Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో చార్జీలు పెరగనున్నాయి. ఇది ప్రయాణికులకు చేదు వార్తే. చార్జీల పెరుగుదలతో ప్రయాణికులకు తిప్పలు తప్పేలా లేవు. ప్రస్తుతం రూ. 10 నుంచి మొదలయ్యే చార్జీలు రూ.60 వరకు ఉన్నాయి. మెట్రో సదుపాయంతో దూరం తగ్గినా చార్జీల భారం మాత్రం కంగారు పెడుతోంది. హైదరాబాద్ మెట్రో అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్స్ డ్ కమిటీ (ఎఫ్ఎఫ్సీ) ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన కమిటీ ప్రస్తుతమున్న మెట్రో చార్జీల సవరణకు నడుం బిగించింది. చార్జీల పెంపుపై తమ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు అందజేయాలని కోరింది.

నవంబర్ 15లోగా తమ అభిప్రాయాలు తెలియజేయాలని సూచిస్తోంది. ఈ మెయిల్ అడ్రస్, ఫేర్ ఫిక్సేషన్ కమటీ, మెట్రో రైలు భవన్ బేగంపేట చిరునామాకు పంపాలని కోరింది. ధరల పెరుగుదలపై నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయినట్లు చెబుతున్నారు. చార్జీలు పెంచే బాధ్యత మెట్రో రైలు అడ్మినిస్ర్టేషన్ కు మాత్రమే ఉంటున్నా ఈ సారి ఎఫ్ఎఫ్సీకి అప్పగించింది. చార్జీలు ఎంత మేర పెంచుతారనే విషయంపై మాత్రం స్పష్టత కనిపించడం లేదు. కానీ కనీస చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకోనుంది. ఇది వరకు రూ.10గా ఉన్న చార్జీ ఇకపై ఎక్కువ కానుందని చెబుతున్నారు.
దీనికి గాను ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. విశ్రాంత న్యాయమూర్తి గుడిసవ శ్యాంప్రసాద్ చైర్మన్, కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ సురేంద్ర కుమార్ బగ్దె, రాష్ర్ట పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. దీంతో చార్జీల పెంపుదల ఖాయంగానే కనిపిస్తోంది. ఇన్నాళ్లు మెట్రో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న చార్జీలు ఒక్కసారిగా పెరగనుండటంతో ప్రయాణికులపై భారం పెరగనుంది.

కేంద్ర ప్రభుత్వం చార్జీలు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో ప్రయాణికులకు ఇక మీదట మెట్రో ప్రయాణం భారమే కానుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే గమ్యం చేరుతున్నామని అనుకుంటున్న వారి ఆశలు అడియాశలే కానున్నాయి. ఈ క్రమంలో చార్జీలు ఎంత మేర పెంచుతారో తెలియడం లేదు. మెట్రో ప్రయాణం మాత్రం భవిష్యత్ లో చార్జీల పెరుగుదలతో ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడం సహజమే. దీనిపై ప్రభుత్వం ఆలోచన విధానం అందరిలో విమర్శలకు కారణమవుతోంది.