https://oktelugu.com/

TRS Plenary: కేసీఆర్‌ సేఫ్‌ గేమ్‌… ప్రత్యర్థుల పేరెత్తని గులాబీ అధినేత

TRS Plenary : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు చప్పగా ముగించారు. ఇదీ టీఆర్‌ఎస్‌ పార్టీ 21న రోజు వేడుకలపై సొంత పార్టీ నేతలే చేస్తున్న కామెంట్‌.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ పండుగ చప్పగా ముగిసింది. ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పార్టీ.. ఈ వేడకలో సీఎం, గులాబీ బాస్‌ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ ప్రసంగంపై అందరూ దృష్టిసారించారు. కానీ కేసీఆర్, కేటీఆర్‌ ప్రసంగం చప్పగా సాగాయి. గులాబీ శ్రేణులకు నిరాశను మిగిల్చాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : April 27, 2022 / 08:06 PM IST
    Follow us on

    TRS Plenary : అంతన్నారు.. ఇంతన్నారు.. చివరకు చప్పగా ముగించారు. ఇదీ టీఆర్‌ఎస్‌ పార్టీ 21న రోజు వేడుకలపై సొంత పార్టీ నేతలే చేస్తున్న కామెంట్‌.. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ పండుగ చప్పగా ముగిసింది. ఆర్భాటాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పార్టీ.. ఈ వేడకలో సీఎం, గులాబీ బాస్‌ కేసీఆర్, ఆయన తనయుడు కేటీఆర్‌ ప్రసంగంపై అందరూ దృష్టిసారించారు. కానీ కేసీఆర్, కేటీఆర్‌ ప్రసంగం చప్పగా సాగాయి. గులాబీ శ్రేణులకు నిరాశను మిగిల్చాయి. కేసీఆర్‌ కంటే ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ప్లీనరీకి వచ్చిన ప్రతినిధులకు కొంతమేర ఊరటనిచ్చింది. కొన్నాళ్లుగా ప్రత్యర్థులపై ఎదురుదాడి, పదునైన తిట్ల దండకంతో విరుచుకుపడుతున్న టీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ తన సహజ శైలికి భిన్నంగా కనీసం ప్రత్యర్థి పేరు ప్రస్తావించకుండా ప్లీనరీలో మాట్లాడటం చర్చనీయాంశమైంది.

    KCR

    ఆ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారు..
    ప్రత్యర్థులను చీల్చి చెండాడటంలో కేసీఆర్‌ను మించిన మాటకారి లేరని జాతీయ స్థాయిలోనూ పేరుంది. మూడు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ, ఎంచుకున్న టార్గెట్‌పై దాడి చేయడంలో తాను నిపుణుడినని కేసీఆర్‌ ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నారు. కానీ కారు పార్టీ అధినేత ఇప్పుడు గేరు మార్చినట్లు కనిపిస్తున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితం తర్వాత బీజేపీని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రాన్ని మరింత పరుషంగా తిడుతూ వచ్చిన కేసీఆర్‌.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో మాత్రం ఒక్కటంటే ఒక్కసారి కూడా బీజేపీ పేరెత్తలేదు.

    Also Read: Sri Reddy: సీఎం కొడుకును హోటల్‌లో కలిశా… బెడ్‌ షేర్‌ చేసుకున్నాం.. శ్రీరెడ్డి సంచలన కామెంట్స్‌!

    గంటకుపైగా ప్రసంగం..
    టీఆర్‌ఎస్‌ 21వ పుట్టిన రోజు వేడుకల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ గంటకుపైగా ఉపన్యసించారు. దేశం దుస్థితిని ఆవిష్కరించి, స్థూలంగా వైఫల్యాలను చెప్పుకొచ్చారేగానీ, నేరుగా బీజేపీని గానీ, కాంగ్రెస్‌ను గానీ, ప్రధాని మోదీ పేరును గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. దేశంలో అలా జరుగుతోంది, పొరుగు రాష్ట్రాల్లో ఇలా జరుగుతోంది అంటూ పరోక్ష విమర్శలే చేశారు. కేసీఆర్‌ వాణిలో ఇంతటి మార్పునకు కారణం ప్రశాంత్‌ కిశోర్‌ వ్యూహాలేనని తెలుస్తోంది. ప్లీనరీ ప్రత్యేక వేదిక కాబట్టి అక్కడ కేసీఆర్‌ సంయమనం పాటించారనుకోడానికీ వీల్లేదు. ఎందుకంటే, ఇతర తీర్మానాలపై మాట్లాడిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఇంకొందరు మంత్రులు మాత్రం బీజేపీని గట్టిగానే అర్సుకున్నారు. తద్వారా ప్రత్యర్థలపై విమర్శల విషయంలో స్పష్టమైన స్థాయి తేడా ఉండాలన్న సూచన అమలవుతోన్నట్లు అవగతం అవుతోంది.

    -దేశవ్యాప్తంగా ఆసక్తి..
    తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మోదీ–బీజేపీపై కేసీఆర్‌ ఇప్పటికే యుద్ధం ప్రకటించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలాబలాపై గులాబీ బాస్‌ విస్తృత సర్వేలు.. చేయించారు. ఇదే సమయంలో ప్రశాంత్‌ కిశోర్‌ రంగ ప్రవేశం చేశారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పనిచేస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. కేంద్రంతో యుద్ధం.. అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శల హోరు.. తదితర అంశాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నిర్వహించిన ప్లీనరీపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అందరూ ఊహించినట్లుగానే కేసీఆర్‌ తన జాతీయ అజెండాను ప్రకటించారు. ఫలానా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఫ్రంట్‌ నిర్మాణం.. కొందరు సీఎంలతో కూటమి కట్టడం.. ఫలానా వ్యక్తిని ప్రధాని పదవి నుంచి దించేయడం.. లాంటివి తమ లక్ష్యం కాదని, దేశం గతిని మార్చేసే అజెండా రూపకల్పనే ధ్యేయమని కేసీఆర్‌ చెప్పారు. ఇవి కేసీఆర్‌ తరచూ చేసే రాజకీయ విమర్శలకు పూర్తి భిన్నం. బీజేపీని బంగాళాఖాతంలో కలపడమే తన ధ్యేయమని, దేశానికి మోదీ రూపంలో పట్టిన పీడ విరగడ కావాల్సిందేనని మొన్నటిదాకా వాదించిన కేసీఆర్‌ ఇప్పుడు సడెన్‌గా భాషను మార్చేసి.. భావానికి ప్రధాన్యం ఇవ్వడం చర్చనీయాంశమైంది.

    TRS Plenary

    -రాష్ట్ర నేతల పేరూ ప్రస్తావించని వైనం..
    టీబీజేపీ చీఫ్‌ బండి సంజయ్, స్థానిక నేతలపై దూషణలకు సైతం వెనుకాడని కేసీఆర్‌ ప్లీనరీలో మాత్రం అసలు తన ప్రత్యర్థులెవరో స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయలేదు. బీజేపీ బేసిగ్గా వివాదాలు సృష్టించి లబ్దిపొందాలనుకునే పార్టీ కాబట్టి వాళ్లను విమర్శించడం పూర్తిగా మానేసి, వైఫల్యాలను మాత్రమే ఎత్తిచూపుతూ, బీజేపీ విధానాలతో కలిగే నష్టాలను వివరిస్తూ, మనమేం చేయగలమో ప్రజలకు వివరిస్తే సరిపోతుందన్న పీకే ఐడియాను కేసీఆర్‌ ఇవాళ్టి ప్రసంగంలో అడుగడుగునా పాటించారు. మరోవైపు పీకే సూచనల మేరకే కేసీఆర్‌ ప్రత్యర్థులపై దూకుడు ధోరణి మార్చుకున్నప్పటికీ రాజకీయాలు పండాలంటే కచ్చితంగా ఒక ఎమోషనల్‌ పాయింట్‌ అవసరం కాబట్టి.. 8 ఏళ్లు అధికారంలో ఉండి మళ్లీ తెలంగాణ వాదం పేరుతో ఓట్లు అడగలేరు కాబట్టి వ్యూహకర్తల సలహాలు, స్వీయ అనుభవాలతో కేసీఆర్‌ ప్రత్యామ్నాయ జాతీయ అజెండాను తెరపైకి తెచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ వేదిక అంశంపై కేసీఆర్‌ ఇవాళ మాట్లాడిన మాటలన్నీ గత కొంతకాలంగా పీకే పలు ఇటర్వ్యూల్లో చెబుతూ వస్తున్నవే కావడం గమనార్హం.

    -పీకే సేఫ్‌ గేమ్‌..
    వ్యక్తిగతంగా పీకే.. బీజేపీకి కాంగ్రెస్‌ ప్రత్యామ్నాయం కాగలదని నమ్మడం, అందులో చేరేందుకు విఫలయత్నం చేయడం, అంతకు ముందు మమతా బెనర్జీ టీఎంసీని జాతీయ పార్టీగా విస్తరించాలనే ప్రయత్నంలోనూ దెబ్బతినడం వేరే అంశాలు. ఫలితమివ్వని ప్రతిసారి ఐడియాలను మార్చుకుంటూ పోవడం పీకేకు అలవాటనే వాదన ఉండగా.. కేసీఆర్‌ మొన్నటిదాకా బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల ఐక్యతను ఆకాంక్షించి.. ఇప్పుడు సడన్‌గా పార్టీల ప్రస్తావన లేని ప్రత్యామ్నాయ అజెండా వైపునకు మళ్లడాన్ని పీకే మార్కు సేఫ్‌ గేమ్‌ అనే విశ్లేషణలు వస్తున్నాయి. కేసీఆర్‌ను బీజేపీ వ్యతిరేకిగా గుర్తించడానికి దేశంలోని పార్టీలేవీ సిద్ధంగా లేకపోవడం, పలు అంశాల్లో విపక్షాల ఉమ్మడి ప్రకటనల్లోనూ కేసీఆర్‌ పేరును చేర్చకపోవడం లాంటి వ్యతిరేక పరిణామాల నడుమ కేసీఆర్‌ ఒక విస్తృత అజెండాను.. అది కూడా పార్టీల ప్రస్తావన లేని అజెండాను ఎంచుకోవడమే సేఫ్‌ గేమ్‌ అనే భావనే వ్యక్తమవుతోంది. మరి పీకే చెప్పినట్లు పార్టీలను తిట్టకుండా అజెండాల పేరుతో కేసీఆర్‌ తన సహజ నైజాన్ని మార్చుకుంటే అది టీఆర్‌ఎస్‌కు లాభిస్తుందా? కారు గేరు మార్పు ప్రమాదానికి దారి తీస్తుందా లేక సాఫీగా గమ్యానికి చేరుతారా? అనేది తేలాల్సిఉంది.

    Also Read:Abu Dhabi: బాల్కనీలో బట్టలు ఆరేస్తే అంతే.. రూ.20 వేల జరిమానా కట్టుకోవాల్సిందే

    Recommended Videos:

    Tags