Hyderabad’s Second cable bridge : హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుతోంది. ప్రపంచంలోనే టాప్ 10 కంపెనీలు హైదరాబాద్ లో కొలువుదీరాయి. మరెన్నో కంపెనీలు వచ్చి హైదరాబాద్ అభివృద్ధిలో భాగస్వాములయ్యాయి. దేశంలో ఫార్మా హబ్ కు కూడా మన భాగ్యనగరమే బాటలు వేసింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ కు మరింత సొబుగులు అద్దేందుకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. ఇప్పటికే నగరంలో అనేక ప్రాంతాల్లో పర్యాటకులను ఆకర్షించేందుకు ఎన్నో పర్యాటక ప్రదేశాలను కేసీఆర్ సర్కార్ సుందరంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు హైదరాబాద్ కు మరో మణిహారాన్ని తొడగబోతోంది.

హైదరాబాద్ సిగలో మరో మణిహారం నిలవబోతోంది. తెలంగాణలో ఇప్పటికే రెండు కేబుల్ బ్రిడ్జీలు రూపొందాయి. ఒకటి హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై పూర్తికాగా.. రెండోది కరీంనగర్ నగరం ఒడ్డున మానేరు నదిపై టాటా కంపెనీ నిర్మిస్తోంది. దాదాపు పూర్తికావచ్చిన దీన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇప్పుడు తెలంగాణలో మూడో కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి తెలంగాణ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.
ఇప్పటికే ఐటీ విస్తరించిన మాదాపూర్ లో కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. దుర్గం చెరువుపై ఏర్పాటు చేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని చూసేందుకు అక్కడికి నిత్యం వందలాది మంది పర్యాటకులు వస్తున్నారు. ఇప్పుడు నగరంలోని మరో ప్రాంతంలో కూడా కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ‘జీహెచ్ఎంసీ’ అథారిటీ నిర్ణయించింది.
వెనుకబడి పాతబస్తీలోనూ అభివృద్ధికి పాలకవర్గం అడుగులువేసింది. పాతబస్తీలోనూ ఈ కేబుల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. పాతబస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ వద్ద కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రొపోజల్, ప్లాన్ ను హెచ్ఎండీఏ అధికారులు సిద్ధం చేశారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
పాతబస్తీలో చార్మినార్, సాలర్జంగ్ మ్యూజియం, మక్కా మసీద్ వంటి ఎన్నో చారిత్రక పర్యాటక ప్రాంతాలున్నాయి. పాతబస్తీలో కేబుల్ బ్రిడ్జిని కొత్తగా ఏర్పాటు చేస్తే మరింత అక్కడ పర్యాటక శోభ విస్తరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
హైదరాబాద్ లోని దుర్గం చెరువుపై 755 మీటర్ల పొడవున రూ.184 కోట్లతో కేబుల్ బ్రిడ్జిని నిర్మించారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద బ్రిడ్జిగా ఈ బ్రిడ్జి ఖ్యాతికెక్కింది. దీన్ని ఎల్ అండ్ టీ నిర్మించింది.పూర్తి కేబుల్ టెక్నాలజీని ఉపయోగించి తీర్చిదిద్దారు. రెండేళ్లలో దీన్ని పూర్తి చేశారు. దీని తర్వాత కరీంనగర్ లో రెండో కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తికావస్తోంది. ఇప్పుడు మూడో పాతబస్తీలోని మీర్ ఆలం ట్యాంక్ లో నిర్మించనున్నారు. దేశంలో ఈ తరహా టెక్నాలజీతో నిర్మితమైన తొలి బ్రిడ్జీలు ఇవే కావడం విశేషం.