
Huzurabad, Badvel Bypolls: రెండు తెలుగు స్టేట్లలో హుజురాబాద్, బద్వేల్ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నికలు, నవంబర్ 2న లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. దీంతో ఎన్నికల కోలాహలం మొదలైంది. హుజురాబాద్ లో ద్విముఖ పోరు నెలకొంది. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రధానంగా పోటీ జరగనుంది. దీంతో ఇద్దరు తమ ప్రభావం చూపించి విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. హుజురాబాద్ లో 61మంది అభ్యర్థులు పోటీలో ఉండగా నామినేషన్ల ఉపసంహరణ నాటికి తగ్గే అవకాశాలున్నాయి.
అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పథకంతో ముందుకు వెళుతోంది. పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకం హుజురాబాద్ లో లాంఛనంగా ప్రారంభించింది. దీంతో ఓట్లు సంపాదించాలని పావులు కదుపుతోంది. దీంతో బీసీ కార్డుతో వారి ఓట్లను సైతం కొల్లగొట్టాలనే తాపత్రయంతో బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపి బీజేపీకి సవాలు విసురుతోంది. అభివృద్ధికి ఓటేస్తారా? ధరలు పెంచే ప్రభుత్వానికి ఓటు వేస్తారా అంటూ మంత్రి హరీశ్ రావు ప్రశ్నిస్తున్నారు. దీంతో బీజేపీ కూడా సరైన విధంగానే స్పందిస్తోంది. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా తమదే విజయమని ఈటల దీమాగా చెబుతున్నారు. దీనికితోడు ఈటలకు సానుభూతి పనిచేస్తుందని భావిస్తున్నారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా బద్వేల్ లో జరిగే ఉప ఎన్నిక మాత్రం ఏకపక్షమే అని తెలుస్తోంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో అధికార పార్టీ వైసీపీ తమ అభ్యర్థిగా వెంకటసుబ్బయ్య సతీమణి సుధను అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మొదట పోటీలో ఉండాలని భావించినా టీడీపీ, జనసేన విరమించుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ లేనట్లేనని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పోటీలో ఉన్నా ఫలితాలు మాత్రం సింగిల్ సైడే అని తెలుస్తోంది. బద్వేల్ లో 35 మంది అభ్యర్థులు రంగంలో ఉండగా నామినేషన్ల ఉపసంహరణ నాటికి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో సుధ ప్రచారం ముమ్మరం చేసింది. వైసీపీ భారీ మెజార్టీపైనే దృష్టి సారించింది. ఈ క్రమంలో బద్వేల్ లో మాత్రం పోటీ ఉండదనే తెలుస్తోంది.