హుజురాబాద్ లో రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో రసవత్తరంగా మారింది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధవాతావరణం చోటుచేసుకోనుంది. ప్రస్తుతం టీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. అదే స్థాయిలో బీజేపీ కూడా తనవంతు కసరత్తు చేస్తోంది. అధికారం కోసమే పావులు కదుపుతున్నాయి. హుజురాబాద్ లో జెండా ఎగురవేయాలని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. ఈటల రాజేందర్ చేరికతో ఎలాగైనా విక్టరీ సాధించాలని బీజేపీ తపిస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నిక రెండు పార్టీలకు చావో రేవో అన్నట్లుగా ఉంది. ప్రతిష్ట కోసం తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి. ఓడితే పరువు పోతుందనే భావంతోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. ఈటల రాజేందర్ గెలిస్తే టీఆర్ఎస్ పరువు పోతుంది. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తే ఈటల భవిష్యత్తు ప్రశ్నాకర్థకం కానుంది. దీంతో ఇరు పార్టీలు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి.
ఇప్పటికే మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లను రంగంలోకి దింపింది. గ్రామాలు, మండలాల వారీగా పార్టీ సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎత్తులు తెలిసిన ఈటల సైతం అదే విధంగా వ్యూహాలకు పదును పెడుతూ అధికార పార్టీకి నిద్ర లేకుండా చేస్తున్నారు.
ఉద్యమ నాయకులకు టీఆర్ఎస్ నాయకులకు జరుగుతున్న యుద్ధంగా అభివర్ణిస్తున్న ఈటల ఉద్యమ నాయకులను రంగంలోకి దింపుతున్నారు. తనతోపాటు నియోజకవర్గంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్న స్వామిగౌడ్, విజయశాంతి, మాజీ ఎంపీ వివేక్ లకు అప్పగిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు వీరంతా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారే కావడంతో వీరిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.