Chandrababu- Pawan Kalyan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ ఆడుతున్నారా? ఇప్పటికే పొత్తుపై వారు ఒక నిర్ణయానికి వచ్చేశారా? ప్రస్తుతానికైతే ప్రజల్లో బలం పెంచుకోవాలని భావిస్తున్నారా? ఎన్నికల సమీపంలో పొత్తు కుదుర్చుకోనున్నారా? వైసీపీ సర్కారును గద్దె దించాలంటే గుంభనం తప్పదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. కొద్ది నెలల కిందట పొత్తు అంశం తెరపైకి వచ్చిన తరువాత ఎందుకో రెండు పార్టీల్లో సైలెంట్ నెలకొంది. ఎవరూ దీనిపై మాట్లాడడం మానేశారు. దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కలేనన్న సంకేతాలు కనిపించాయి. అటు చంద్రబాబు, ఇటు పవన్ కూడా ఎవరి పని వారు చేసుకుంటున్నారు. దీంతో ఏపీలో త్రిముఖ పోరు తప్పదని అంతా భావించారు. కానీ అదంతా వ్యూహాత్మకమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో ఇద్దరు నేతలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు.
పవన్ దూకుడు..
పవన్ కళ్యాణ్ కౌలురైతు భరోసా యాత్రను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలురైతు కుటుంబాలకు తన సొంత డబ్బులు రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. ఇది పార్టీకి ఎంతో మైలేజ్ చేకూర్చింది. రైతులు కూడా పవన్ ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. పవన్ కార్యక్రమాలకు పోటెత్తుతున్నారు. అటు తరువాత ప్రజావాణి కార్యక్రమంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ముఖ్యంగా మహిళలు కార్యక్రమానికి హాజరై సమస్యలను విన్నవిస్తున్నారు. అదే సమయంలోప్రభుత్వ వైఫల్యాను సోషల్ మీడియాను వేదికగా చేసుకొని పవన్ ప్రశ్నిస్తున్నారు. విభిన్న కామెంట్లతో కార్టూన్, క్యాప్షన్లతో కామెంట్లతో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. తాజాగా గుడ్ మార్నింగ్ సీఎం పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు అక్టోబరు నుంచి బస్సు యాత్ర చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఒకవైపు పార్టీని బలోపేతం చేస్తూనే.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారు. గతం కంటే పవన్ కు ప్రజల్లో పాపులారిటీ, పార్టీకి గ్రాఫ్ పెరిగింది. వచ్చే ఎన్నికల నాటికి మరింత పెంచుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నారు.
చెమటోడ్చుతున్న చంద్రబాబు..
అటు చంద్రబాబుకు ఈ ఎన్నికలు జీవన్మరణంతో సమానం. అందుకే చెమటోడ్చుతున్నారు. వయసు లెక్క చేయకుండా కాలికి బలపం కట్టినట్టుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కనీవినీ ఎరుగని రీతిలో జనాలు తరలిరావడంతో దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మినీ మహానాడులు నిర్వహించారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు. జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో వచ్చే ఎన్నికల్లో విజయం తధ్యమని శ్రేణులు కూడా ఘంటాపథంగా చెబుతున్నాయి. మొన్నటి వరకూ అధికార పార్టీ నుంచి దాడులు, కేసుల భయంతో టీడీపీ నాయకులు ఇళ్లు విడిచి బయటకు రాలేకపోయారు. కానీ చంద్రబాబు మాత్రం వారందర్నీ కార్యోన్ముఖులుగా చేయడంలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం టీడీపీ శ్రేణులు యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించాయి. మరోవైపు నవంబరు నుంచి లోకేష్ తో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. లోకేష్ పాదయాత్రతో సమాంతరంగా చంద్రబాబు కూడా సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికల వరకూ బిజీ షెడ్యూల్ కు సైతం సిద్ధమయ్యారు.
అప్పుడే పొత్తు…
అయితే ప్రస్తుతానికి జనం బాట పట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎన్నికల సమయానికి పొత్తును తెరమీదకు తేవాలని నిర్ణయించుకున్నారుట. ఇప్పటికిప్పుడు పొత్తులు అంటే ఇరు పార్టీల్లో అసంతృప్తులు బయటపడి వైసీపీ గూటికి చేరే అవకాశముందని భావిస్తున్నారు. అందుకే ప్రస్తుతానికి ప్రజల్లో బలం పెంచుకోవాలని చూస్తున్నారు. చివర్లో పొత్తులపై ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం. వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని పవన్ ఇప్పటికే ప్రకటించారు. జనసేన, టీడీపీలు కలిసే ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకూ క్లీన్ స్వీప్ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు రాయలసీమలో కూడా సీన్ మారుతోందని.. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని పొత్తుపై ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం.