Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ ఆ మూడు గుర్తులు... భయపెడుతున్నాయి!

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో మళ్లీ ఆ మూడు గుర్తులు… భయపెడుతున్నాయి!

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. హ్యాట్రిక్‌పై బీఆర్‌ఎస్‌ దృష్టిపెట్టగా, కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ పనిచేస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌)కు మూడు గుర్తులు ఇబ్బందిగా మారాయి. ఆ ఎన్నికలలో కారు గుర్తును పోలిన సింబల్స్‌ కొంతమంది ఓటమికి లేదా మెజారిటీ తగ్గడాడనికి కారణమయ్యాయి. ఆ గుర్తులపై గులాబీ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. కానీ ఎన్నికల సంఘం పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆ మూడు గుర్తులను తొలగించాలని, ఎవరికీ కేటాయించరాదని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కానీ, పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఓటర్లు విజ్ఞులని, పిటిషన్‌ విచారణకు అర్హత లేదని తోసి పుచ్చింది. కారుకు, రోడ్‌ రోలర్‌ వంటి ఇతర గుర్తులకు మధ్య తేడాను ఓటర్లు తెలుసుకోగలరని జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓకా, పంకజ్‌ మిత్తల్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో బీఆర్‌ఎస్‌ చివరి ఆశలు ఆవిరయ్యాయి.

మళ్లీ అవే గుర్తులు..
ఎన్నికల్లో ఏ గుర్తులు అయితే కేటాయించొద్దని బీఆర్‌ఎస్‌ కోరుతోందో.. ఇప్పుడ అవే గుర్తులు ఈసారి ఎన్నికల్లో కూడా ప్రత్యక్షం కానున్నాయి. వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న గుర్తింపు పార్టీ అభ్యర్థులకు ఆ పార్టీ సింబల్స్‌ కేటాయించారు. స్వతంత్రులకు మాత్రం ఈసీ ట్రక్, రోడ్‌ రోలర్, ఆటో రిక్షా, చపాతీ రోలర్, కెమెరా, టెలివిజన్, ఓడ, కుట్టు మిషన్‌ వంటి గుర్తులను కేటాయించింది. నిజానికి గతంలో కూడా బీఆర్‌ఎస్‌ ఎలక్షన్‌ కమిష¯Œ కు ఫిర్యాదు చేయడంతో 2011లో రోడ్‌ రోలర్‌ గుర్తును తొలగించారు. కానీ, ఇటీవల వేరే పార్టీకి ఆ గుర్తును కేటాయించింది ఎలక్షన్‌ కమిషన్‌.

గతంలో తీవ్ర నష్టం..
బీఆర్‌ఎస్‌(ఇంతకుముందు టీఆర్‌ఎస్‌) గతంలో ఇలా ఇతర గుర్తుల కారణంగా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో, 2019 లోక్‌ సభ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో నష్టపోయిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ట్రక్‌ గుర్తుతో 58 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేశారు. రోడ్‌ రోలర్‌ గుర్తుతో 31 నియోజకవర్గాలలో అభ్యర్థులు పోటీ చేశారు. ట్రక్‌ గుర్తుపై పోటీ చేసినవారిలో కొందరు ఇండిపెండెట్లు కాగా, కొన్ని నియోజకవర్గాలలో ‘సమాజ్‌వాది ఫార్వర్డ్‌ బ్లాక్‌’ అనే రిజిష్టర్డ్‌(అన్‌రికగ్నైజ్డ్‌) పార్టీ అభ్యర్థులు పోటీ చేశారు. కొన్ని స్థానాలలో కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మార్క్సిస్ట్‌ – లెనినిస్ట్‌ –లిబరేషన్‌), సమాజ్‌వాది పార్టీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నుంచి పోటీ చేసినవారికి కేటాయించారు. ట్రక్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులున్న స్థానాలలో ఎల్లారెడ్డి, రామగుండం, మంథని, సంగారెడ్డి, ఎల్బీనగర్, మహేశ్వరం, తాండూర్, కొల్లాపూర్, హుజూర్‌నగర్, మునుగోడు, నకిరేకల్, భూపాలపల్లి, పినపాక, సత్తుపల్లి, భద్రాచలం సీట్లలో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది.

– నకిరేకల్‌(ఎస్‌సీ)లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన వేముల వీరేశం 8,259 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ట్రక్‌ గుర్తుపై పోటీ చేసిన దుబ్బా రవికుమార్‌కు 10,383 ఓట్లు వచ్చాయి. ఇది గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ.

– తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిత్‌రెడ్డి చేతిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం మహేందర్‌ రెడ్డి 2,589 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈ నియోజకవర్గంలో ట్రక్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. రోడ్‌ రోలర్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 639 ఓట్లు వచ్చాయి. ఈ రెండు గుర్తుల ఓట్లు కలిపితే రోహిత్‌ రెడ్డి సాధించిన మెజారిటీ కంటే ఎక్కువ. తాండూరులో ట్రక్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి పేరు కూడా పి.మహేందర్‌ రెడ్డి. పేరు, గుర్తులో పోలిక ఉండడం వల్లే తమ అభ్యర్థికి రావాల్సిన ఓట్లను నష్టపోయామన్నది బీఆర్‌ఎస్‌ నేతల వాదన.

– సంగారెడ్డి నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తూర్పు జయప్రకాశ్‌ రెడ్డి(జగ్గారెడ్డి) గెలిచారు. ఆయనకు 76,572 ఓట్లు రాగా, టీఆర్‌ఎస్‌(బీఆర్‌ఎస్‌) నుంచి కారు గుర్తుతో పోటీ చేసిన చింత ప్రభాకర్‌కు 73,989 ఓట్లు వచ్చాయి. ఇద్దరి మధ్య ఓట్ల తేడా 2,589. ఈ నియోజకవర్గంలో ట్రక్‌ గుర్తుపై పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రామచందర్‌కు 4,140 ఓట్లు వచ్చాయి. ఇది విజేత జగ్గారెడ్డి సాధించిన ఆధిక్యం కంటే ఎక్కువ. బీఆర్‌ఎస్‌ అభ్యంతరం వ్యక్తంచేస్తున్న మరో గుర్తు టెలివిజన్‌తో పోటీ చేసిన అభ్యర్థికి ఈ నియోజవకర్గంలో 738 ఓట్లు వచ్చాయి.

ఈ నియోజకవర్గాల్లో తక్కువ..
ఇక ఎల్లారెడ్డి, రామగుండం, మంథని, ఎల్బీనగర్, మహేశ్వరం, కొల్లాపూర్, హుజూర్‌నగర్, మునుగోడు, భూపాలపల్లి, పినపాక, సత్తుపల్లి, భద్రాచలంలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఓటమి పాలైనా, అక్కడ గెలిచినవారి ఆధిక్యం కంటే ట్రక్‌ గుర్తుకు పడిన ఓట్లు బాగా తక్కువ వచ్చాయి. 58 నియోజకవర్గాల్లో ట్రక్‌ గుర్తుతో అభ్యర్థులు పోటీ చేయగా, 21 సీట్లలో మూడో స్థానంలో, 22 సీట్లలో నాలుగో స్థానంలో నిలిచారు. ట్రక్‌ గుర్తు అత్యధికంగా మానకొండూర్‌లో 13,610 ఓట్లు సాధించింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బెల్లంపల్లిలో అత్యధికంగా 8.38 శాతం ఓట్లు సాధించింది. బెల్లంపల్లి, కామారెడ్డి, ధర్మపురి, నకిరేకల్, జనగాంలలో ట్రక్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థులు 10 వేల కంటే ఎక్కువ ఓట్లు పొందారు.

– ధర్మపురి(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కొప్పుల ఈశ్వర్‌ కేవలం 441 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ట్రక్‌ గుర్తు అభ్యర్థికి 13,114 ఓట్లు(పోలైనవాటిలో 7.91 శాతం) వచ్చాయి.

– కామారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 4,557 ఓట్లతో గెలిచారు. అక్కడ ట్రక్‌ గుర్తు అభ్యర్థి 10,537 ఓట్లు(6.57 శాతం) సాధించారు.

– అంబర్‌పేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటేశ్‌ 1,016 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్‌ గుర్తు అభ్యర్థికి 1,052 ఓట్లు వచ్చాయి.

– కోదాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌ 1,556 ఓట్లతో గెలిచారు. ఈ నియోజకవర్గంలో ట్రక్‌ గుర్తు అభ్యర్థి 5,240 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

– తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ నేత గాదరి కిశోర్‌ 1,867 ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు. ఇక్కడ ట్రక్‌ గుర్తు అభ్యర్థికి 3,729 ఓట్లు వచ్చాయి.

రోడ్‌ రోలర్‌ çకూడా..
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రోడ్‌ రోలర్‌ గుర్తుపై కొందరు అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 31 నియోజవర్గాలలో ఈ గుర్తుతో అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ గుర్తుపై పోటీ చేసినవారిలో 17 చోట్ల అభ్యర్థులు వెయ్యికి పైగా ఓట్లు తెచ్చుకున్నారు. 11 నియోజకవర్గాలలో ఈ గుర్తు అభ్యర్థులకు ఒక శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.

దుబ్బాక ఉప ఎన్నికలో..
కారును పోలిన గుర్తుల విషయానికి వచ్చేసరికి బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రధానంగా గుర్తు చేసేది దుబ్బాక ఉప ఎన్నిక. ఆ ఉప ఎన్నికలో 1,079 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. బీజేపీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు గెలిచారు. ఈ ఉప ఎన్నికల్లో చపాతీ రోలర్‌ గుర్తుతో పోటీ చేసిన అభ్యర్థికి 3,510, కెమెరా గుర్తు అభ్యర్థికి 1,978, ఓడ గుర్తుతో పోటీ చేసిన నాయకుడికి 1,005, రోడ్‌ రోలర్‌ గుర్తు అభ్యర్థికి 544, టెలివిజన్‌ గుర్తు అభ్యర్థికి 354 ఓట్లు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి 10,339 ఓట్లతో గెలిచారు. అక్కడ కూడా చపాతీ రోలర్‌కు 2,407, రోడ్‌ రోలర్‌కు 1,874 ఓట్లు పడ్డాయి. టీవీ గుర్తు అభ్యర్థికి 511, కెమెరా గుర్తు అభ్యర్థికి 502 ఓట్లు వచ్చాయి.

2019 లోక్‌సభ ఎన్నికల్లో..
ఈ ఎన్నికలలో భువనగిరి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 5,219 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అక్కడ రోడ్‌ రోలర్‌ గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థికి 27,973 ఓట్లు వచ్చాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular