YS Jagan Rule In AP: విభజిత ఆంధ్రప్రదేశ్.. తెలంగాణా నుంచి వేరుపడి తలాతోకా లేని రాష్ట్రంగా మిగిలింది. పేద రాష్ట్రంగా అవతరించింది. దానిని ఒక నిర్మాణాత్మకమైన శక్తిగా మార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. శరవేగంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. అభివృద్ధి పట్టాలు ఎక్కించి దేశంలో మిగతా రాష్ట్రాల సరసన చేర్చాల్సి ఉంది. కానీ గత మూడేళ్లుగా చేస్తున్నదేమిటి? జగన్ సర్కారు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది ప్రశ్నిస్తున్న వారిపై దాడులు, వైఫల్యాలు ఎండగడుతున్న వారిపై కేసులు. ఆపై బూతులు, తిట్లదండకం వల్లెవేసే మంత్రులు. ఈ మూడేళ్లలో ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయమూ అమలుకాలేదు. ఆచరణలోకి రాలేదు. రాజ్యాంగబద్దంగా లేకపోవడం, చట్టాలకు విరుద్ధంగా ఉండడంతో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టకుండానే నిర్ణయాలు నిర్వీర్యమవుతున్నాయి. వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నెలవారి జీతాలు మాదిరిగా… ప్రతీ నెల వెనక్కి తీసుకున్నట్టు కనిపిస్తుందే కానీ.. అమలుకు నోచుకున్న దాఖలాలు అయితే ఏపీలో లేవు.
విధ్వంసంతో ప్రారంభం…
అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించిన జగన్ సర్కారు విధ్వంసకర పాలనను తెరతీసిందని ప్రజలకు తెలియదు. రానురాను ఆ విధానం రాటుదేలింది. ప్రస్తుతానికి పారాకాష్టకు చేరుకుంది. ప్రజలు ఇచ్చిన అధికారం పాలనకు కాదు.. తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవడానికి ఒక కొలమానంగా సీఎం జగన్ భావిస్తున్నట్టున్నారు.. ఏకంగా 30 సంవత్సరాల పాటు ఏకధాటిగా పాలించి చరిత్రలో నిలిచిపోవాలని భావిస్తున్నారు. అందుకు సంక్షేమమనే నామం జపిస్తూ బటన్ నొక్కుడుకు పరిమితమవుతున్నారు. చుట్టూ ఐఏఎస్, ఐపీఎస్ లతో పటిష్ట బ్యూరోక్రసీ వ్యవస్థ ఉన్నా.. వారిచ్చే సలహాలు శూన్యమని భావించారో.. లేక చుట్టూ సొంతవారినే పెట్టుకోవాలని అనుకున్నారో కానీ వందలాది మంది సలహాదారులను నియమించుకున్నారు. అందులోనూ తన వర్గానికే పెద్దపీట వేశారు. అగ్రతాంబూలం ఇచ్చారు.
అధికార దుర్వినియోగం….
అధికారమనేది ఒక వస్తువు. దానిని ఎంతలా వాడుకుంటే అంత ఫలితమిస్తుంది. మంచిగా వాడుకుంటే సత్ఫలితాన్నిస్తుంది. అదే చెడుగా వాడుకుంటే చరిత్రహీనుడిని చేస్తుంది. అంతకు మించి ప్రజలకు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ప్రస్తుతం ఏపీలో కూడా ఈ చెడు పాలనే నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. దేశాన్ని ఎందరో ప్రధానమంత్రులు ఏలారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇందులో మెజార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం తమ అధికారాన్ని పరిమితంగా వాడుకున్నారు. పదికాలాల పాటు గుర్తుండిపోయారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారు అబాసులపాలయ్యారు. అయితే అందులో ఎవర్ గ్రీన్ అనిపించుకున్నారు ఏపీ సీఎం జగన్. అయితే ఇది సగటు వైసీపీ అభిమానులకు కటువుగా అనిపించే మాట. చెవిలో ఎక్కించుకోవడానికి ఇష్టపడని మాట. కానీ గత మూడేళ్లుగా జగన్ తన చర్యలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంతో ఇంతకంటే పెద్ద మాట ఉన్నా.. ఆయనకు అన్వయించవచ్చు. అచ్చు గుద్దినట్టు సరిపోల్చవచ్చు.
అన్ని నిర్ణయాలు వెనక్కే….
చేతిలో అధికారముంది కదా.. అని ఏదీ పడితే అది చేయకూడదు. తీసుకున్న నిర్ణయాలు మంచా? చెడా? అని గుర్తెరగాలి. ఇష్టరాజ్యాంగా తీసుకుంటే అవే నిర్ణయాలు ప్రతిబంధకంగా మారతాయి. ఇబ్బందులు తెచ్చి పెడతాయి. ఇప్పుడు ఏపీలో జరుగుతున్నవి అవే. తొలుత శాసనమండలి వేస్ట్ అన్నారు. ఉన్నపలంగా దానిని రద్దుచేస్తున్నట్టు ప్రకటించారు. రూ.60 కోట్లు ఖర్చవుతుందని గణాంకం చూపి పెద్దల సభను లేకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. న్యాయస్థానంలో చుక్కెదురు కావడంతో కొనసాగింపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అక్కడకు ఏడాదిలో శాసనమండలిలో మెజార్టీ వచ్చేసరికి రద్దు నిర్ణయం అటకెక్కించారు. తనకు ఇష్టం లేదని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నే తొలగించాలని నిర్ణయించారు. వీలుకాకపోతే బలవంతంగానే దించాలని నిర్ణయించారు. చివరకు కోర్టు కలుగజేసుకోవడంతో తలదించుకున్నారు.
అస్మదీయులకే రూ.వందల కోట్లు
రూ.10 కోట్లు విలువైన ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన ప్రజాధనం వృథా ఇప్పుడు వందలాది కోట్లకు చేరింది. పప్పూబెల్లంలా పంచే పరిస్థితికి చేరుకుంది. సాక్షి పత్రికలో ఉద్యోగుల జీతాలకు ఆర్థిక భారమైతే ప్రభుత్వంలో కొలువు ఇవ్వడం, గతంలో పనికొచ్చాడని.. భవిష్యత్ లో ఉపయోగపడతాడని భావిస్తే ప్రభుత్వ సలహదారు పోస్టులో నియమించడం పరిపాటిగా మారిపోయింది. లక్షలకు లక్షల జీతాలు ఇవ్వడం గత మూడేళ్లుగా రోటీన్ పాయింట్. అదంతా ప్రభుత్వ సొమ్ము అని తెలిసినా.. ప్రభుత్వమంటే మేమే కదా అన్న రీతిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు సీఎం ఇంటికి రంగులు వేయాలన్నా, ఆధునీకరించాలన్న ప్రభుత్వ సొమ్మే. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన సాక్షి పత్రికకు అయితే వందలాది కోట్ల రూపాయల ప్రకటనలు..భారతీ సిమెంట్స్ కు ప్రకృతి వనరులను కట్టబెడుతున్నారు. రాష్ట్ర ఖజానా అంటే రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు కాదు.. తన సొంత ఇంటి గల్లాపెట్టెగా భావించి వాడేసుకుంటున్నారు. ప్రజలు అప్పగించింది. సంరక్షణకు కాదు భక్షణకేనన్నట్టు ప్రవర్తిస్తున్నారు.
తొలి ఐదేళ్ల ప్రగతి ఏదీ?
విభజిత ఆంధ్రప్రదేశ్.. తొలి ఐదేళ్లు కొంత ప్రగతి సాధించింది. అమరావతి రాజధాని పురుడుబోసుకుంది. పరిశ్రమలు తరలివచ్చాయి. ఏటా పారిశ్రామిక విధానం, పెట్టుబడుల ఆహ్వానం ప్రణాళికాబద్ధంగా జరిగేది. అటు రాజధాని నిర్మాణంతో పాటు విభజన హామీల్లో భాగంగా కేంద్ర విద్యాసంస్థల నిర్మాణం కూడా ప్రారంభమైంది. ఏటా పెట్టుబడుల సదస్సుకు పారిశ్రామికవేత్తలు వచ్చేవారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. క్రేజ్ కలిగింది. కానీ వైసీపీ సర్కారు వచ్చిన తరువాత పరిశ్రమల ఊసులేదు. వ్యాపారాల్లో పురోగతి లేదు. ఏపీలో పలానా వ్యాపారం సవ్యంగా జరుగుతుందని చెప్పలేని దుస్థితి నెలకొంది. నారాయణ విద్యాసంస్థలపై కోపంతో అస్తవ్యస్త నిర్ణయాలు తీసుకున్నారు. సినిమా హాళ్లు, వైద్యులు, హోటళ్లు, చివరకు ఫ్లెక్సీలు వేసుకునేవారికి సైతం రోడ్డున పడేశారు. ఒక వైపు ప్రజల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ… మరోవైపు సంక్షేమం మాటున రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారు. మొత్తానికైతే తన మూడున్నరేళ్ల పాలనతో జగన్ సర్కారును 20 ఏళ్ల వెనక్కి తీసుకెళ్లింది. అంతులేని విజయాన్ని అందించిన ఏపీ ప్రజలకు నట్టేట ముంచింది.