
Real Estate Business: దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. మన రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం ముందుకు వెళుతోంది. దేశంలో రియల్ బూమ్ ఏర్పడినా ఇక్కడ మాత్రం జోరు తగ్గలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ దేశంలోనే రెండో రాష్ర్టంగా వినతికెక్కింది. మొదటి స్థానంలో ముంబయి నిలవగా దాని తరువాత స్థానాన్ని నిలబెట్టుకుంది.
వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన ముంబయి మొదటి స్థానంలో నిలవడంలో పెద్ద వింతేమీ లేకపోయినా ఒక దక్షిణాది రాష్ర్టం అదీ బెంగుళూరును పక్కన పెట్టేసి రెండో స్థానం ఆక్రమించడం పెద్ద విశేషమే. రియల్ రంగంలో దూసుకుపోతున్న హైదరాబాద్ లో రోజుకు కోట్లలో లావాదేవీలు జరగడం సాధారణమేమీ కాదు. దీంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి ఇతర నగరాలకు చాలెంజ్ విసిరింది.
ముంబయిలో సరాసరి చదరపు అడుగు రేటు రూ.9600 నుంచి 9800 వరకు ఉంది. అంటే చదరపు అడుగు ధర రూ.9670 గా ఉంటోంది. హైదరాబాద్ లో చదరపు అడుగు ఖరీదు రూ.5751గా ఉంది. మూడో స్థానంలో బెంగుళూరు, నాలుగో స్థానంలో చెన్నై, అయిదో స్థానంలో పుణే నగరాలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో రియల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని తెలుస్తోంది.
జులై నుంచి సెప్టెంబర్ నెలల్లో హైదరాబాద్ లో భారీ సంఖ్యలో స్థలాలు చేతులు మారాయి. ఏడాది యావరేజ్ తీసుకుంటే 140 శాతం పెరుగుదల కనిపించింది. గడిచిన మూడు నెలల్లోనే వ్యాపారం బ్రహ్మాండంగా పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్ రెండో స్థానంలోకి దూసుకుపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ముంబయిని పక్కన పెట్టేసి మొదటి స్థానం కూడా దక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకుల అభిప్రాయం.