RBI On 2000 Rupee Note: దేశంలో సరిగ్గా ఆరున్నర సంవత్సరాల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిమానిటైజేషన్ స్ట్రోక్ ఇచ్చింది. పైకి క్లీన్ నోట్ పాలసీ అని చెబుతున్నప్పటికీ దాని అసలు లక్ష్యం వేరే ఉంది. 2000 నోట్లను ఉపసంహరిస్తూ ఉత్తర్వుల జారీ ఇప్పుడు కలకాలం సృష్టిస్తోంది. ఈనెల 23 నుంచి వీటిని మార్చుకునే అవకాశం ఇచ్చినప్పటికీ నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం సెప్టెంబర్ 30 వరకు 2000 నోట్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అంగీకరిస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న కన్స్ట్రక్షన్, రియాల్టీ రంగంలో ఉన్న పెద్దలతో పాటు రాజకీయ నాయకులను షాక్ కు గురిచేసింది.
స్థిరాస్తి వ్యాపారంలో మొత్తం నల్ల డబ్బే
రియల్ ఎస్టేట్ రంగంలో జరిగే లావాదేవీల్లో అత్యధికం నగదు రూపంలో జరుగుతాయి. అందులోనూ నల్లధనం చెలామణి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ భూమి చూసినా దాని కార్డు వాల్యూ కు, మార్కెట్ ధరకు అసలు పొంతన ఉండదు. వీటి మధ్య దాదాపు 60 నుంచి 80 శాతం వరకు వ్యత్యాసం ఉంటుంది అని మార్కెట్ నిపుణులు చెబుతూ ఉంటారు. కార్డు వ్యాల్యూ ను ప్రభుత్వ ధరగా పిలుస్తారు. ఇది లక్షల్లో మాత్రమే ఉంటుంది. అదే మార్కెట్ రేటు అయితే కోట్లల్లో ఉంటుంది. ఈ కారణంగానే డాక్యుమెంట్లలో కార్డు వ్యాల్యూ నమోదు చేసే క్రయవిక్రయదారులు ఆ మేరకు మాత్రమే డీడీలు, చెక్కులు తదితర రూపాల్లో బదిలీ చేసుకుంటారు. మిగతాది మొత్తం నగదు రూపంలో ఇచ్చిపుచ్చుకుంటారు. దీంతోపాటు నిర్మాణ రంగంలో లావాదేవీలు కూడా నగదు రూపంలో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ రెండు విభాగాల్లో చలామణి అవుతున్న నగదులో 2000 నోట్ల ఎక్కువగా ఉంటున్నాయి అనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ నాయకుల్లో దిగులు
ఇక తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఈ ఏడాది చివరిలో, పార్లమెంటుకు వచ్చేఏడాది ప్రథమార్థంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక చిన్న ఎమ్మెల్యే నియోజకవర్గానికి కోట్లలో ఖర్చు చేయాల్సిందే. అయితే ఎన్నికల సంఘానికి చిక్కకుండా చేసే ఈ ఖర్చులో నల్లధనమే ఎక్కువగా ఉంటుంది. దీనికోసం పెద్దపెద్ద బడా నేతలు, వారి బినామీలు భారీ మొత్తంలో 2000 నోట్లను దాచిపెట్టారన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణంగానే మూడు లక్షల కోట్లకు పైగా విలువైన రెండు వేల నోట్లు చెలామణిలో ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. అయితే బ్యాంకుల్లో ఈ నోట్లు అందుబాటులో లేవు. ఈ నోట్లు లేవనే విషయాన్ని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరిస్తున్నది. అయితే ఇలా నోట్లు దాచుకున్న రాజకీయ నాయకులకు బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొన నిర్ణయం శరాఘాతంగా పరిణమించింది.
పోలీసుల బందోబస్తు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మార్పిడికి భారీ డిమాండ్ పెరిగింది. దీన్ని అదునుగా చేసుకొని హవాలా రాకెట్లు ఒక్కసారిగా పెరిగిపోతాయి. వీటన్నింటికీ మించి కమిషన్ తీసుకొని నోట్లు మార్పిడి చేసి ఇచ్చే వ్యవస్థీకృత ముఠాలు, ఆ పేరు చెప్పి మోసాలకు పాల్పడే కేటుగాళ్లు రెచ్చిపోతారు. 2016 నవంబర్ 10న అమలులోకి వచ్చిన డిమానిటైజేషన్ సందర్భంలో ఇలాంటి అనేక ఉదంతాలు దేశవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకున్న పోలీసు, నిఘా విభాగాలు సైతం అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న హవాలా రాకెట్లు, గతంలో ఈ కేసులో అరెస్ట్ అయి బయటకు వచ్చిన వారిపై పోలీసు బృందాలు వారిపై ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేశాయి. అయితే వీటికి తోడు త్వరలో ఎదురుకానున్న నోట్ల మార్పిడి కష్టాలు తలుచుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఉలిక్కిపడుతున్నారు..206 నాటి అనుభవాలను నెమరు వేసుకుంటున్నారు.