భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రివర్గం నుంచి తొలగించేసింది కేసీఆర్ సర్కార్. అంతేకాదు.. ఆయన కబ్జా చేశాడని అధికారులతో నివేదిక ఇప్పించింది. అయితే ఈటల ఊరుకుంటాడా? న్యాయం చేయాలని హైకోర్టుకు ఎక్కాడు. విచారణ చేపట్టిన హైకోర్టు కేసీఆర్ సర్కార్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 1, 2 తేదీల్లో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక చెల్లదని పేర్కొంది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకోవద్దని స్పష్టం చేసింది.
చట్ట ప్రకారం ముందుగా ఈటలకు నోటీసులు ఇచ్చి నిబంధనల ప్రకారం సమయం ఇవ్వాలని సూచించింది. వెనుక గేటు నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లి విచారణ చేయాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ఈటల కుటుంబం వేసిన అత్యవసర పిటీషన్ పై హైకోర్టు న్యాయమూర్తి వినోద్ కుమార్ తన నివాసంలోనే విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరుఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేముందు తమకు నోటీసులు ఇవ్వలేదని తెలిపారు.
అయితే ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయని.. అందుకే విచారణ చేపట్టామని ప్రభుత్వం తరుఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ వాదించారు. అయితే విచారణ జరిగిన తీరును హైకోర్టు తప్పుపట్టింది. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వరా అని నిలదీసింది. రాత్రికి రాత్రి సర్వే ఎలా చేస్తారు? ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా అని వ్యాఖ్యానించారు. కారులో కూర్చొని ఈ నివేదికను అధికారులు రాసినట్లు ఉందని అభిప్రాయపడ్డారు.