మార్చి 22న దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించడం జరిగింది. అప్పుడు ఆ ఒక్కరోజే దేశం వ్యాప్తంగా బంద్ ఉంటదని అందరూ అనుకున్నారు. రెండు రోజులు గడవకముందే.. 21 రోజుల లాక్ డౌన్ విధించారు. తర్వాత 19రోజుల లాక్ డౌన్ ఆ విధంగా కరోనా వ్యాప్తితో పాటు లాక్ డౌన్ రోజులు పెంచుకుంటూ వెళ్లారు. ప్రజలకు పరిస్థితులు మెల్ల మెల్లగా అర్ధమయ్యాయి. ఈ కరోనా ఇప్పట్లో తగ్గేది కాదని డిసైడ్ అయ్యారు. అంతే.. చిన్న చిన్నగా రాజధాని వదిలి పల్లె బాట పట్టారు. దీంతో హస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, స్టడీ సెంటర్లు ఒక్కొక్కటిగా మూతపడసాగాయి. అమీర్ పేట్, గాంధీ నగర్, అశోక్ నగర్ వంటి రద్దీ ప్రాంతాలలో లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి అవన్నీ మూతపడే ఉన్నాయి. ఒక్క గాంధీ నగర్ లోనే స్టడీ సెంటర్లుగా మారిన 300కి పైగా రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఖాళీగా మారాయి. కోచింగ్ సెంటర్లను ఆధారంగా చేసుకుని నడిచే 318 హాస్టళ్లు క్లోజ్ అయ్యాయి. ఎటుచూసినా తెరుచుకోని మెస్‌లు, టూ లెట్ బోర్డుతో సింగిల్ బెడ్రూం ఇండ్లు కనిపిస్తున్నాయి.
వేగంగా విజృంభిస్తున్న కరోనాతో హైదరాబాద్ ఖాళీ అవుతోంది. బస్తీలు, కాలనీలు, కమర్షియల్ ఏరియాలు అనే తేడా లేకుండా టు లెట్, లీజ్ బోర్డులు వేలాడుతున్నాయి. స్టూడెంట్స్, వర్కింగ్ మెన్, విమెన్ హాస్టళ్లతో సందడిగా ఉండే ప్రాంతాలన్నీ బోసిపోయాయి. రంగు రంగుల లైట్లు, గాజు గోడలతో ఎట్రాక్ట్చేసే కమర్షియల్ ఏరియాల్లో నెలలు గడుస్తున్నా… లీజులకు ముందుకొస్తలేరు. లాక్ డౌన్ మొదలు బస్తీల్లో 30శాతానికి పైగా ఇళ్లు ఖాళీ అయ్యాయి. కాలనీల్లో ప్రతి 100 ఇండ్లలో పదుల సంఖ్యలో టు లెట్ బోర్డులు ఊగుతున్నాయి.
కోటికిపైగా జనాభా ఉన్న మహా నగరంలో 28లక్షల కుటుంబాలున్నాయి. అందులో 60శాతానికి పైగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చినవారే. ఇంటి యజమానుల కంటే అద్దెకుండే వాళ్లే ఎక్కువ. చిరుద్యోగులు, బిజినెస్ కోసం వచ్చిన వారిలో చాలామంది 3 నెలల నుంచి పనులు, గిరాకీ లేక సొంతూళ్లకు వెళ్లిపోయారు. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులతో ఉన్న ఫళంగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇప్పటిదాకా 6 నుంచి 7 లక్షల మంది వెళ్లిపోయినట్లు అంచనా. మరోవైపు ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో పని చేసే ఉద్యోగులు 10 లక్షల మందికిపైగా ఉండగా, అన్ని కంపెనీల్లో వర్క్ ఫ్రం హోం అమలవుతోంది. అలా సిటీలో ఇండ్లు, రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా భాగ్యనగరం జనాలు లేక ఇంటి యజమానులు, కమర్సియల్ బిడ్డింగ్స్ టూలెట్ బోర్డులతో నిండిపోయాయి.