Farmhouse Leaks: గుజరాత్ ఎన్నికల వేడిలో కొట్టుకుపోయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లు

Farmhouse Leaks: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో లీకైన ఆడియోలు పెద్దగా ప్రభావం చూపలేదు. దేశం మొత్తం గాయిగత్తరవుతుందని పదేపదే చెప్పిన కేసీఆర్.. విడుదల చేసిన వీడియోల విస్ఫోటనం తుస్సుమన్నది. హైకోర్టుల జడ్జీలు, అత్యున్నత దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయ సంస్థలు, పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి అందరికీ అర్జెంటుగా పంపించారు కదా! వారి ప్రతిస్పందన ఎలా ఉంది? దేశమంతా గగ్గోలు పుడుతున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం జీరో. ఏ వైపు నుంచి కనీస స్పందన […]

Written By: Bhaskar, Updated On : November 5, 2022 9:43 pm
Follow us on

Farmhouse Leaks: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్స్ విషయంలో లీకైన ఆడియోలు పెద్దగా ప్రభావం చూపలేదు. దేశం మొత్తం గాయిగత్తరవుతుందని పదేపదే చెప్పిన కేసీఆర్.. విడుదల చేసిన వీడియోల విస్ఫోటనం తుస్సుమన్నది. హైకోర్టుల జడ్జీలు, అత్యున్నత దర్యాప్తు సంస్థలు, సుప్రీంకోర్టు జడ్జిలు, పాత్రికేయ సంస్థలు, పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి అందరికీ అర్జెంటుగా పంపించారు కదా! వారి ప్రతిస్పందన ఎలా ఉంది? దేశమంతా గగ్గోలు పుడుతున్నదా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం జీరో. ఏ వైపు నుంచి కనీస స్పందన లేదు. అసలు అందులో ఏముందని? ఎవరూ పెద్దగా దేకడం లేదు. ఆ లెక్కకొస్తే తెలంగాణలో గులాబీ మీడియా సంస్థ తప్పించి మిగతా పాత్రికేయ సంస్థలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏపీలో అయితే ఎవరు పెద్దగా స్పందించడం లేదు. బిజెపేతర ముఖ్యమంత్రులు, యాంటీ బిజెపి పార్టీలు కూడా పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. చివరికి ఆ కుమారస్వామి కూడా పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు. ఇవన్నీ సరేగాని ఆ మధ్య జాతీయ రాజకీయాల్లో చక్రాలు తిప్పుతా, దేశం రూపు మారుస్తానని వీరావేశంతో టిఆర్ఎస్ ను బీ ఆర్ ఎస్ చేసిన కేసీఆర్..దానిని అలా అటక మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు గుజరాత్లో ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోనూ ఎన్నికలు నిర్వహించనున్నారు. అంటే టిఆర్ఎస్ బీ ఆర్ ఎస్ గా మారలేదు కాబట్టి ఆ రాష్ట్రాల్లో పోటీ చేయడం లేదా? లేకుంటే పోటీ చేసేదా? మోదీ, అమిత్ షా కు గింగిరాలు తిరిగేవా? లేకుంటే ఆ రెండు రాష్ట్రాల్లో గాయి గత్తర లేచేదా? కెసిఆర్ అనుకున్నంత మాత్రానా ఇప్పుడు అది సాధ్యం కాదు. అక్కడ ప్రచారం చేసేందుకు టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది.

-ఇది ధర్మ యుద్ధంలో భాగమా?

నమస్తే తెలంగాణ చెప్పినట్టు దేశం కోసం ధర్మ యుద్ధం యజ్ఞంలో భాగంగా 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు టీం వెళ్లి హిమాచల్ ప్రదేశ్, బీజేపీ దుర్మార్గ రాజకీయాల గురించి ప్రచారం చేస్తారట?! వినటానికి ఎంత సిల్లిగా ఉంది.. అసలు ఆ వీడియోలనే ఎవరూ పట్టించుకోలేదు. ఈ టిఆర్ఎస్ నాయకులు చెప్పేవి ఎవరు పట్టించుకోవాలి? మొన్నటిదాకా హిందీ అంటేనే మండిపడ్డ కేసీఆర్ టీం లో ఎందరికీ హిందీ వచ్చు? ఆ రెండు రాష్ట్రాల్లో ఏం చెబుతారు? ఒకవేళ తెలుగు వాళ్ళు ఉన్న అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్కోట్, జూనాగడ్, భావనగర్, పోర్ బందర్, ద్వారక, నప్ పారి పఠాన్, సురేంద్ర నగర్, గోద్రా నగరాల్లో ప్రచారం చేస్తారట?! అక్కడి తెలుగు వాళ్లే వాళ్ల వాళ్ల ఇళ్లల్లో విడిది ఏర్పాట్లు చేస్తారట.

-ఫ్లైట్లు, చాపర్లు బుక్ చేసుకున్నారు

ఇక ఈ ప్రచారానికి మూడు ఫ్లైట్లు, రెండు చాపర్లు బుక్ చేసుకున్నారట. ఆరు విడతల్లో గుజరాత్లో బిజెపి బట్టలు విప్పుతారట. మరి అక్కడ దాకా వెళ్లాలి కదా. అవును గాని గత జనవరిలో ఇలాగే ఉత్తర ప్రదేశ్ లో ఎన్నికలు జరిగినప్పుడు యాంటీ బిజెపి వ్యతిరేక ప్రచారం చేస్తామని పింక్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని నియమించి పంపిస్తామని డబ్బాలు కొట్టారు.. పంపించారా?! హిమాచల్ ప్రదేశ్ లో తెలుగువారు లేరు. సోహాన్ ప్రాంతంలో ఉన్నా అక్కడ సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ కాపలా కాస్తుంది.. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే కాల్చిపారేస్తుంది. ఇక గుజరాత్ లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నాలుగు రోజుల బాగోతానికి ఒకేసారి వాళ్ళు బీజేపీకి వ్యతిరేకమై పోరు. వాళ్ళకి స్థానిక రాజకీయాలు, పరిస్థితులు, భవిష్యత్తులో వారి స్థితిగతులు చాలా ముఖ్యం. నమస్తే తెలంగాణ చెప్పినట్టు దేశం కోసం ధర్మం యుద్ధంలో గుజరాత్లో తెలుగు వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి? కాంగ్రెస్ కా? గుజరాత్ లో, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ బిజెపికి ప్రధాన ప్రత్యర్థి. టిఆర్ఎస్ భారీ టీం, భారీ ఖర్చుతో ప్రచారం చేస్తే అది అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడాలా? వారెవ్వా ఏం స్ట్రాటజీ? ఇదేనా దేశం కోసం ధర్మ యుద్ధం అంటే? పోనీ ఈ ప్రచారానికి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి సహకరించబోయే లేదా విలీనం కాబోయే ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ ఉంది కదా! సాయం తీసుకుంటే గుజరాత్ లో కూడా యాంటీ బీజేపీ ప్రచారం చేయవచ్చు కదా. అర్థం కాలేదు కదా ఆ పార్టీ నాయకులు పేరు వాఘెలా. ఆ మధ్య కేసీఆర్ ను కలిశాడు. ఇద్దరు కలిసి ప్రగతి భవన్ లో భేటీ కూడా వేశారు. మస్తు మంతనాలు జరిపారు. మోదీ అనుపానులు మొత్తం వాఘెలా చెప్పినట్టు నమస్తే తెలంగాణ మస్తు రాసింది.. తాట తీయడమే మిగిలింది అని చెప్పింది. ఆ తర్వాత ఊదు కాలింది లేదు. పీరి లేచింది లేదు. ఈ 82 ఏళ్ల వాఘెలా ఒకప్పుడు మోదీ గురువు. అప్పట్లో కమలాన్ని చీల్చి కాంగ్రెస్ మద్దతుతో సీఎం అయ్యాడు. ఆ చీలికకు పెట్టిన పేరు రాష్ట్రీయ జనతా పార్టీ. తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయాడు. బయటికి వచ్చాడు. 2017లో జన వికల్ప మోర్చా అనే ఓ సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఎన్నికల సంఘం పార్టీని గుర్తించకపోతే ఎక్కడో జైపూర్ కేంద్రంగా ఉన్న ఆల్ ఇండియా హిందుస్థాన్ కాంగ్రెస్ పార్టీ అనే ఓ అనామక పార్టీ పేరిట 95 స్థానాల్లో పోటీ చేశాడు. మొత్తం వచ్చిన ఓట్లు 85,000. ఒకప్పటి సీఎం సాధించిన ఓట్లు అవే మరి. తర్వాత ఎన్సీపీలో చేరాడు. ఆ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి వాఘెలా ను పీకి పారేసింది. ఇప్పుడు ప్రజా శక్తి డెమోక్రటిక్ పార్టీ అని కొత్త దుకాణం తెరిచాడు. ఇలాంటి వాళ్ళతో కేసీఆర్ చక్రాలు తిప్పుతాడట!? నమస్తే ప్రకారం ఇది ధర్మ యుద్ధం.. సారీ సారీ యజ్ఞం.