JanaSena: విజయనగరం జిల్లా పై జనసేన ఫోకస్ పెట్టిందా? జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో పోటీ చేయనుందా? ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ప్రతిపాదనలు పంపిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ప్రధానంగా తూర్పు కాపు- వెలమ సామాజిక వర్గాలను సంఘటితం చేస్తూ జనసేన రాజకీయ వ్యూహాలను రూపొందించుకోవడం విశేషం. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాలకు గాను.. మూడు స్థానాల్లో జనసేన బలమైన ముద్ర చూపుతోంది. పొత్తులో భాగంగా ఆ మూడింటినే అడుగుతోంది.
గజపతినగరం, భోగాపురం, ఎస్. కోట నియోజకవర్గాలను జనసేన అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గజపతినగరం నియోజకవర్గంలో జనసేన యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఈ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి పడాల అరుణ పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. గజపతినగరం టికెట్ ఆశిస్తున్నారు. టిడిపి తో పొత్తు ఉండడంతో తప్పకుండా విజయం సాధిస్తాం అన్న ధీమాతో ఉన్నారు. సుదీర్ఘకాలం ఆమె తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకసారి మంత్రిగా కూడా వ్యవహరించారు. కానీ జిల్లా తెలుగుదేశం నాయకులతో విభేదాలు తలెత్తడంతో రాజకీయంగా నష్టపోయారు.
ప్రస్తుతం గజపతినగరం నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. 2014లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేఏ నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో సైతం మరోసారి బరిలో దిగారు. ఓటమిపాలయ్యారు. ఈసారి కూడా తనకే టిక్కెట్ కావాలని కోరుతున్నారు. అయితే అక్కడ కరణం శివరామకృష్ణ అనే మరో నాయకుడు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆర్థిక, అంగ బలంతో పాటు నియోజకవర్గంలో బంధుత్వాలు ఎక్కువగా ఆయనకు ఉన్నాయి. దీంతో అక్కడ టిక్కెట్ విషయంలో టిడిపి హై కమాండ్ పునరాలోచనలో పడింది. ఇంతవరకు ఎవరికీ అనేది స్పష్టం చేయలేదు.
జనసేన పొత్తులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం కోరుకుంటుంది. ఈ విషయాన్ని జనసేన అత్యున్నత సమావేశాల్లో అధినేత పవన్ వెల్లడించారు. అన్ని జిల్లాల్లో బలమైన అభ్యర్థులను గుర్తించాలని పార్టీ నేతలకు ఆదేశించారు. విజయనగరం జిల్లాలో జనసేనకు ఆదరణ ఉందని.. ఉమ్మడి జిల్లాలో 9 నియోజకవర్గాల్లో గెలుపునకు జనసేన దోహదం చేస్తుందని నివేదికలు అందాయి. అందుకే తొమ్మిది నియోజకవర్గాల్లో మూడు స్థానాలను జనసేనకు విడిచి పెట్టాలని టిడిపికి ప్రతిపాదనలు వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ముందుగా గజపతినగరం అయితే సేఫ్ జోన్ అని.. అక్కడ జనసేనకు టికెట్ కేటాయిస్తే గెలుపు సునాయాసమని హై కమాండ్ గుర్తించింది. పైగా టిడిపిలో వర్గ పోరు కారణంగా.. తెలుగుదేశం పార్టీ సైతం జనసేనకు ఈ స్థానాన్ని విడిచి పెట్టేందుకు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి.