Minister Roja vs Janasena: ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్. విపక్షాలపై విరుచుకుపడడంలో ముందుంటారు. అదే సమయంలో సీఎం జగన్ ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బోటాబోటీ మెజార్టీతో విజయం సాధించిన రోజాకు స్వపక్షంలో విపక్షం ఉంది. అసమ్మతి గట్టిగానే ఉంది. సొంత పార్టీ నేతలతో విభేదాలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ డౌటే అన్న కథనాలు వచ్చాయి. ఇచ్చినా ఓటమి ఖాయమని కూడా సొంత పార్టీ నేతలు తేల్చేశారు. ఇటువంటి సమయంలో తన గాడ్ ఫాదర్ గా భావించే ఏపీ సీఎం జగన్ అమాత్య పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె వీరలెవల్ లో విరుచుకుపడుతున్నారు. అటు చంద్రబాబు, లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ ను అనరాని మాటలు అనేస్తున్నారు. చేయకూడని వ్యాఖ్యలు సైతం చేస్తున్నారు. అటు పార్టీ నేతలైన కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలకు సైతం వకల్తా పుచ్చుకుంటున్నారు.

తాజాగా ఆమె పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జన సైనికులు అసలు నగిరిలో అభివృద్ధి అంటూ ఏదీ లేదని.. వచ్చే ఎన్నికల్లో రోజా ఓటమి ఖాయమని.. నగిరిలో రోజా శకం ముగిసిందంటూ కామెంట్స్ చేశారు. దీనిపై మంత్రి రోజా స్పందించారు. అగ్గిమీద గుగ్గిలమయ్యారు. దమ్ముంటే నగిరి రండి అంటూ సవాల్ చేశారు. తన ఇంటికి వస్తే నగిరి అభివృద్ధి వివరిస్తానని కూడా కౌంటర్ ఇచ్చారు. జెండా విలువలు లేని వ్యక్తి వద్ద జనసైనికులున్నారంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. దీనిపై జనసేన నేత కిరణ్ రాయల్ దీటుగా స్పందించారు. దమ్ముంటే నగరిలో మీ పార్టీ సమీక్ష పెట్టండంటూ సవాల్ చేశారు. తిరుపతి నుంచి కొందరు జనసేన నాయకులు నగిరి రోజా ఇంటికి బయలుదేరారు. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. వారిని అడ్డుకున్నారు. కొందరు నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ లు చేశారు. దీంతో అటు తిరుపతి, ఇటు నగిరిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగిరి అభివృద్దిపై చర్చించడానికి పిలిచి రోజా తోక ముడిచారంటూ ఎద్దేవా చేశారు. అటువంటప్పుడు సవాళ్లు ఎందుకు చేయాలని ప్రశ్నించారు. సవాల్ విసిరిన మీరే పోలీసులతో అడ్డుకున్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. మొన్నటి ఎన్నికల్లో అత్తెసరు మెజార్టీతో గెలిచిన మీరు వచ్చే ఎన్నికల్లో ఓటమి చవిచూస్తారంటూ నేరుగానే రోజాకు బదులిస్తున్నారు. అటు సోషల్ మీడియా వేదికగా కూడా రోజాపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. హాట్ హాట్ కామెంట్లు పెడుతున్నారు. జనసేనకు తోడుగా టీడీపీ శ్రేణులు సైతం రోజాపై విరుచుకుపడుతుండడం విశేషం.
[…] […]