Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం కొనసాగింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు పెరిగింది. ఎన్నికలు దేశంలోనే అత్యంత ఖరీదైనవిగా మారాయి. 2014తో పోల్చితే 2018లో అభ్యర్థులు భారీగా ఖర్చు చేశారు. ఇక ఉప ఎన్నికల్లో అయితే ఓటుకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు కూడా డబ్బులు చెల్లించారు. తాజాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ డబ్బులు పంపిణీ జోరుగా సాగింది. విశ్లేషకుల అంచనా ప్రకారం తెలంగాణలో ఒక్కో అభ్యర్థి 10 కోట్ల రూపాయలకు పైగానే పంపిణీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కనీసం 10 వేల కోట్లు రూపాయలు ఓటర్లకు పంపిణీ చేశారు.
ఒక్కో ఓటరుకు రూ.1000
2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుకు రూ.200, క్వార్టర్ సీసా ఇచ్చేవారు. 2018లో ఈ మొత్తం రూ.500లకు పెరిగింది. నగదు, మద్యం అందించారు. ఈసారి ఓటు రేటు రెట్టింపయింది. కనీసం రూ.1000తోపాటు మద్యం పంపిణీ చేశారు. ఒక్కో ఓటరుకు కనీసం రెండు పార్టీలు రూ.3 వేల వరకు ముట్టజెప్పాయి. కొన్ని నియోజవర్గాల్లో బీఆర్‌ఎస్ రూ.2 వేలు, ఖమ్మం జిల్లాలో అయితే ఓటుకు రూ.5 నుంచి రూ.8 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన 119 నియోజకవర్గాల్లో ఒక్కో ఓటరుకు రూ.3 వేల చొప్పున ముట్టజెప్పినా 119 నియోజకవర్గాల్లో 3.3 కోట్ల ఉన్న ఓటర్లలో సగం మందికి మాత్రమే పంపిణీ చేస్తే కనీసం రూ.10 వేల కోట్లు ముట్టాయి. ఇక మొత్తం పంపిణీ చేస్తే మాత్రం అందరికీ కలిపి రూ.20 వేల కోట్లు ముట్టినట్లే.
రూ.18 కోట్లు పంచిన ప్రశాంత్‌రెడ్డి..
నిజామాబాద్ జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తన నియోజకవర్గంలో ఓటర్లకు రూ.18 కోట్ల రూపాయలు పంపిణీ చేశారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈమేరు ఓ ఆడియోకాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఖమ్మంలో పువ్వాడ నాగేశ్వర్‌రావు రూ.25 కోట్లు పంపిణీ చేశారట. తుమ్మలను ఓడించేందుకు ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేసినట్లు సమాచారం. పాలేరులో పొంగులేటిని ఓడించేందుకు కూడా బీఆర్‌ఎస్ భారీగా డబ్బులు పంపిణీ చేసిందని తెలుస్తోంది. ఇక్కడ కూడా ఓటకు రూ.5 వేలు పంపిణీ చేశారని సమాచారం. ఇక్కడ కూడా అధికార పార్టీ రూ.20 కోట్లకు పైనే పంపిణీ చేసినట్లు తెలుస్తోంది.
అంతా బ్లాక్ మనీనే..
ఓటర్లకు అభ్యర్థులు పంచుతున్న సొమ్మంతా బ్లాక్ మనీనే. ఈ సొమ్ము ఎక్కడా లెక్కల్లో చూపరు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలు మాత్రమే పంపిణీ చేయాలి. కానీ, అధికారిక లెక్కలు రూ.40 లక్షల లోపే చూపుతున్న అభ్యర్థులు, ఓటర్లకు మాత్రం కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారు. గెలిచేందుకు ఓటర్లను కొనుగోలు చేశారు. ఓటర్లు కూడా ఎంత ఇస్తారు అని అడిగి మరీ ఓటు వేస్తున్నారు. గెలిచిన తర్వాత ఎలాగూ పని చేయడం లేదు. అందుకే ఇప్పుడు ఎంత ఇస్తారని అడుగుతున్నామని ఓటర్లు చెబుతున్నారు.