Employee resignations: ఒకటి కాదు.. రెండు కాదు.. పదేళ్లు, 20 ఏళ్లు చేసిన వారున్నారు. సంస్థపై ప్రేమతో మొలదారానికి కంపెనీ తాడు కట్టుకొని నిబద్ధతను చాటుకున్న వారున్నారు. వేరే ఇతర సంస్థల్లో మంచి ఆఫర్లు వచ్చినా వదలుకొని ‘ఇదీ మన సంస్థ’ అని నమ్మకంగా పనిచేసిన వారున్నారు.. కానీ ఏమైంది.. చివరకు ‘కరోనా ధాటికి’ కంపెనీలన్నీ ఉద్యోగులను కాలదన్నాయి.. బతిమిలాడినా కాదు పొమ్మన్నాయి. అయితే ట్రెండ్ మారింది.. ‘ఉద్యోగం లోంచి నిన్ను తీసేయడం కాదు.. నువ్వే వదిలేసే రోజులొచ్చాయి.’ ఆగ్రసంస్థలు మ్యాన్ పవర్ కోసం శూలశోధన చేసే దశకు వచ్చింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. టాలెంట్ ఉన్నోడికి జాబ్ లకు కొదవ ఉండదు.. ఎంతో మంది పొట్టకొట్టిన నరకాసుర హెచ్.ఓ.డీల వధకు ఇంకా ఎంతో సమయం లేదు… తస్మాత్ జాగ్రత్త..!
తెలుగులోని ప్రధాన పత్రికల్లో మళ్లీ తీసివేతలు మొదలైనట్టు టాక్. అధికార పార్టీ అనుబంధ పత్రికల్లోనూ జర్నలిస్టులను తీసివేయడానికి రంగం సిద్ధమైందట.. ఇప్పటికే కరోనా లాక్ డౌన్ లో సగం మందిని ఇంటికి పంపి వారికి ఉద్యోగ, ఉపాధిని దూరం చేశారు. ఇప్పుడు పత్రికా రంగం కుదటపడకపోవడం.. కరోనా తర్వాత నిలదొక్కుకోకపోవడంతో ‘బ్రాడ్ షీట్’ మెయిన్ పేజీలను మాత్రమే ఉంచి జిల్లా సంచికలను పూర్తిగా తగ్గించేసి జర్నలిస్టును తగ్గించేందుకు పత్రికా యాజమాన్యాలు డిసైడ్ అయినట్టు సమాచారం. అయితే ఈ పరిణామం గురించి జర్నలిస్టు సంఘాలు, జర్నలిస్టు మేధావులు ఇప్పటివరకూ ఐక్యత చూపలేదు. కనీసం యాజమాన్యాలను అడిగిన పాపాన పోవడం లేదు. జర్నలిస్టు అంటే సీఎం అయినా పీఎం అయినా భయపడిపోతారు. కానీ వాళ్లకే ఉద్యోగ భద్రత కరువైంది. కనీసం పారిశుధ్య కార్మికులకు కూడా సంఘాలున్నాయి. వారిలో ఎవరికి ఏం జరిగినా అందరూ ముందుకొస్తారు. తమ హక్కుల కోసం ఐక్యంగా పోరాడుతారు. కానీ జర్నలిస్టు సంఘాల్లో మాత్రం ఈ ఐక్యత.. తీసివేతలపై నోరు మెదకపోవడం దారుణమని చెప్పొచ్చు. జర్నలిస్టుల బతుకులు ఈ నయా పాలిటిక్స్ బలైపోవాల్సిందేనా? అన్న చర్చ సాగుతోంది.
కరోనా కల్లోలంలో ఒక స్పష్టమైన సంకేతం వచ్చింది. కరోనా మనకు కీడు చేసినా కానీ ఎవరు మనవాళ్లు.. ఎవరు బయటి వారు అన్న సంగతిని చాటిచెప్పింది. ఉద్యోగం ఇచ్చిన సంస్థ కోసం 10 ఏళ్లు, 20 ఏళ్లు పనిచేసిన వారిని కూడా యాజమాన్యాలు మెడపట్టి బయటకు గెంటేశాయి. ఈ క్రమంలోనే ఎంత బతిమిలాడినా ఉద్యోగాలు పునరుద్దరించలేకపోయాయి. అయితే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్లకు వేరే జాబ్ లు దొరికాయి. లేని వారు అరిగోసపడ్డారు.ముఖ్యంగా కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన పత్రికలు, మీడియా రంగంలో వేల మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. వారికి ఇప్పటికీ అతీగతీ లేకుండా పోయింది.
కరోనా నిజంగానే ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులకు కొత్త గుణపాఠం నేర్పింది. జీవితంలోని భయంకర దారుణాలను కళ్లకు కట్టింది. కుటుంబం విలువను తెలిపింది. అలాగే బంధాలను బలోపేతం చేసింది. డబ్బు విలువను గుర్తు చేసింది. కష్టకాలంలో యాజమాన్యాలు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడం వారి మనసును గాయపరిచింది. సుదీర్ఘమైన షిఫ్టులు, లే ఆఫ్ లు, వేతన కోతలతో తమను కంపెనీలు ఎక్కువగా వాడుకుంటున్నాయన్న భావన ఉద్యోగుల్లో బలంగా నాటుకుంది. ఇప్పుడు కరోనా తగ్గింది. వ్యాపారాలు, కంపెనీలు పుంజుకున్నాయి. మళ్లీ మంచి జీతాలు, ప్యాకేజీలు ఇస్తామన్నా ఉద్యోగులు పోవడం లేదు. రాజీనామా చేసి కొత్త మార్గం వెతుక్కునే పనిలో పడ్డారు. రాజీనామాలు చేయడానికి ఏమాత్రం భయపడడం లేదు. మంచి భవిష్యత్ కోసం కొత్త ఉద్యోగాల వేట మొదలుపెడుతున్నారు. టాలెంట్ ను పెంచుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. లేదంటే ఏదైనా మంచి వ్యాపారంలోకి షిఫ్ట్ అవుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ‘ది గ్రేట్ రిజగ్నేషన్’ సంక్షోభం మొదలైంది. కరోనా దెబ్బకు ఆ సమయంలో కోట్ల మందిని కంపెనీలు రోడ్డుపడేశాయి. ఇప్పుడు మళ్లీ పిలుస్తున్నా ఎవరూ వెళ్లడం లేదట.. ఒక్క అమెరికాలోనే ఆగస్టు 43 లక్షల మంది ఉద్యోగాలకు రాజీనామా చేయడం పెను సంచలనమైంది. ఆ దేశ మొత్తం ఉద్యోగుల్లో వీరి వాటా ఏకంగా 2.9శాతం అంట.. వీరంతా కొత్త ఉద్యోగాలు.. మెరుగైన జీవితం కోసం వేట ప్రత్యామ్మాయ మార్గాల వైపు మరులుతున్నారట.. ఇక ప్రపంచవ్యాప్తంగా 40శాతం మంది ఉద్యోగులు కంపెనీలు మారటంపై గానీ.. రాజీనామాలపై కానీ ఆలోచిస్తున్నారని మైక్రోసాఫ్ట్ సర్వేలో తేలింది.
ప్రస్తుతం ఉద్యోగులు పని వాతావరణానికి అస్సలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. సౌకర్యవంతంగా ఉండే కొలువుకోసం చేస్తున్నారు. వేతనాలు పెంచినా నట్టేట ముంచే సంస్థలో చేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజీనామాల పర్వం మొదలైంది. అమెరికాలో ఇప్పటికే ఆగస్టు 1.4 కోట్ల ఉద్యోగాలు ఖాళీ అయ్యాయి. కంపెనీలు జీతాలు పెంచి బోనస్ లు ఇస్తామన్నా కూడా చేరడం లేదు. ఐరోపాలో జర్మనీలో ఆరు శాతం, యూకే 4.7శాతం మంది ఉద్యోగాలు వదిలేశారు..
* కొసమెరుపు:
తెలుగులోనే ఓ టాప్ ప్రధాన పత్రిక ఇంతవరకూ బయట నుంచి రిక్రూట్ మెంట్లను చేపట్టలేదు. ప్రతి సంవత్సరం ‘జర్నలిజం’ స్కూలు నోటిఫికేషన్ వేసి భర్తీ చేసేది. కానీ ఇప్పుడు అందులో పనిచేసే జర్నలిస్టులు అంతా జాతీయ మీడియా తెలుగులో వెబ్ సైట్లు పెట్టడంతో అందులోకి వెళ్లిపోయారట.. ఆ బ్రాండ్ జర్నలిస్టులకు భారీ వేతనాలిచ్చి తీసుకుపోయారట.. అందుకే తొలిసారి బయట నుంచి జర్నలిస్టులను రిక్రూట్ చేసుకుంటోంది. ఇదీ ప్రస్తుతం ఉద్యోగాలకు ఉన్న డిమాండ్. నచ్చని సంస్థను వదిలి మెరుగైన జీవితం కోసం రాజీనామాలు చేస్తున్న ఉద్యోగుల కథ ఇదీ..