Rowdy Sheeters Mela : పాత సినిమాల్లో చూపించే రౌడీలు మరీ కరుకుగా ఉండేవారు.. దాడులు, హత్యలు, దోపిడీలతో చెలరేగిపోయేవారు. మన సమాజంలోనూ 90వ దశకం వరకూ రౌడీలంటే సమాజంలో ఒకరకమైన భయం ఉండేది. కానీ పోలీస్ వ్యవస్థ పటిష్టం కావడంతో ఈ రౌడీ మూకల ఆటకట్టైంది. వారిపై పోలీస్ ఉక్కుపాదంతో చాలా మంది రౌడీయిజం వదిలేసి బతుకీడుస్తున్నారు. కొంతమంది ఇప్పటికీ సెటిల్ మెంట్లు, దందాలు గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నారు. ఫిర్యాదులు వస్తే చాలు.. కేసులు నమోదైతే చాలు రౌడీషీట్ పెట్టి లోపల వేస్తున్నారు పోలీసులు..

అయితే చాలారోజులుగా రౌడీషీట్ ముద్రపడి బంధనాల్లో ఇరుక్కున్న కొందరు రౌడీలను వాటి నుంచి పోలీసులు విడిపించారు. వారిని సమాజంలో స్వేచ్ఛగా తిరిగేలా ఊపిరిపోశారు. గురువారం హైదరాబాద్ లోని సిఎఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నగర పోలీసులు రౌడీ షీటర్ల మేళా నిర్వహించారు. సౌత్జోన్లో వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో 647 రౌడీషీట్లు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ), డీసీపీ టాస్క్ ఫోర్స్ రౌడీషీట్లను పరిశీలించి 47 మందిపై ఉన్న రౌడీషీట్లను మూసివేశారు.
గత పదేళ్లుగా ఎలాంటి కేసులు లేకుండా క్లీన్ రికార్డ్ మెయింటైన్ చేసినందున 35 మందిపై రౌడీషీట్లను మూసివేశారు. 60 ఏళ్లు పైబడిన వారు, గత ఐదేళ్లుగా క్లీన్ రికార్డును నిర్వహిస్తున్నందున ముగ్గురిపై రౌడీషీట్లను మూసివేశారు. వారి వద్ద ఇప్పటి వరకు ఒకే ఒక్క కేసు ఉన్నందున ఒక రౌడీ షీట్ మూసివేయబడింది. మిగిలినవి వారి ఆరోగ్యం దెబ్బతిని మంచానపడ్డ వారిపై రికార్డు ఆధారంగా మూసివేశారు.
మూసివేసిన 47 మంది రౌడీ షీటర్లకు కమిషనర్ సీవీ ఆనంద్ నుంచి అనుమతి లభించింది. వారిపై రౌడీషీట్ ఎత్తివేసిన పత్రాలను స్వయంగా అందజేసి వారిని ఇంటికి గౌరవంగా పంపించేశారు. సత్ప్రవర్తన కారణంగా తమపై మోపిన రౌడీషీట్ ఎత్తివేయడంతో రౌడీలంతా ఊపిరి పీల్చుకున్నారు.