Lakshmi Parvathi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1995 ఓ సంచలనమే. చంద్రబాబు ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి అధికారం చేజిక్కించుకోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీనిపై అందరికి ఎన్నో సందేహాలున్నాయి. దీంతో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ -2 షోలో చంద్రబాబు, బాలయ్య మధ్య జరిగిన సంభాషణలు కొత్త చర్చలకు దారి తీసింది. నాటి పరిస్థితులపై చంద్రబాబును ప్రశ్నించడంతో ఆయన సరైనదే అని సమాధానం చెప్పడంతో పలువురు స్పందించారు. దీనిపై వైసీపీ నేత లక్ష్మీపార్వతి మాట్లాడుతూ బాలయ్య అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబుకు ఎన్టీఆర్ మీద కక్ష ఉండేదని పేర్కొన్నారు.

అధికారం కోసం చంద్రబాబు దేనికైనా తెగిస్తారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచారు. ఎమ్మెల్యేలను కావాలనే తన వైపుకు లాక్కొని ఎన్టీఆర్ ను పదవీచ్యుతుడిని చేయడంలో బాబు కుట్రలు అందరికి తెలిసినవే. ఇద్దరు బాలయ్య, బాబు దొందూ దొందే అని విమర్శించారు. ఎన్టీఆర్ ను అధికారానికి దూరం చేయడానికే అలా ప్రవర్తించారని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. చంద్రబాబు బాలయ్యకు వేసిన ప్రశ్నకు ఆయన మీరు చేసింది కరెక్టే అని చెప్పడాన్ని లక్ష్మీపార్వతి తప్పుబట్టింది. బావబావమరుదులు ఇద్దరు తోడు దొంగలే అని అభివర్ణించింది.

ఎన్టీఆర్ ఫొటోలు తీసి బాత్రూంలో పడేసిన చంద్రబాబుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదు. బాలయ్య బావకు తోడుగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. అందుకే అంత రాద్ధాంతం జరిగినా అందులో నీ తప్పులేదని చెప్పడం గమనార్హం. అధికారానికి దూరం చేసి ఆయన మరణానికి కారకులైన వారిని పొగుడుతూ మాట్లాడటంపై లక్ష్మీపార్వతి మండిపడింది. నైతిక విలువలు లేని వారు రాజకీయాల్లో రాణించలేరని చెబుతున్నారు. బాలయ్య, బాబు ఇద్దరు ఎన్టీఆర్ ను ముంచిన వారేనని చెబుతోంది.