ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణపై చర్యలకు ఆదేశించింది. సత్యనారాయణపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన హైకోర్టు అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.
కలిదండి పంచాయతీ కార్యదర్శికి బకాయిలు చెల్లించాలని గతంలో సత్యనారాయణకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ ఆదేశాలు అమలు చేసినప్పటికీ గత వాయిదాకు సత్యనారాయణ ఆలస్యంగా హాజరయ్యారు.
ఈ క్రమంలోనే కోర్టు ధిక్కరణగా వ్యవహరించారని.. ఆలస్యంగా వచ్చారని హైకోర్టు సీరియస్ అయ్యింది. వెంటనే ఆయన వారెంట్ రీకాల్ కోసం సత్యనారాయణ దాఖలు చేసిన పిటీషన్ ను కోర్టు కొట్టివేసింది. జైలు శిక్షతోపాటు రూ.50వేల జరిమానా ఉంటుందని హెచ్చరించింది.
అయితే శిక్ష నిలిపివేయాలంటూ సత్యనారాయణ, ఆయన తరుఫున న్యాయవాది ధర్మాసనాన్ని కోరగా.. లంచ్ తర్వాత పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇలా హైకోర్టు విషయంలో అజాగ్రత్తగా వ్యవహరించిన ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు.