https://oktelugu.com/

CM KCR: కేసీఆర్‌ను ఓడించిన ఒకే ఒక్కడు

అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 1,12,576 మంది ఓటర్లు ఉండగా, 65.01 శాతం పోలింగ్‌ జరిగింది. 73,189 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్‌ అభ్యర్థి అనంతుల మదన్‌ మోహన్‌కు 28,766 ఓట్లు వచ్చాయి.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 22, 2023 / 04:05 PM IST

    CM KCR

    Follow us on

    CM KCR: తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో ప్రారంభమైంది. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు గులాబీ బాస్‌కు ఓటమి లేదు. ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ, ఈ కేసీఆర్‌ తన రాజకీయ జీవితంలో ఒకే ఒక్కసారి ఓడిపోయారు. ఆయనను ఓడించిన ఆ ఒకే ఒక్కడు అనంతుల మదన్‌ మోహన్‌.

    1983లో టీడీపీ అభ్యర్థిగా…
    1983వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అందులో సిద్దిపేట నియోజకవర్గం కూడా ఒకటి. అప్పటికి మెదక్‌ జిల్లాలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సిటింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న అనంతుల మదన్‌ మోహన్‌ను ఆ పార్టీ మళ్లీ బరిలో దించింది. బీజేపీ నుంచి ఆయనపై నిమ్మ నర్సింహరెడ్డి పోటీ చేశారు. అప్పటికి కొద్ది నెలల కిందటే నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా సిద్దిపేట నుంచి తన అభ్యర్థిని పోటీలో నిలిపింది. ఆ టీడీపీ అభ్యర్థి కూడా కొత్తవారు. శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు అదే తొలిసారి. ఆయనే కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు(కేసీఆర్‌). అనంతుల మదన్‌ మోహన్‌ సిద్దిపేట నియోజకవర్గం నుంచి అప్పటికి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983 ఎన్నికలు ఆయనకు నాలుగో అసెంబ్లీ ఎన్నికలు.

    65 శాతం పోలింగ్‌..
    నాటి అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 1,12,576 మంది ఓటర్లు ఉండగా, 65.01 శాతం పోలింగ్‌ జరిగింది. 73,189 ఓట్లు పోలయ్యాయి. అందులో కాంగ్రెస్‌ అభ్యర్థి అనంతుల మదన్‌ మోహన్‌కు 28,766 ఓట్లు వచ్చాయి. టీడీపీ నుంచి పోటీ చేసిన కేసీఆర్‌ 27,889 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి నిమ్మ నర్సింహరెడ్డికి 13,358 ఓట్లు వచ్చాయి. దాంతో అనంతుల మదన్‌ మోహన్‌ తన సమీప అభ్యర్థి కేసీఆర్‌పై 887 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

    మదన్‌ మోహన్‌ను రెండుసార్లు ఓడించిన కేసీఆర్‌..
    ఇక ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నట్లుగా కేసీఆర్‌ సిద్దిపేట నుంచే మళ్లీ పోటీ చేశారు. తొలి ఎన్నికలలో ఆయనకు పరాజయం ఎదుర్కొన్న కేసీఆర్‌.. తర్వాత ఎప్పుడూ ఓడిపోలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 13 సార్లు వరుసగా ఆయన చట్టసభలకు ఎన్నికవుతూనే ఉన్నారు. ఈ 13 సార్లలో 8 సార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికవగా 5 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తన తొలి ఎన్నికలలో ఓటమి రుచి చూపించిన అనంతుల మదన్‌ మోహన్‌ను కేసీఆర్‌ 1989, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించారు. కేసీఆర్‌ 1985 నుంచి ఓటమి ఎరుగని నేతగా రాజకీయ ప్రయాణం సాగిస్తున్న కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.

    ఎవరీ మదన్‌ మోహన్‌?
    అనంతుల మదన్‌ మోహన్‌ను కేసీఆర్‌కు రాజకీయ గురువుగా చెప్తారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ తెలంగాణ ఉద్యమంలో, రాజకీయాలలో మదన్‌ మోహన్‌ చురుగ్గా ఉండేవారు. కేసీఆర్‌ విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో, కాంగ్రెస్‌లో ఉన్న కాలంలో మదన్‌ మోహన్‌కు సన్నిహితంగా ఉండేవారు. అనంతరం ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించడంతో కేసీఆర్‌ అందులో చేరి సిద్దిపేటలో అనంతులపై పోటీ చేశారు.

    1970 నుంచి రాజకీయ ప్రస్థానం..
    అనంతుల మదన్‌ మోహన్‌ 1970 సిద్దిపేట ఉప ఎన్నికలతో తన అసెంబ్లీ ప్రస్థానం ప్రారంభించారు. 1967లో సిద్దిపేట నుంచి గెలిచిన వల్లూరి బసవరాజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దీంతో 1970లో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలలో అనంతుల మదన్‌ మోహన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయగా, కాంగ్రెస్‌ పార్టీ నుంచి పీవీ రాజేశ్వరరావు పోటీ చేశారు. 31,633 ఓట్లు సాధించిన అనంతుల ఆ ఎన్నికలలో గెలిచారు. అనంతరం 1972, 1979 ఎన్నికలలోనూ అనంతుల మదన్‌ మోహన్‌ విజయం సాధించారు. 1983లో ఆయన కేసీఆర్‌పై గెలిచారు. పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, టంగుటూరి అంజయ్య, కోట్ల విజయభాస్కర రెడ్డి మంత్రివర్గాలలో మదన్‌ మోహన్‌ మంత్రిగా పనిచేశారు. రెవెన్యూ, ఆరోగ్యం, విద్యా శాఖ వంటి కీలక శాఖలకు ఆయన మంత్రిగా ఉన్నారు.

    ప్రతిపక్ష నేతగా..
    1983 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 200కిపైగా సీట్లు గెలుచుకుని ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా, శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అనంతుల మదన్‌ మోహన్‌ వ్యవహరించారు. 1985లో ఆయన ఎన్నికలలో పోటీ చేయలేదు. 1989, 1994 ఎన్నికలలో సిద్ధిపేటలోనే కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి రెండు సార్లూ కేసీఆర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన రాజకీయంగా తెరమరుగయ్యారు.