Narendra Modi: కేంద్ర ప్రభుత్వం మూడు రైతు చట్టాల విషయంలో వెనక్కితగ్గింది. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కొత్త చట్టాలు తీసుకొచ్చామని చెప్పినా ఎన్‌డీఏ ప్రభుత్వం అన్నదాతల ఆందోళనల నేపథ్యంలో వాటిని రద్దు చేస్తామని ప్రకటించింది. రైతులకు తాను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్టు నిన్న ప్రధాని మోడీ ప్రకటించారు. దీంతో దేశ వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలా ఎన్‌డీఏ సర్కార్ తమ నిర్ణయాల పట్ల వెనక్కి తగ్డడం ఇది మొదటి సారి కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆయా వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడల్లా పలు సార్లు పట్టువిడుపులకు లోనైంది. అందులో కొన్నింటిని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Also Read: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?
ఉపాధి హామీని కుదించాలనే నిర్ణయంపై,..
యూపీఏ హయాంలో వచ్చిన ప్రజల అభిమానం చోరగొన్న పథకాల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఒకటి. దేశంలో ఉన్న ప్రతీ కుటుంబానికి 100 రోజులకు తగ్గకుండా పని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. అయితే 2014లో ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చాక దీనిని కేవలం 200 జిల్లాలకే పరిమితం చేయాలని భావించింది. ఎన్నో వర్గాలకు మంచి చేసిన చట్టాన్ని ఇలా కుదించడం మంచిది కాదని ఆర్థికవేత్తలు ఒత్తిడి తీసుకురావడంతో దీనిపై వెనక్కి తగ్గింది.
భూసేకరణ, పునరావాస చట్టంపై..
2015వ సంవత్సరంలో భూసేకరణ, పునరావాస (లాల్) చట్టంపై తీసుకొచ్చిన సరవరణను చాలా మంది వ్యతిరేకించారు. ప్రఖ్యాత గాంధేయ వాది అన్నాహజరేతో పాటు పలు మిత్ర పక్షాలు కూడా దీనిని ఒప్పుకోలేదు. దీంతో ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.
జంతువులపై క్రూరత్వ నిషేద చట్టంపై..
హిందువులు ఆవులను దైవంగా భావిస్తారు. బీజేపీపై సందర్భం వచ్చినప్పుడల్లా ఆవుల గొప్పదనాన్ని చెబుతూ ఉంటుంది. అలాంటి పశువుల దొంగతనాన్ని, కళేబరాలకు తరలించడాన్ని అరికట్టేందుకు జంతువుల క్రూరత్వ నిషేద చట్టాన్ని 2017లో తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ఉందని, రాష్ట్రాల అధికారాలను ఇవి నియంత్రించేలా ఉన్నాయని పలు రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో ఈ నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.
ఎఫ్‌డీఆర్ఐ యాక్ట్ -2017 పై..
ఫైనాన్స్, బ్యాంకు సంస్థల్లో దివాల కేసులు వంటివి పరిష్కరించేందుకు ఎఫ్‌డీఆర్ఐ యాక్ట్ ను 2017లో కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. దీనిని ప్రతిపక్షాలు, ఆర్థిక వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించడంతో దీనిని వెనక్కి తీసుకున్నారు.
కరోనా వ్యాక్సిన్ విధానంపై..
కరోనా వ్యాక్సిన్ విధానంపై కూడా కేంద్రం చాలా సార్లు తన నిర్ణయాన్ని సవరించుంకుంటూ వచ్చింది. మొదట 65 ఏళ్లు పై బడిన వారకే అని చెప్పింది. ఒక సారి సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనుక్కోవాలని చెప్పింది. కోర్టు జోక్యం చేసుకోవడంతో తరువాత అందరికీ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది.
ఇలా ఈపీఎఫ్ చట్టం, పీఎఫ్ ఉపసంహరణ నిబంధనలు, సామాజిక మాధ్యమ కమ్యూనికేషన్ హబ్ వంటి వాటి విషయంలోనూ సవరణలు తీసుకొచ్చింది. వీటిపై కూడా విమర్ళలు, ఆందోళను రావడంతో ఆ నిర్ణయాలపై వెనక్కి తగ్గింది.
Also Read: చరిత్రలో తొలిసారి.. మోడీ ‘సారీ’.. వైరల్