https://oktelugu.com/

Ram Column: హైదరాబాద్ విమోచన పోరాటం – అపోహలు, వాస్తవాలు

Ram Column: భారత స్వాతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇది సంస్థానాల్లో జరిగిన అతి పెద్ద ప్రజాపోరాటం. స్వాతంత్ర పోరాటం సంస్థానాల్లో జరిగింది తక్కువ. ఎక్కువభాగం బ్రిటిష్ ప్రత్యక్ష అధీనంలో వున్న ప్రాంతాల్లోనే జరిగింది. కారణం సంస్థానాధీశులు ఇక్కడివాళ్లే కాబట్టి అది పరాయిపాలనపై పోరాటంగా భావించరాదనేది గాంధీజీ భావన. దానికనుగుణంగానే కాంగ్రెస్ చాన్నాళ్లు సంస్థానాల్లో ఉద్యమాల్ని నిరుత్సాహపరిచింది. కానీ హైదరాబాద్ లో దానికి భిన్నంగా ఉద్యమాలు ముందునుంచీ మొదలయ్యాయి. అయినా అన్ని […]

Written By:
  • Ram
  • , Updated On : September 21, 2022 / 12:40 PM IST
    Follow us on

    Ram Column: భారత స్వాతంత్ర చరిత్రలో హైదరాబాద్ సంస్థాన విమోచన పోరాటం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది. ఇది సంస్థానాల్లో జరిగిన అతి పెద్ద ప్రజాపోరాటం. స్వాతంత్ర పోరాటం సంస్థానాల్లో జరిగింది తక్కువ. ఎక్కువభాగం బ్రిటిష్ ప్రత్యక్ష అధీనంలో వున్న ప్రాంతాల్లోనే జరిగింది. కారణం సంస్థానాధీశులు ఇక్కడివాళ్లే కాబట్టి అది పరాయిపాలనపై పోరాటంగా భావించరాదనేది గాంధీజీ భావన. దానికనుగుణంగానే కాంగ్రెస్ చాన్నాళ్లు సంస్థానాల్లో ఉద్యమాల్ని నిరుత్సాహపరిచింది. కానీ హైదరాబాద్ లో దానికి భిన్నంగా ఉద్యమాలు ముందునుంచీ మొదలయ్యాయి. అయినా అన్ని సంస్థానాలకన్నా ఒక సంవత్సరం ఆలస్యంగా ఇక్కడ స్వాతంత్రం వచ్చింది. దీనిపై ఇటీవలే అధికారికంగా కేంద్రం, రాష్ట్రం ఉత్సవాలు జరిపాయి. దీనిపై జరిగిన చరిత్రను ఎవరి పద్ధతుల్లో వారు వివరించటానికి ప్రయత్నించారు. ఇందులో కొన్ని వాస్తవాలు, కొన్ని అపోహలు కలగలిపి జనం ముందుకు వచ్చాయి. అందులో కొన్నింటిపై వాస్తవాలు మీ ముందు వుంచాలనే తాపత్రయంతో ఈ చిన్ని ప్రయత్నం:

    Hyderabad

    జరిగింది నిజాం వ్యతిరేక పోరాటం , హిందూ- ముస్లిం పోరాటం కాదు

    ఇది నిజమూ అబద్ధమూ కూడా. మొదలయ్యింది భాషోద్యమం, ఇతర భాషలు, ఇతర మతస్తులు, ఇతర సంస్కృతులపై వివక్షకు వ్యతిరేకంగా. అంటే ఏమిటి కేవలం ఉర్దూ భాషకు, ఇస్లాం మతానికి, సంస్కృతికి పెద్దపీట వేసి మెజారిటీ భాషల్ని, మెజారిటీ ప్రజల మతాన్ని, సంస్కృతిని పక్కన పెట్టటానికి వ్యతిరేకంగా. మరి ఇది పరోక్షంగా మెజారిటీ మతస్తులైన హిందువుల భాషలు, మతం, సంస్కృతికి మైనారిటీ మత పాలకుల వివక్షకు వ్యతిరేకపోరాటమే కదా.

    Also Read: Pawan Kalyan- Jagan: జగన్ కి చెక్ పెట్టనున్న పవన్ – ఆ మూడు జిల్లాల నుండి భారీగా చేరికలు

    1944 నుంచి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లిన తర్వాత జరిగింది నిజాం వ్యతిరేకపోరాటమే. గ్రామాల్లో పోట్లాడింది దేశముఖ్ లు , జాగిర్దార్ లకు వ్యతిరేకంగా. అందులో చాలామంది హిందువులే. కాబట్టి ఇది కేవలం హిందూ-ముస్లిం పోరాటంగా చూడకూడదు. నిజాం వ్యతిరేకపోరాటంగా చూడాలి. నిజమే 44 తర్వాత ఇది భూస్వామ్య, ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాం, ఆయన తరపు పాలకులకు వ్యతిరేకంగా జరిగింది. దీనికి పిలుపునిచ్చిన ముగ్గురిలో ఒకరు మఖ్డుం మొహియుద్దీన్ ముస్లిం. కాబట్టి ఆ దశలో ఇది భూస్వామ్య వ్యతిరేక పోరాటంగానే వుంది.

    patel, nizam

    కానీ 1946 తర్వాత దీని స్వభావం మారింది. ఒకవైపు ఖాసీం రజ్వీ మజ్లీస్ నాయకత్వం చేపట్టిన తర్వాత ముస్లిం లలో మత భావన రెచ్చగొట్టాడు. హిందూ గ్రామాల మీద పడి దౌర్జన్యాలు, దోపిడీలు చేయటం తో పరోక్షంగా ఈ భావన బలపడింది. ఆర్య సమాజ్, హిందూ మహాసభ, జన జాగృతి లాంటి సంస్థలు రజాకార్లకు వ్యతిరేకంగా హిందువులను సమీకరించారు. ప్రధానంగా ఇది మరాట్వాడా, కర్ణాటక హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగింది.

    నిజాంకు వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాడారు. నిజమే. కానీ ఈశాతం బహు తక్కువ. షోయబుల్లా ఖాన్ , మఖ్డుం లాంటి వాళ్ళ శాతం ముస్లిం జనాభాలో అతి తక్కువ శాతం. అధిక శాతం జనాభా మత ప్రాతిపదికనే ఆలోచించారు. అధిక శాతం ముస్లిం లు నిజాం పాలన కొనసాగాలనే భావించారు. నిజాం సైన్యంలో ఎక్కువమంది అరబ్బులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు ఉండేవారు. పాలనలో కొంతమంది హిందువులు కూడా వున్నారు. ఇది సహజం. బ్రిటిష్ పరిపాలనలో చాలామంది భారతీయులే ఉండేవారు. అంతమాత్రాన అది పరాయిపాలన కాక మానదు. హిందూ రాజ్యాలైన విజయనగర సామ్రాజ్యంలో, శివాజీ పాలనలో కూడా ముస్లిం సైనికులు ఉండేవారు. అంతమాత్రాన అవి హిందూ రాజ్యాలు కాకుండా పోలేదు. అందుకనే ఇది ప్రధానంగా నిజాం వ్యతిరేక పోరాటం అదేసమయంలో పరోక్షంగా హిందూ- ముస్లిం పోరాటం కూడా.

    నిజాం సెక్కులర్ , ఖాసీం రజ్వీ మతవాది

    ఇంకో వాదన బలంగా వుంది. నిజాం సెక్కులర్. ఆయన అనేక దేవాలయాలకు దాన ధర్మాలు చేసాడు. నిజమే టిప్పు సుల్తాన్ కూడా కొన్ని దేవాలయాలకు డబ్బులిచ్చాడు. ఎవరైనా సెక్కులర్ అవునో కాదో తేలేది విషమ పరీక్ష ఎదుర్కున్నప్పుడే. ఖాసిం రజ్వీ ని ప్రోత్సహించింది నిజాంనే. దానికి కావాల్సిన చారిత్రక ఆధారాలు ఎన్నో వున్నాయి. కాబట్టి నిజాంని గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం చరిత్రని వక్రీకరించటమే అవుతుంది. నిజాం భారత్ లో చేరకుండా చేయని ప్రయత్నం లేదు. జిన్నా, బ్రిటన్, ఐక్య రాజ్య సమితి అన్ని దారులు ప్రయత్నం చేయటం నిజం కాదా? యూరప్ నుంచి పాకిస్తాన్ ద్వారా ఆయుధాలు సమకూర్చుకుంది నిజం కాదా? సెక్కులర్ సంగతి తర్వాత భారత్ వ్యతిరేక పనులు ఎన్నో చేపట్టాడు. రజాకార్ సైన్యాన్ని రద్దు చేయమని కేంద్రం ఎన్నిసార్లు అడిగింది? ఎందుకు రద్దుచేయలేదు? ఖాసిం రజ్వీ నిజాం కనుసన్నలలోనే అన్ని ఘోర కృత్యాలు చేసాడు. ఇటువంటి వాదనలు ఏదోవిధంగా నిజాంని సమర్ధించటానికి చేసేవి మాత్రమే.

    Hyderabad

    కమ్యూనిస్టుల పోరాటం నిజాం వ్యతిరేకమా? భారత్ వ్యతిరేకమా?

    ఇవి రెండూ వాస్తవాలే. 1944 లో ఆంధ్ర మహాసభ నాయకత్వం చేజిక్కించుకున్న తర్వాత కమ్యూనిస్టులు నిజాం వ్యతిరేక పోరాటాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లగలిగారు, నిజాంకి వెన్నెముకగా వున్న దేశముఖ్ లను తరిమి కొట్టగలిగారు. వెట్టికి వ్యతిరేకంగా జనాన్ని సమీకరించి గలిగారు. ముఖ్యంగా 1946 లో దొడ్డి కొమరయ్య మృతి తో ఈ ఉద్యమాన్ని మలుపు తిప్పారు. సమాంతర ప్రభుత్వాన్ని గ్రామాల్లో ఏర్పాటు చేశారు. నిజాం సైన్యాలు ఈ ప్రాంతాలకు రాకుండా కట్టడి చేశారు. నిజంగా భారత చరిత్రలోనే ఇది వీరోచిత పోరాటం.
    1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చింది. హైదరాబాద్ సంస్థానం నిజాం కిందనే వుంది. ఇక్కడనుండి పోరాటంలో గుణాత్మక మార్పు వచ్చింది. 1947 సెప్టెంబర్ 11వ తేదీన కమ్మూనిస్టులు సాయుధ తిరుగుబాటుకు పిలుపిచ్చారు. 1948 ఫిబ్రవరి 28 నుంచి మార్చి 6వ తేదీ వరకు కలకత్తాలో సిపిఐ 2వ జాతీయ సమావేశాలు జరిగాయి. అందులో పార్టీ భారత స్వాతంత్రాన్ని, భారత ప్రభుత్వాన్ని గుర్తించటానికి నిరాకరించింది. తిరుగుబాటు మార్గాన్ని ఎంచుకుంది. బిటి రణదివేని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. దీని నేపథ్యంలోనే హైదరాబాద్ నగర కమిటీ రాజబహదూర్ గౌడ్ పేరుతో ఓ కరపత్రాన్ని ప్రచురించింది. భారత ప్రభుత్వం బూటకమని మేము స్వతంత్ర సోషలిస్ట్ హైదరాబాద్ ని కోరుకుంటున్నామని ప్రకటించింది. దీన్ని నిజాం ప్రభుత్వం, ఉర్దూ పత్రికలూ ప్రముఖంగా ప్రచారం చేశాయి. రాష్ట్ర నాయకత్వం దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అది పెద్దగా ప్రచారంలోకి రాలేదు.

    సిపిఐ కేంద్ర నాయకత్వ వైఖరిని, హైదరాబాద్ నగర కమిటీ కరపత్రాన్ని నిజాం ప్రభుత్వం తమకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే దేశం మొత్తం కమ్యూనిస్టులపై భారత ప్రభుత్వం నిషేధం విధిస్తే నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టులపై అప్పటివరకు వున్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ సంఘటనలన్నీ భారత ప్రభుత్వం చాలా లోతుగా గమనిస్తుంది. ఒకవైపు రజాకార్లు, రెండోవైపు కమ్యూనిస్టులు సమాంతర ప్రభుత్వాలు నడపటం ఆందోళన కలిగించింది. ఈ పరిణామాలే చివరకు ఆపరేషన్ పోలో కి దారితీసాయి. సెప్టెంబర్ 13 మొదలుపెట్టి 17 కల్లా నిజాంని లొంగదీసుకుంది.

    ఆ తర్వాత మరో ఘట్టం మొదలయ్యింది. రజాకార్లు లొంగిపోవటమో, చంపబడటమో జరిగితే కమ్యూనిస్టులు యూనియన్ సైన్యాలతో తలబడ్డాయి. పటేల్ స్వయంగా కమ్యూనిస్టులను ఆయుధాలు వదిలిపెట్టమని అప్పీల్ చేసాడు. కానీ కమ్యూనిస్టులు సాయుధపోరాటానికే సిద్ధపడ్డారు. డిసెంబర్ 1948 నుంచి యూనియన్ సైన్యాలు కమ్యూనిస్టులను అణిచివేయడం మొదలుపెట్టాయి. అప్పటిదాకా గ్రామాల్లో ప్రజలమధ్య వున్న కమ్యూనిస్టులు అడవుల్లో ఆదివాసీ గుండెల్లో తలదాచుకున్నారు. నిజాం సైన్యం చేతుల్లో 1500 మంది చనిపోతే భారత ప్రభుత్వ సైన్యం చేతిలో 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నా దృష్టిలో చేతులారా చేసుకున్న ఘోర తప్పిదం. దేశవ్యాప్తంగా సిపిఐ పంధా వలన పార్టీ తీవ్రంగా నష్టపోయింది. చివరకు పార్టీ నాయకత్వం నుంచి బిటి రణదివే ని తప్పించి చండ్ర రాజేశ్వరరావుని జూన్ 1950 లో నియమించారు. అయినా పార్టీ పంధా తెలంగాణ సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూనే వచ్చింది. 1951 ఫిబ్రవరి-మార్చి లో సిపిఐ తరఫున నలుగురు ప్రతినిధులు ఎస్ ఎ డాంగే, అజయ్ ఘోష్, చండ్ర రాజేశ్వర రావు, మాకినేని బసవపున్నయ్య లు రహస్యంగా రష్యా వెళ్లి స్టాలిన్ ని కలిశారు. స్టాలిన్ అటు రణదివే పంధాని, ఇటు చండ్ర రాజేశ్వర రావు పంధాని తప్పని చెప్పి చీవాట్లు పెట్టటం జరిగింది. 1951 ఏప్రిల్ లో అజయ్ ఘోష్ సిపిఐ నాయకత్వాన్ని చేపట్టటం జరిగింది. చివరకు 1951 అక్టోబర్ 25న తెలంగాణ సాయుధపోరాటాన్ని విరమించుకోవటం జరిగింది.

    Hyderabad

    ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 1948 సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన ఘటనలకు కేంద్ర ప్రభుత్వాన్నే ఈరోజుకు కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు సానుభూతిపరులు , మేధావులు తప్పుపడుతూ వుంటారు. అంతేగాని యూనియన్ సైన్యాలు తీసుకున్నది ప్రతిచర్య అని ఒప్పుకోరు. ఇప్పటిలాగా రాజ్యాంగబద్ధంగా, పార్లమెంటరీ పద్ధతుల్లో పనిచేసివుంటే యూనియన్ సైన్యాలు ఈపని చేసివుండేవి కాదు. భారత ప్రభుత్వం బూటకమని, అమెరికా-బ్రిటిష్ తొత్తు ప్రభుత్వమని ప్రకటించి రాజ్యంపై యుద్ధం ప్రకటిస్తే భారత ప్రభుత్వ ప్రతిచర్య తీసుకోక తప్పదుకదా. ఈరోజు నక్సలైట్లు చేసేపనే ఆరోజు కమ్యూనిస్టులు చేశారు. ఇది తప్పైనప్పుడు అదెంతుకు తప్పు కాదో నా విజ్ఞతకు అందటం లేదు. ఏ స్టాలిన్ చెప్పాడనో, పార్టీ నాయకత్వం భారత ప్రభుత్వాన్ని గుర్తించి పార్లమెంటరీ ప్రక్రియలో పాల్గోనాలనో చెప్పినదాకా సాయుధపోరాటం కొనసాగించి 2500 మంది కార్యకర్తల్ని బలి ఇచ్చినందుకు యూనియన్ సైన్యాలను నిందించే బదులు ఆత్మ విమర్శ చేసుకొని చెంపలేసుకొని మా తప్పుడు నిర్ణయాల వలన ఇన్ని వేలమంది బలైపోయారని వాపోతే బాగుండేది.

    ఈ పార్టీ గందరగోళంలో చివరకు నిజాం తో లాలూచి పడ్డారనే అపవాదుని మూట కట్టుకోవాల్సి వచ్చింది. 1948 మే లో నిజాం కమ్యూనిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేసిన తర్వాత గ్రౌండ్ లెవెల్ లో రజాకార్లకు, కమ్యూనిస్టులకు మధ్య ఏ మేరకు సఖ్యత ఏర్పడిందనే దానికి పెద్దగా ఆధారాలు లేవు. కాకపోతే కమ్యూనిస్టుల విముక్త ప్రాంతాల్లోకి రజాకార్లు రాకుండా మౌఖిక ఒప్పందాలు ఉన్నాయని చెబుతారు. మొత్తం మీద నిజాం వ్యతిరేక పోరాటంగా మొదలైన కమ్యూనిస్టుల ప్రస్తానం భారత వ్యతిరేక పోరాటంగా మారి చివరకు భారత రాజ్యాంగాన్ని ఆమోదించటంతో ముగిసింది.

    ముస్లిం లు వేలమంది చనిపోయారు

    నిజమే ఇది ప్రధానంగా మరాట్వాడా , కర్ణాటక-హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిందని సుందర్ లాల్ పట్వా నివేదికలో పేర్కొనటం జరిగింది. ముఖ్యంగా ఉస్మానాబాద్ , గుల్బర్గా, రాయచూర్ జిల్లాలో వేల సంఖ్యలో సెప్టెంబర్ 17వ తేదీ తర్వాత ముస్లిం లు చంపబడ్డారని ఈ నివేదికలో చెప్పబడింది. అంతమాత్రాన సెప్టెంబర్ 17 పండగ జరుపుకోమా? అలాగయితే ఆగస్టు 15 తర్వాత అటు ముస్లింలు ఇటు హిందువులు, సిక్కులు ఎన్ని వేలమంది హతమయ్యారో లెక్కేలేదు. కాబట్టి ఆగస్టు 15 స్వాతంత్ర దినం జరుపుకుంటున్నాము కదా. మరి దానికి లేనిది అదే తెలంగాణ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవటానికి వచ్చిన అడ్డేమిటి? కేవలం ఆరోజు అకృత్యాలు జరిపిన రజాకార్ల వారసత్వం తో పనిచేస్తున్న ఒవైసీ ఒత్తిడికి లొంగే రాష్ట్ర ప్రభుత్వం ఆపేరుతో ఉత్సవాలు జరపటంలేదు.

    సెప్టెంబర్ 17 పండగ జరిపే హక్కు కొందరిదేనా? అసలు దీన్ని ఏపేరుతో పిలవాలి?

    ఇది అర్ధంలేని వాదన. స్వాతంత్ర దినాన్ని జరుపుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బీజేపీ కి ఆ అధికారం లేదనే వాదన ఎలావుందంటే ఆగస్టు 15న మోడీ ఎర్రకోటపై జెండా ఎగరవేయకూడదన్నట్లు గా వుంది. కాకపోతే కేంద్ర హోమ్ మంత్రి ప్రసంగం లో అందరికి ధన్యవాదాలు చెప్పివుంటే బాగుండేది. కమ్యూనిస్టుల్ని విస్మరించటం సరైనది కాదు. నిజాం ని బలహీనపరిచింది కమ్యూనిస్టులే. దురదృష్టం ఏమిటంటే చరిత్రని చరిత్రగా చూడాలి తప్పితే ఎవరికీ నచ్చిన విధంగా వారు చెప్పుకోకూడదు. వల్లభాయ్ పటేల్ పాత్రని కమ్యూనిస్టులు చెప్పరు, కమ్యూనిస్టుల చరిత్రను బీజేపీ చెప్పదు. మరి వాస్తవ చరిత్ర తెలిసేదెట్లా?
    చివరగా అసలిది ఏపేరుతో పిలవాలి? ఒకరు విమోచనమని, ఇంకొకరు విలీనమని, మరొకరు విద్రోహమని, వేరొకరు సమైక్యమని పిలుస్తున్నారు. ఏమిటిదంతా? ఆగస్టు 15ని స్వాతంత్రమని పిలిచినప్పుడు సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం కాకుండా ఎలా పోతుంది. యూనియన్ సైన్యాలు ఆపరేషన్ పోలో నిర్వహించి నిజాం ని లొంగదీసుకున్న తర్వాత ఇది తెలంగాణ విమోచనమే. అందరూ కలిసి దీన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుందాం.

    –రామ్

    (రామకోటేశ్వర రావు)

    Also Read: Pawan Kalyan-TDP: ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ్… టీడీపీ మాస్టర్ ప్లాన్ ఇదే! 

    Recommended videos:

    Tags