆయన గుర్తు చేశారు.. ” నాకు ఎన్నికల సంఘం చెప్పుల గుర్తు కేటాయించింది. ఈ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రదేశంలో ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తును నేను ప్రదర్శించకూడదు. నేను మాత్రమే కాదు ఇంకెవరు కూడా చెప్పులు ధరించకూడదు. అది ఎన్నికల సంఘం నిబంధనలను అతిక్రమించినట్టే అవుతుంది. అందువల్ల ఎన్నికల సంఘం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. చెప్పులను ఓటర్లు మాత్రమే కాదు, అధికారులు కూడా ధరించకుండా చూడాలి. అప్పుడే ఎన్నికల సంఘం విధించిన నిబంధనలు పాటించినట్టవుతుందని” గురుదాస్ జాతీయ మీడియాతో పేర్కొన్నారు.
జాతీయ మీడియాలో సంచలనం
గురుదాస్ కు ఎన్నికల సంఘం చెప్పుల గుర్తు కేటాయించిన నేపథ్యంలో.. మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయారు. పరంద .. మహారాష్ట్రలో ఒక మారుమూల నియోజకవర్గం. ఎన్నికల సంఘం గురుదాస్ కు చెప్పుల గుర్తు కేటాయించడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. గురు దాస్ కూడా చెప్పులు గుర్తుతో వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోటీలో ఉన్న పెద్ద పార్టీల అభ్యర్థుల కంటే తీసిపోని విధంగా ప్రచారం సాగిస్తున్నారు. ” ఆయన గెలుస్తారో లేదో తెలియదు. చెప్పల గుర్తును మాత్రం పదే పదే ప్రచారం చేస్తున్నారు. ఆయన ప్రధాన పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకటికి రెండుసార్లు వారంతా మా ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గతంలో మా రాష్ట్రంలో ఎన్నికలు జరిగినప్పుడు ఇలా లేదు. ఈసారి మాత్రమే విభిన్నంగా ఉంది. ఆయన చెప్పుల గుర్తు వల్ల మా నియోజకవర్గం వార్తల్లో నానుతున్నది. ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు చెప్పలేం గాని.. మొత్తానికైతే ఆయన ప్రచారం వినూత్నంగా సాగుతోంది. ఆయన ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన విధానం కూడా విచిత్రంగానే ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. మొత్తానికైతే చెప్పుల గుర్తు మా నియోజకవర్గంలోనే కాదు, మహారాష్ట్ర వ్యాప్తంగా గేమ్ చేంజర్ లాగా కనిపిస్తోందని” పరందా నియోజకవర్గ ఓటర్లు అంటున్నారు.