Undavalli Arun Kumar- Ramoji Rao: ఇది 16 ఏళ్ల పగ. ఈ సుదీర్ఘ ఎపిసోడ్లో ట్విస్టులను చూస్తే ఒక థ్రిల్లర్ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. కోర్టులో కేసులు నమోదు అవుతూ ఉంటాయి. ఎంత వేగంగా నమోదు అవుతాయో అంతే వేగంగా స్టే లు వస్తాయి. ఇటు చూస్తే ఒకతను తెలుగు మీడియా రంగంలో రారాజు. పచ్చళ్ళు, పేపర్ అనే కాంబినేషన్లో వేల కోట్లు సంపాదించిన రామోజీరావు. అటు చూస్తే కొరకరాని కొయ్య లాంటి రాజకీయ నాయకుడు. వ్యాపారంలోసుగులను బట్టబయలు చేసే నిష్ణాతుడైన రాజకీయ నాయకుడు. ఇది చదువుతుంటే ఈపాటికి మీకు అర్థమై ఉండాలి ఏం చెబుతున్నామనేది.

ఏళ్ళ నాటి పోరు
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య పోరు ఈనాటిది కాదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రెండు పత్రికల్లో ఒకటైన ఈనాడు.. ఆయనను బాగా ఇబ్బంది పెట్టేది. దీనిని సాక్షాత్తు ఆయన శాసనసభలో ప్రస్తావించారు కూడా. అయితే అప్పట్లో ఈనాడుని మేథో పరంగా
టాకిల్ చేసే దమ్ము కాంగ్రెస్ నాయకులకు లేకపోయేది. ఇదే సమయంలో రాజశేఖర్ రెడ్డి కి తురుపు ముక్క గా దొరికాడు అరుణ్ కుమార్.. అసలే బాగా చదువుకున్నవాడు. పైగా ప్రతి దాంట్లో లాజిక్కులు వెతికేవాడు.. ఇంకేముంది రామోజీరావు వ్యాపారాల మీద పడ్డాడు.. అలా అతడు వెతుకుతుంటే మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థలో లొసుగు దొరికింది. వెతకబోతున్న తీగ కాలికి తగిలినట్లు అయింది. దీంతో మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై అరుణ్ కుమార్ కేసు దాఖలు చేశాడు. రామోజీరావును తెలివిగా ఇరికించాడు. దీంతో రామోజీరావు దేశవ్యాప్తంగా తనకు మద్దతు కూడగట్టేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అప్పట్లో కాంగ్రెస్ ఇప్పటి మాదిరి లేదు. కాబట్టి రామోజీరావు పాటలు అంతగా సాగలేదు. తన మీడియా గ్రూపును అడ్డుపెట్టుకొని నచ్చని నాయకుల జీవితాలతో ఆడుకునే రామోజీరావుకి అరుణ్ కుమార్ వ్యవహారం నానాటికి తలనొప్పిగా తయారైంది. దీంతో మార్గదర్శిలో సొమ్ము దాచుకున్న వారికి వెంటనే నగదు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు చొరవ వల్ల ముకేశ్ అంబానీ రామోజీరావు కి సాయం చేశాడు అంటారు. ఇందుకు ప్రతిఫలంగా ఒక ఈటీవీ మినహా మిగతా ఛానల్ మొత్తం రిలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న నెట్వర్క్ 18 పరిధిలోకి వెళ్లాయి అంటారు. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కూడా అరుణ్ కుమార్ రామోజీరావు పై న్యాయపోరాటం సాగిస్తూనే ఉన్నాడు.
ఎవరూ సాహసించరు
రామోజీరావు లాంటి వ్యక్తితో పెట్టుకోవడాన్ని ఎవరూ సాహసించరు. ఇక చట్టం తన పని తాను చేసుకుని పోతుంది అనేది పెద్దవాళ్ల విషయంలో పచ్చి అబద్ధం.. రామోజీరావు పై ఎలాంటి కేసులు పెట్టిన వెంటనే స్టే తెచ్చుకోగలరని ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానంలో మార్గదర్శి చిట్ఫండ్ సంస్థ తనదాన్ని రామోజీరావు అన్నారని ఉండవల్లి గుర్తు చేశారు. మరోసారి కాదు అన్నారని పేర్కొన్నారు.. అయితే తాను చెప్పే ప్రతి విషయానికి కూడా డాక్యుమెంటరీ ఉందని ఉండవల్లి స్పష్టం చేశారు.
రామోజీ దా? కాదా?
అసలు మార్గదర్శి సంస్థ రామోజీ దా? కాదా? అనేది స్పష్టం చేయాలని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. రామోజీరావుకు చిట్ ఫండ్ సంస్థకు సంబంధం లేకుంటే తాను కేసు విత్ డ్రా చేసుకుంటారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఆర్థిక నేరానికి పాల్పడ్డారనే అభియోగంపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇది ఏమవుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి.

ఇలాంటి పరిస్థితుల్లో ఉండవల్లి ఆఫర్ రామోజీరావు ఎలా వినియోగించుకుంటారనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మార్గదర్శి కేసు వెలుగులోకి వచ్చింది కాబట్టి.. అందులో ఇంప్లిడ్ కావాలని మీరు తెలుగు ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించగా.. అందులో జగన్ ప్రభుత్వం మాత్రమే ఇంప్లీడ్ అయింది. కెసిఆర్ ప్రభుత్వం ఎప్పటిలాగే వెయ్యి నాగళ్లతో దున్నిస్తా అనే మాటకు కట్టుబడి ఉంది. ఇక సుప్రీంకోర్టులో విచారణ తీవ్రం అవుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈనాడు గ్రూపు సంస్థల ఎండి కిరణ్ తన భార్య శైలజ, సోదరుడి భార్య విజేశ్వరి తో కలిశారు. ఈనాడులో ప్రచురితమైన భారత స్వాతంత్ర్య అమృత్యోత్సవాల కథనాలకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.. ఇదే సమయంలో ఆ పుస్తకంపై నెహ్రూ బొమ్మ లేకుండా జాగ్రత్త పడ్డారు. దీని ప్రకారం చూసుకుంటే మార్గదర్శి కేసులో నరేంద్ర మోడీ శరణు రామోజీరావు జొచ్చారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లల్లో ఈనాడు ప్రోత్సాహం బాగానే దక్కింది.. కానీ ఎప్పుడైతే చంద్రబాబు వైరం పెట్టుకున్నాడో అప్పుడే ఈనాడు కూడా భారతీయ జనతా పార్టీపై సైరన్ మోగించింది. రామోజీరావు కంటే రెండు ఆకులు మోడీ ఎక్కువే చదివాడు కాబట్టి.. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ దిగిరాక తప్పలేదు. అదే సమయంలో ఆ మధ్య తెలంగాణలో అమిత్ షా పర్యటించినప్పుడు నేరుగా ఫిలిం సిటీ లోని రామోజీరావు ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. ఆ తర్వాతే కిరణ్ నరేంద్ర మోడీని కలిశారు. అర్థం చేసుకునే వాళ్లకు అర్థమయినంత!