Gita Gopinath : ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. అమెరికా నుంచి మొదలుపెడితే ఇంగ్లాండ్ వరకు అన్ని కంపెనీలు ఉద్యోగులను బయటికి పంపిస్తున్నాయి. కేటాయింపులలో కోతలు విధిస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంపై కూడా పడుతోంది. మన దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉండడం వల్ల తీవ్రమైన ప్రభావం కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో మన దేశానికి ముప్పు లేదని భావించకూడదు. ఆర్థిక సంస్కరణలను మరింత ముమ్మరం చేయాలి. వ్యవసాయ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టాలి. అప్పుడే మన దేశం ఆర్థికంగా మరింత స్థిరత్వం సాధిస్తుంది. ఇవే కాకుండా ఇంకా కీలకమైన అంశాలలో మరింత దూకుడుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు..
జనాభా పెరుగుదల దృష్ట్యా
భారత్లో జనాభా పెరుగుదల దృష్ట్యా 2030 నాటికి అదనంగా 14.8 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని గీత పేర్కొన్నారు. ఉపాధి కల్పన విషయంలోనూ జీ -20 దేశాల కంటే భారత్ వెనుకబడి ఉందని ఆమె ఉటంకించారు.. ఢిల్లీలోని ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైమండ్ జూబ్లీ ఈవెంట్లో పాల్గొన్న ఆమె పై వ్యాఖ్యలు చేశారు. “2010 నుంచి ప్రతి దశాబ్దంలోనూ భారత్ స్థిరమైన వృద్ధిరేటును సాధిస్తోంది. సగటున 6.6 వృద్ధిని కొనసాగిస్తుంది. ఇదే సమయంలో ఉపాధి రేటు రెండు శాతం కంటే తక్కువగా ఉంది. అందువల్లే జీ -20 దేశాలతో పోలిస్తే ఇండియాలో ఉపాధి వృద్ధిరేటు కాస్త తక్కువగా ఉంది. దేశంలో జనాభా మాత్రం వృద్ధిరేటును కొనసాగిస్తోంది. 2030 నాటికి ప్రస్తుతం ఉన్న ఆరు కోట్ల నుంచి 14.8 కోట్ల అదనపు ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం 2024 లో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఆరు సంవత్సరాల లోనే భారీగా ఉద్యోగాలు సృష్టించాల్సిన అవసరం ఉంది. భూమి, కార్మిక సంస్కరణలను అమలు చేయాలి. ప్రభుత్వ పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రవేటు పెట్టుబడులు ఇంకా కాస్త మెరుగుపడాలి. విద్యా వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తే యువత నైపుణ్యాలు పెంచుకునేందుకు అవకాశం కలుగుతుంది. వ్యాపార నిర్వహణ, ఇతర నిబంధనలను సరళతరం చేస్తే పన్ను పరిధి విస్తృతమవుతుంది. ఆర్థిక వ్యవస్థ మరింత వేగవంతమవుతుందని” గీత వ్యాఖ్యానించారు.
అలా చేస్తేనే ఆదాయం
వస్తు సేవలకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం జీఎస్టీ అమలు చేస్తోంది.. అయితే ఈ రేట్లను మరింత హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని, సరళతరం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉందని గీత వ్యాఖ్యానించారు. దీనివల్ల జిడిపిలో ఒక్క శాతం ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు..”ఎరువుల రాయితీలపై ప్రభుత్వం పునరాలోచించాలి. కర్ణాటక ప్రభుత్వం ఒక పైలెట్ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. పొలాల పరిమాణానికి అనుగుణంగా రాయితీలను అందిస్తోంది. అలాంటి విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తే బాగుంటుంది. Direct beneficiary transfer విధానం వల్ల ప్రభుత్వానికి డబ్బు ఆదా అవుతోంది. ఇదే సమయంలో దీనిని అన్ని పథకాలకు వర్తింపజేస్తే బాగుంటుంది. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే నైపుణ్యం పెరగాలి. మౌలిక సదుపాయాలు మరింత విస్తృతం కావాలి. న్యాయవ్యవస్థ సమర్థతను సంపాదించుకోవాలి. మార్కెట్ మరింత పెరగాలి. సంస్కరణలను మరింత వేగంగా అమలు చేయాలని” గీత వ్యాఖ్యానించారు.