https://oktelugu.com/

Independence Day 2023: వ్యక్తి పూజ వద్దు: కృతజ్ఞతకూ హద్దు

‘రాజ్యాంగ సభ వివిధ వర్గాల గుంపుగా.. సిమెంటు లేని పేవ్‌మెంట్‌గా.. అక్కడో రాయు, ఇక్కడో రాయిగా వేసి ఉన్నట్లుగా ఉంటే ముసాయిదా కమిటీ కర్తవ్య నిర్వహణ (రాజ్యాంగ రచన) చాలా సంక్లిష్టంగా ఉండేది.

Written By:
  • Rocky
  • , Updated On : August 15, 2023 / 09:48 AM IST

    Independence Day 2023

    Follow us on

    Independence Day 2023: ప్రజాస్వామ్యంలో.. ఫలానాది తప్పని చెప్పేందుకు, దాని పరిష్కారానికి ఆ అంశంపై విస్తృత చర్చ జరగాలన్నది అంబేడ్కర్‌ నిశ్చితాభిప్రాయం. అలాగే రాజకీయాల్లో వ్యక్తి పూజ నియంతృత్వానికి దారితీస్తుందని 1949లోనే హెచ్చరించారు. వేల సంఖ్యలో కులాలున్న దేశం ఓ జాతిగా ఎలా ఆవిర్భవిస్తుందని ప్రశ్నించారు. దేశం కంటే మతాన్ని మిన్నగా భావిస్తే మన స్వాతంత్ర్యాన్ని శాశ్వతంగా కోల్పోతామని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి రాజకీయాల్లో కులమతాలకే ప్రాధాన్యం. వాటి ప్రాతిపదికన పార్టీలే పుట్టుకొస్తున్నాయి. ఎన్నికల బరిలోనూ నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలు సైతం కులసమీకరణల ఆధారంగానే ఎన్నికల నిర్వహణ చేస్తున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో, చట్టసభల్లో సమగ్ర చర్చలే లేకుండా పోయాయి. అసమ్మతిని ప్రభుత్వాలు సహించలేకపోతున్నాయి. ఆరోగ్యకరమైన చర్చ ఆవశ్యకత గురించి అంబేడ్కర్‌ ఆనాడే నొక్కిచెప్పారు.

    నిజమైన జాతి..

    భిన్న కులాలు, వర్గాలు కలగలసిన భారత్‌ ఆటోమేటిగ్గా ఓ జాతిగా ఆవిర్భవిస్తుందన్న ఆలోచన మంచిది కాదని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు. అమెరికా పౌరులు తమ దేశాన్ని ఐక్య రాజ్యం(యునైటెడ్‌ నేషన్‌)గా పేర్కొనలేదని.. సంయుక్త రాష్ట్రాలు (యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా)గా నిర్ణయించుకున్నారని గుర్తుచేశారు. ‘‘సంయుక్త రాష్ట్రాల ప్రజలే తమను తాము ఓ జాతిగా పరిగణించనప్పుడు.. భారతీయులు తమను ఓ జాతిగా భావించడం ఎంత కష్టం? కొందరు రాజకీయ ప్రేరితులు.. ‘భారత ప్రజలు’ అన్న భావనను నిరసించిన విషయం నాకు గుర్తుంది. వారు ‘భరత జాతి’ అనిపించుకోవాలనుకున్నారు. అయితే మనల్ని మనం జాతిగా భావించడం అంటే మాయలో పడినట్లే! వేల కులాలుగా చీలిపోయిన ప్రజలు ఒక్క జాతిగా ఎలా అవుతారు? సామాజికంగా, మానసికంగా మనమింకా ఓ జాతి కాలేదన్న విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. అప్పుడే జాతిగా ఆవిర్భవించాల్సిన అవసరాన్ని గ్రహిస్తాం. అయితే ఈ లక్ష్యాన్ని గ్రహించడం అమెరికాలో కంటే ఇక్కడే చాలా కష్టం. ఎందుకంటే అక్కడ కులాల్లేవు. ఇక్కడ ఉన్నాయి. జాతిగా ఆవిర్భవించాలనుకుంటే ఈ సమస్యలన్నిటినీ అధిగమించాలి’’ అని పేర్కొన్నారు.

    ‘‘రాజ్యాంగ సభ వివిధ వర్గాల గుంపుగా.. సిమెంటు లేని పేవ్‌మెంట్‌గా.. అక్కడో రాయు, ఇక్కడో రాయిగా వేసి ఉన్నట్లుగా ఉంటే ముసాయిదా కమిటీ కర్తవ్య నిర్వహణ (రాజ్యాంగ రచన) చాలా సంక్లిష్టంగా ఉండేది. ప్రతి సభ్యుడూ, ప్రతి వర్గం తాము చెప్పిందే చట్టమని అనుకుని ఉంటే నానా గందరగోళం చోటుచేసుకునేది. పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉండాలన్న నిబంధనను సభ్యులంతా పాటించి ఉంటే రాజ్యాంగ సభ కార్యకలాపాలు నిస్సారంగా ఉండేవి. పార్టీ క్రమశిక్షణ.. రాజ్యాంగ సభను ‘జీ హుజూర్‌’ సభ్యుల గుంపుగా మార్చి ఉండేది. ముసాయిదా కమిటీలో కామత్‌, పీఎస్‌ దేశ్‌ముఖ్‌, సిధ్వా, ప్రొఫెసర్‌ సక్సేనా, పండిట్‌ ఠాకూర్‌, దాస్‌ భార్గవ, కేటీ షా, పండిట్‌ హృదయనాథ్‌ కుంజ్రూ వంటి రెబెల్స్‌ ఉన్నారు. వారు లేవనెత్తిన అంశాలన్నీ సైద్ధాంతికమైనవి. అయితే వారి సలహాలను నేను ఆమోదించలేదు. అంత మాత్రాన వారి సూచనలకు విలువ లేకుండా పోదు. రాజ్యాంగ సభకు వారు చేసిన సేవా తగ్గిపోదు’’ అని అంబేడ్కర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

    కృతజ్ఞతకూ హద్దులు..

    దేశానికి జీవితాంతం సేవచేసిన మహనీయుల పట్ల కృతజ్ఞత చూపడం తప్పు కాదని.. కానీ దానికీ హద్దులున్నాయని అంబేడ్కర్‌ స్పష్టం చేశారు.
    ‘‘ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి కృతజ్ఞత చూపించాల్సిన పనిలేదు.. ఏ మహిళా తన శీలాన్ని పణంగా పెట్టి కృతజ్ఞత చెప్పనక్కర్లేదు.. స్వేచ్ఛను పణంగా పెట్టిన ఏ దేశమూ గొప్పది కాదు’’ అని ఐరిష్‌ దేశభక్తుడు డేనియల్‌ ఓకానెల్‌ చెప్పిన మాటలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ విషయంలో మన దేశం ఇతర దేశాల కంటే మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

    వ్యక్తి పూజ వద్దు

    ‘‘భారత రాజకీయాల్లో భక్తి, వ్యక్తిపూజలది కీలక పాత్ర. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇలా ఉండదు. మతంలో భక్తి అనేది మోక్షానికి మార్గం కావచ్చు. కానీ రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తిపూజ అనేది పతనానికి.. అంతిమంగా నియంతృత్వానికి దారితీస్తుంది..’’ అని హెచ్చరించారు.

    సామాజిక ప్రజాస్వామ్యం..

    సామాజిక ప్రజాస్వామ్యం లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం మనజాలదన్నారు. ‘‘సామాజిక ప్రజాస్వామ్యమంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన విలువలుగా గుర్తించే జీవన మార్గం. ఇది త్రిమూర్తుల కలయిక వంటిది. ఇందులో దేనిని వదిలేసినా ప్రజాస్వామ్య లక్ష్యాన్నే ఓడిస్తుంది’’ అని చెప్పారు.

    ప్రజాస్వామ్యం ఉండాలంటే..

    ‘‘రక్తపాత విప్లవాలను విడనాడాలి. సత్యాగ్రహం, శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ వంటి పద్ధతులు మానుకోవాలి. అరాచక విధానాలను ఎంత త్వరగా విడనాడితే అంత మంచిది’’ అని పేర్కొన్నారు.