Petrol, Diesel : హద్దూపద్దూ లేకుండా పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. సామాన్యుడిపై ఏ స్థాయిలో భారం మోపుతున్నాయో అందరికీ తెలిసిందే. మిగిలిన ఏ వస్తువు ధర పెరిగినా.. ప్రభావం ఆ వస్తువు వరకే ఉంటుంది. కానీ.. ఇంధన ధరలు పెరిగితే.. ప్రతీ నిత్యావసర వస్తువల ధరలూ పెరిగే అవకాశం ఉంటుంది. పాలు, కూరగాయాలు, నూనెలు, బియ్యం ఇలా అన్ని వస్తువులను రవాణా ద్వారానే ఒక చోట నుంచి మరొక చోటికి చేరవేస్తారు. పెట్రో ధరలు పెరిగితే.. వాహనాలు రవాణా ఛార్జీలు పెంచేస్తాయి. అప్పుడు అనివార్యంగా మిగిలిన వస్తువుల ధరలు కూడా వ్యాపారులు పెంచుతారు. ఈ చైన్ లింక్ అంతిమంగా సామాన్య జనాన్నే అవస్థలపాల్జేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు బాధ్యత నుంచి పక్కకు తప్పుకొని.. పెట్రో సంస్థలకే నిర్ణయాక హక్కు వదిలేయడంతో.. అవి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినప్పుడు వారి లాభాల్లో ఏ మాత్రం కోత పడకుండా ధరలు పెంచుకుంటూ పోతున్న సంస్థలు.. ధరలు తగ్గినప్పుడు మాత్రం ఆ మేరకు తగ్గించట్లేదు. దాంతో.. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పోగేసుకుంటూ జనాలను పీల్చి పిప్పిచేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ.. స్పందించకుండా తమపని తాము చేసుకుంటూ పోతున్నాయి.
పెట్రో సంస్థల తీరు అలా ఉంటే.. ప్రభుత్వాల తీరు మరోలా ఉంది. కేంద్ర ప్రభుత్వం పన్ను పేరుతో భారీగా వసూలు చేస్తుండగా.. తామే తక్కువ తినలేదంటూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నుల పేరుతో జేబులు ఖాళీ చేస్తున్నాయి. దీంతో.. చమురు ధరకన్నా, కేంద్ర, రాష్ట్రాలకు చెల్లించే పన్నులే ఎక్కువగా ఉంటున్న పరిస్థితి. దీంతో.. ఈ ఇబ్బందిని ఎవరికీ చెప్పుకోలేక, పెట్రోల్ కొనకుండా ఉండలేక.. ముక్కుతూ మూల్గుతూ ప్రజలు నిర్ణయించిన ధర చెల్లిస్తూనే ఉన్నారు.
అయితే.. ఇంధన ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెస్తే చాలా వరకు ధరలు తగ్గుతాయనే అభిప్రాయం ఉంది. కానీ.. కేంద్రం మాత్రం ఆయిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేకపోవడం గమనార్హం. దీనిపై మొదట్లోనే విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ.. కేంద్రం పట్టించుకోలేదు. ఫలితంగా.. పెట్రోల్ ఏనాడో సెంచరీ కొట్టేసింది. కొన్ని చోట్ల లీటర్ పెట్రోల్ 110 రూపాయలు దాటి 120 వైపు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపు 20 నెలల తర్వాత జీఎస్టీ మండలి ప్రత్యక్ష పద్ధతిలో సమావేశం కాబోతోంది. ఈ నెల 17న జరగనున్న ఈ భేటీపై ఆసక్తి నెలకొంది.
పెట్రో ధరలు భారీగా పెరిగి జనాలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై చర్చిస్తారని అంటున్నారు. ‘‘పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలి’’ అని కేరళ హైకోర్టు గతంలో సూచించింది. ఈ నేపథ్యంలో సమావేశం జరగనుండడంతో చర్చిస్తారని తెలుస్తోంది. ఒకవేళ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. గరిష్టంగా 28 శాతం పన్నుతో ఫిక్స్ డ్ సర్ ఛార్జి విధించే అవకాశం ఉంటుంది. అంటే.. అంతకు మించి పన్ను వేయడానికి అవకాశం ఉండదు. (ప్రస్తుతం 50 శాతం వరకు పన్నులు ఉన్నాయి.) అందువల్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది.