Huzurabad bypoll results: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యం కొనసాగిస్తున్నారు. రౌండ్ రౌండ్ కు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఓటమి భయం పట్టుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగిన పోరులో రెండు పార్టీలు ప్రచారంలో సమ ఉజ్జీలుగా నిలిచాయి. అధికార పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. గెలుపు కోసం అన్ని మార్గాల్లో ముమ్మరంగా కొనసాగించినా బీజేపీ అభ్యర్థికే ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల్లో నైరాశ్యం కమ్ముకుంటోంది.

ఇప్పటివరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెలువడగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పై 3432 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో కౌశిక్ రెడ్డి సొంత మండలం వీణవంకలో సైతం బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం చూస్తుంటే బీజేపీకే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి ల సొంత మండలం వీణవంక కావడంతో ఇక్కడ టీఆర్ఎస్ కు ఓట్లు పడతాయని ఆశిస్తున్నా వారి ఆశలు ఏ మేరకు నెరవేరతాయో వేచి చూడాల్సిందే.
మరో వైపు జమ్మికుంట, ఇల్లంతకుంట మండలంలో కూడా ఇద్దరు నాయకుల్లో పోరు ఉధృతంగానే కొనసాగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్లు ఏ పార్టీకి మొగ్గు చూపుతారో అన్న ఆసక్తి పెరుగుతోంది. టీఆర్ఎస్ నేతల్లో మాత్రం విజయంపై ఆశలు సన్నగిల్లుతున్నట్లే కనిపిస్తోంది.