
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు ప్రయోజనం చేకూరేలా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో కొత్త జిల్లాల ఏర్పాటు ఒకటి. రాష్ట్రంలోని 13 జిల్లాలను 25 లేదా 26 జిల్లాలుగా చేయాలని జగన్ భావిస్తున్నారు. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందనేలా ప్రజలు మాత్రం కొత్త జిల్లాల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తుంటే మరి కొందరు మాత్రం కొత్త జిల్లా ఏర్పాటును విభేదిస్తున్నారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లానే తీసుకుంటే ఆ జిల్లా ప్రజలు జిల్లాల పునర్విభజన విషయంలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉన్న శ్రీకాకుళం జిల్లా మొదట్లో విశాఖలో భాగంగా ఉండేది. ఆ తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖ, శ్రీకాకుళం జిల్లాలు విడిపోయాయి.
అయితే చెన్నారెడ్డి విశాఖలోని కొంత భాగాన్ని, శ్రీకాకుళంలోని కొంత భాగాన్ని కలిపి 1978లో విజయనగరం జిల్లాను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శ్రీకాకుళం భౌగోళిక స్వరూపంలో పెద్దగా మార్పులు జరగలేదు. అయితే జిల్లాల పునర్విభజన వల్ల ప్రభుత్వం శ్రీకాకుళంను రెండు జిల్లాలుగా చేయాలని భావిస్తుండగా అక్కడి ప్రజల్లో కొందరు శ్రీకాకుళం జిల్లాను ఒకే జిల్లాగా కొనసాగిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే జిల్లాలోని కొన్ని ప్రాంతాల ప్రజలు మాత్రం టెక్కలిని కొత్త జిల్లాగా చేయాలని, పాలకొండను కొత్త జిల్లాగా చేయాలని కొత్త ప్రతిపాదనలను తెరపైకి తీసుకొస్తున్నారు. జగన్ సర్కార్ రాజాం, ఎచ్చెర్ల ప్రాంతాలను కొత్త జిల్లా చేయాలని డిమాండ్ చేయడంతో ఒక్క జిల్లాను ఎన్ని జిల్లాలుగా చేయాలనుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల నుంచి భిన్న ప్రతిపాదనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఏ విధంగా ముందుకెళుతుందో చూడాల్సి ఉంది.