
ఆరేళ్ల సర్వీసు ఉండగానే పోలీసు శాఖనుంచి స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి తప్పుకున్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. బహుజనుల బతుకులు మారాలంటే తనవంతు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఉద్యోగంలో ఉండి కొంత మార్పు తీసుకొచ్చానని, అయితే అది ఒక శాతం మాత్రమేనని, ఇప్పుడు పూర్తిగా బడుగుల సంక్షేమం కోసం పాటుపడుతానని చెప్పుకొచ్చారు. దోపిడీ, బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే బహుజన సిద్ధాంతాలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
‘75 ఏళ్ల స్వాతంత్ర్య కాలంలో బహుజనులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. సంపన్నులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. దేశ సంపదంతా కొన్ని వర్గాల చేతిలో మాత్రమే నిక్షిప్తమై ఉంది. ఆ ఫలలాను పేదలందరూ పొందేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కేవలం పింఛన్లు, సబ్సిడీలు తీసుకునే స్థాయి వరకే బహుజనులు ఉన్నారని, అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
అగ్రకులాలకు చెందిన అధికారులు వారి పేర్ల చివర ట్యాగులను పెట్టుకోరు. అయితే నన్ను ప్రతీ సారి దళిత అధికారి అని పేర్కొనడంపై పెద్ద కుట్రే జరిగింది. వెలమ, రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారికి ఇలాంటి ట్యాగులు పెట్టుకోగలరా..? ఇదంతా దళితులను అక్కడికే పరిమితం చేసే కుట్ర. ఇక ఆ రోజులు పోయాయి.. ఇక నుంచి మార్పు కచ్చితంగా రావాల్సిందే. దాదాపు 2 వేల ఏళ్లుగా ఈ కుట్రలు జరుగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో కంపెనీలు, సంస్థల్లోనూ దళితులకు తీవ్ర అన్యాయం జరగుతోంది. హైటెక్ సిటీలో ఉన్న కంపెనీలు ఎన్ని దళితులకు చెందినవి..? సినిమా రంగంలోనూ బహుజనుల స్థానం ఏంటి..? ఇక తాను బీఎస్పీలోకి చేరుతానన్న మాట అవాస్తవం. అలాగే రాజకీయ లక్ష్యం కోసమే స్వేరేస్ స్థాపించారనడం అవాస్తవం. పార్టీ ఏర్పాటు గురించి ఆలోచించడం లేదన్నారు. ఎప్పటికైనా దళితులకు రాజ్యాధికారం రావాలి. అందుకోసం నావంతు కృషి చేస్తారు. గురుకులాల కార్యదర్శిగా ఉన్న తాను అక్రమాలకు పాల్పడ్డానని ఆరోపించారు. అవి నిరూపిస్తే ఉరికంబం ఎక్కడానికైనా సిద్ధంగా ఉన్నా.. తెలంగాణ ఏర్పడిన తరువాత బహుజనులకు న్యాయం జరగలేదన్నది వాస్తవం..’ అని ప్రవీణ్ కుమార్ ఉద్వేగం చెందారు.