
భారతదేశం కరోనా వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రధాని మోదీతో జరిగిన ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు కరోనాకు వ్యాక్సిన్ కనుగోనేందుకు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. జులై లేదా ఆగస్ట్ వరకు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అదేవిధంగా కరోనాను వైద్యపరంగా ఎదుర్కొనేందుకు అన్నివిధలా సిద్ధంగా ఉన్నట్లు మోదీకి వివరించారు. వైద్యులకు కావాల్సిన పరికరాలు, మందులు, మాస్కులు, పీపీఈ కిట్లు తగినన్నీ ఉన్నాయని తెలిపారు. కరోనా ఎఫెక్ట్ ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని కరోనాతో కలిసి బతుకడం నేర్చుకోవాలని వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానికి కేసీఆర్ వివరించారు.
కేంద్రం వలస కూలీల కోసం శ్రామిక్ రైళ్లు ఏర్పాటు చేయడంపై ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశంసించారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలని సూచించారు. ప్యాసింజర్ రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించవద్దని మోదీకి కేసీఆర్ సూచించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్‌తోపాటు చాలా నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉందని తెలిపారు. అలాగే రైళ్లలో వచ్చిన ప్రయాణికులను క్వారంటైన్ చేయడం పెద్ద సమస్యగా మారుతుందని చెప్పారు. ఇప్పట్లో రైల్ సర్వీసులను పునరుద్దరించకపోవడమే మంచిదని ఆయన సూచించారు. అలాగే రాష్ట్రాల అప్పులను రీషెడ్యూల్ చేయాలని, ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచాలని ప్రధానిని కేసీఆర్ మరోసారి కోరారు.