Rushikonda: సాగర నగరంలో వైసీపీ ప్రభుత్వం విధ్వంసాలకు అడ్డుకట్ట పడడం లేదు. అడ్డూ అదుపు లేకుండా అడ్డగోలుగా పర్యాటక ప్రాంతాలను చెరబడుతున్నారు. యంత్రాలతో భారీ విధ్వంసానికి తెగబడుతున్నారు. పర్యాటకం మాటున సాగర అందాలను నిర్వీర్యం చేస్తున్నారు. విశాఖ లో రుషికొండ పర్యాటక ప్రాజెక్టు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విధ్వంసం ఒక్క కొండతోనే ఆగిపోలేదు. లెక్కలేనన్ని అరాచకాలు అక్కడ జరుగుతున్నాయి. ఆ పరిసరాలన్నీ తమ సొంతం అన్నట్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎవరూ ఆ వైపు రాకుండా చుట్టూ రేకులతో పెద్ద ప్రహరీ నిర్మించేశారు.

ఇందుకోసం గీతం విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మోడరన్ బస్టాప్‌ను నేలమట్టం చేశారు. గీతం యూనివర్సిటీకి నగరం నలుమూలల నుంచి రోజూ వేలాది మంది విద్యార్థులు వస్తారు. బస్సులు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తాయి. వారి కోసం గీతం కాలేజీ ఎదురుగా, రుషికొండను ఆనుకొని గతంలో సుమారుగా రూ.85 లక్షలతో బస్ స్టాప్ ను నిర్మించారు. అందులో మహిళలకు ప్రత్యేకంగా అద్దాల కేబిన్లు ఏర్పాటుచేశారు. ప్రయాణికులు కూర్చోవడానికి గ్రానైట్ పలకలు అమర్చారు. నగరంలో పలుచోట్ల అలాంటి బస్ స్టాప్ లు నిర్మించాలని అధికారులు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంతలా నగరవాసులను ఆకట్టుకున్న బస్ స్టాప్ ను రుషికొండ తవ్వకాలకు అడ్డం వస్తోందని నేలమట్టం చేసేశారు. ఇప్పుడు అక్కడ విద్యార్థులు, ప్రయాణికులు నిల్చోవడానికి నీడ కూడా లేకుండా చేశారు. ఈ బస్టాపును విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నిర్మించింది. వారికి నష్టపరిహారం ఇవ్వలేదు. మరోచోట బస్టాప్ నిర్మించలేదు. ఇక్కడికి కొంతదూరంలో గాయత్రి కాలేజీ విద్యార్థుల కోసం మరో బస్టాప్ ఉంది. దానిని కూడా ప్రహరీలో కలిపేసుకున్నారు. దుమ్ము, ధూళి పేరుకుపోవడంతో అక్కడకు వెళ్లడానికి అంతా భయపడుతున్నారు.
Also Read: Amravati: అమరావతి ఉద్యమానికి 900 రోజులు..అలుపెరగని పోరాటం చేసిన రైతులు
బీచ్ దారులు బంద్..
విశాఖ నగరానికి బీచ్ రోడ్డు అత్యంత అందమైన ప్రాంతం. దాదాపు భీమిలి నుంచి విశాఖ వరకూ ఉండే రహదారిపై ప్రయాణానికి వాహన చోదకులు, టూరిస్టులు ఇష్డపడతారు. కానీ ప్రస్తుతం బీచ్ ప్రాంతంలో దారులన్నీ మూసేశారు. రుషికొండ బీచ్‌లోకి వెళ్లడానికి గీతం కాలేజీ ఎదురుగా హరిత రిసార్ట్స్ పక్కనుంచి ఒక మార్గం ఉంది. అది కాకుండా రిసార్ట్‌కు 200 మీటర్ల ముందు రూ.40 లక్షల వ్యయంతో కొత్తగా బీచ్‌లోకి మరో మార్గం వేశారు. అటు వైపు నుంచి కార్లు, ఇతర వాహనాలు వెళ్లడానికి టోల్‌ఫీజు కూడా వసూలు చేసేవారు. ఆ మార్గం ఎంతో అందంగా ఉండేది. కొండ తవ్వకాలు మొదలైన తరువాత ఆ మార్గం కూడా మూసేశారు.కేంద్ర ప్రభుత్వం పరిశుభ్రంగా వుండే బీచ్‌లను గుర్తించి వాటికి ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు ఇస్తోంది. వాటి అభివృద్ధికి రూ.7 కోట్ల చొప్పున నిధులు కూడా మంజూరుచేసింది. దేశంలో 13 బీచ్‌లకు ఇటువంటి గుర్తింపు రాగా ఏపీలో ఒక్క రుషికొండకే ఆ సర్టిఫికేషన్ వచ్చింది. అయితే రుషికొండను ఇష్టానుసారంగా తవ్వడం వల్ల బీచ్ మొత్తం దుమ్ము, ధూళితో నిండిపోయి పరిశుభ్రత ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఈ బీచ్‌కు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ రాదని పర్యాటక శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

రూపురేఖలు మారుతున్నాయి..
రుషికొండను తవ్వేసిన రాష్ట్ర ప్రభుత్వం భీమిలి మార్గంలో ఉన్న ఇతర బీచ్‌ల రూపురేఖలూ మార్చేసింది. ఈ ప్రాంతం పర్యాటకానికి అనువుగా ఉండడంతో అధికార పార్టీ నేతలు ఎక్కడికక్కడ స్థలాలు ఆక్రమించి, రెస్టారెంట్లు పెడుతున్నారు. అటువంటి వారికి అనుకూలంగా ఉండేందుకు…రుషికొండలో తవ్విన మట్టిని తీసుకువెళ్లి మంగమూరిపేట, తొట్లకొండ తదితర ప్రాంతాల్లో పోసి లోయలన్నింటినీ రోడ్డు ఎత్తుకు లెవెల్ చేసేశారు. దీంతో అక్కడ వ్యాపారాలు చేసుకునే వెసులుబాటు కలిగింది. అయితే ఇసుక స్థానంలో మట్టి వేయడం వల్ల అక్కడ సముద్ర జీవరాశుల మనుగడకు ఇబ్బందులు వస్తాయని, అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా సాగర నగరంపై ఈ విధ్వంసం ఏమిటని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. ప్రశాంతతకు నెలవు అయిన నగరంలో విధ్వంసాలకు దిగుతుండడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. ఇది నగర చరిత్రను మసకబార్చడమేనంటున్నారు.
Also Read:BJP vs KCR: కేసీఆర్ కు బ్యాడ్ టైం.. బీజేపీకి వెల్లువలా అవకాశాలు?