TDP- Janasena Alliance: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచి అధికార వైసీపీతోపాటు టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ అధినేత నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటి నుంచే ప్రజల్లో ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్య నేతలకు ఆదేశించారు. గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికీ పంపుతున్నారు. ఇక టీడీపీ కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభించారు. కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

పొత్తులవైపు బాబు చూపు..
ఏపీలో 2019 ఎన్నికల నాటి నుంచే జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయి. 2024 ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయాలని నిర్ణయించాయి. ఇటీవల రెండు పార్టీల మధ్య కొంత గ్యాప్ వచ్చినప్పటికీ ప్రధాని మోదీ విశాఖ పర్యటన, పవన్‌తో ప్రత్యేక సమావేశం తర్వాత గ్యాప్ తగ్గిపోయిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. అయితే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్నారు. వేర్వేరుగా పోటీ చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందని, ఇది అధికార వైసీపీకి లాభిస్తుందని బాబు భావిస్తున్నారు. దీంతో పొత్తుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
త్యాగాలకు సిద్ధమంటూ..
వచ్చే ఎన్నికల్లో త్యాగాలకు సిద్ధం కావాలని చంద్రబాబు టీడీపీ నేతలకు ఇప్పటికే సూచించారు. అంటే పొత్తు ఉంటుందన్న సంకేతం ఇచ్చారు. ఈ క్రమంలో ఇటీవల విశాఖ పర్యటనకు వెళ్లిన పవన్‌ను పోలీసులు నిర్బంధించారు. దీనిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు చంద్రబాబు ఇటీవల పరామర్శ పేరుతో పవన్‌ను కలిశారు. భవిష్యత్‌లో కలిసి పనిచేద్దామని కోరారు. ఇందుకు బీజేపీని ఒప్పించాలని కూడా కోరినట్లు వార్తలు వచ్చాయి.
బాబుతో పొత్తను వ్యతిరేకిస్తున్న బీజేపీ..
మరోవైపు బీజేపీ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపడం లేదు. అవసరమైతే టీడీపీని వచ్చే ఎన్నికల్లో కనుమరుగు చేయాలని చూస్తోంది. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత ధూషణలు చేశారు. తిరుపతి పర్యటనకు వచ్చిన అమిత్‌షాను అడ్డుకేనే ప్రయత్నం చేశారు. రాహుల్‌గాంధీతో కలిసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. దీంతో బాబును ఎంత దూరం పెడితే అంత మంచిదన్న భావనలో బీజేపీ ఉంది. దీంతో బాబు కూడా బీజేపీతో పొత్త ఇక కుదరదని నిర్ణయానికి వచ్చారు.
జసేనతో పొత్తుకు బాబు యత్నం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి భయపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పొత్తు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిని గుర్తించిన అధికార వైసీపీ.. ఈ పొత్త ప్రయత్నాలకు ఆదిలోనే గండి కొట్టాలని చూస్తోంది. ప్రతిపక్ష టీడీపీ, ఏపీలో బలపడుతున్న జనసేన కలిస్తే.. తమకు ముప్పు తప్పదని భావిస్తున్న వైసీపీ ఇద్దరినీ కలవకుండా చేయడమే ఇప్పుతు తమ ప్రాధాన్యంగా భావిస్తోంది.

సవాళ్లు అందేకేనా..?
గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు, చంద్రబాబు నాయకుడు మాట్లాడినప్పుడు ఒకరిద్దరు, లేదా ఒకటి రెండు సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే పవన్, చంద్రబాబు ఆరోపణలను తిప్పి కొట్టేవారు. ఆదివారం ఇప్పటంలో చేసిన పవన్ విమర్శలపై మాత్రం అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా పొత్త లేకుండా చూసేందుకు పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెడతామని, తానే ముఖ్యమంత్రిని అని ప్రకటించాలని సవాల్ చేశారు. తాము 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, తమ ముఖ్యమంత్రి మళ్లీ జగనే అని ప్రకటించారు. తమలాగా ప్రకటించే ధైర్యం పవన్‌కు ఉందా అని ప్రశ్నించారు. ఇలాంటి సవాళ్లు పవన్ టీడీపీతో పొత్తు లేకుండా చేయడంలో భాగమన్న అభిప్రాయ వ్యక్తమవుతోంది. పవన్ తాను ముఖ్యమంత్రినని ప్రకటిస్తే చంద్రబాబు కూడా జనసేనతో పొత్తుకు అంగీకరించరని వైసీపీ నేతలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినా పొత్తు కుదిరితే టీడీపీ 40 ఏళ్ల రాజకీయం ఏమైంది.. చివరకు ఒంటిగా పోటీ ఏయలేక పవన్‌కు లొంగిపోయారని వైసీపీ విమర్శించే అవకాశం ఉంటుందని పేర్కొటున్నారు. మొత్తంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేకుండా చేడడమే వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించినట్లు స్పష్టంగా తెలుస్తోంది.