Domestic aviation industry : ఉదాన్ పథకం కింద దేశీయ విమానయాన పరిశ్రమను గొప్పగా అభివృద్ధి చేశామని బిజెపి ప్రభుత్వం చెప్పుకుంటుంటే.. ప్రతిరోజు ఫ్లైట్ లకు బెదిరింపు కాల్స్ సర్వసాధారణంగా మారింది. ఈ వ్యవహారంపై ఎప్పటికప్పుడు అధికారులు విచారణ చేపట్టి.. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నప్పటికీ.. బెదిరింపులు తగ్గడం లేదు. పైగా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఏకంగా 50 విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే ఇలా బెదిరింపులకు పాల్పడే వ్యక్తులు రకరకాల సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉపయోగిస్తున్నారు. ఇండిగో సంస్థకు చెందిన 10 విమానాలకు బెదిరింపు కాల్స్ రావడంతో ఆ సంస్థ ఒక్కసారిగా బెంబేలెత్తి పోయింది. తన విమానాలను పూర్తిగా దారి మళ్ళించింది. పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాత మళ్లీ ప్రయాణాలను ప్రారంభించింది. ఎయిర్ ఇండియాకు సంస్థకు చెందిన పది విమానాలకు కూడా ఇదే స్థాయిలో బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇక నిన్న కూడా ఆ సంస్థకు చెందిన 30 విమానాలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆగంతకుల ఫోన్ కాల్స్ నేపథ్యంలో విమానాలు మొత్తం గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.. ఈ వారంలో మొత్తంగా 120 విమానాలకు ఇలా బెదిరింపు కాల్స్ రావడంతో.. అంతర్జాతీయ విమానాలు రోజుల తరబడి.. దేశీయ విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.
ఖలిస్థానీ ఉగ్రవాదుల హెచ్చరిక
ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా.. ఇలా ఏ కంపెనీని వదలకుండా ఆగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఖలిస్థానీ గ్రూప్ కు చెందిన వేర్పాటు వాదులు ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కువ వద్దని ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో ఆ కంపెనీకి సంబంధించిన విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికులు భయపడిపోతున్నారు.
బెదిరింపు కాల్స్ వల్ల అంత నష్టం
ప్రస్తుతం విమానయాన పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మనదేశమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అయితే ప్రస్తుతం బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల విమానయాన సంస్థలు మరింత నష్టాలను చవిచూస్తున్నాయి. ఇటీవల ఓ సంస్థకు చెందిన విమానం 147 మంది ప్రయాణికులు, సిబ్బందితో కలిసి ముంబై నుంచి న్యూయార్క్ బయలుదేరింది. ఆ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అత్యవసరంగా ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయంలో ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం బరువును చాలా వరకు తగ్గించాలి. దానికోసం విమానంలో నిల్వచేసిన ఇంధనాన్ని బయటకి వృధాగా వదిలేశారు. దీని ధర దాదాపుగా కోటి. ఈ లెక్కన కోటి రూపాయల విలువైన ఇంధనం వృధాగా గాలిలో కలిసిపోయింది. అంతేకాదు ప్రయాణికులకు వసతి కల్పించాలి. సిబ్బందిని మార్చాలి. గ్రౌండ్ క్లియరెన్స్ చేయాలి. తనిఖీలు చేపట్టాలి. దీనికోసం మరో మూడు కోట్ల రూపాయలు ఖర్చయింది. మొత్తంగా నాలుగు కోట్లు బూడిదలో పోసిన పన్నీరయింది. అంతేకాదు ఎన్నో గంటల సమయం వృధా అయ్యింది. ఒక విమానానికి ఈ స్థాయిలో నష్టం వాటిల్లితే.. మూడు రోజుల్లో ఎన్నో విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యాయి. ఆ ప్రకారం చూసుకుంటే నష్టం అంచనాకు అందనిది. ఇవన్నీ వృధా ఖర్చులు. పైగా విమానయాన పరిశ్రమ నష్టాలను, కష్టాలను ఎదుర్కొంటున్నది. అలాంటప్పుడు ఆకతాయిలు చేస్తున్న ఈ బెదిరింపు ఫోన్ కాల్స్ విమానయాన సంస్థలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే పెట్టె బేడా సర్దుకోవాలిసిన దుస్థితి ఏర్పడుతుందని విమానయాన సంస్థలు వాపోతున్నాయి. అయితే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతున్నది. వారు జీవితకాలం విమానాలలో ప్రయాణించకుండా నిషేధం విధించే చట్టాన్ని తెరపైకి తీసుకొస్తామని వివరిస్తున్నది.