Srireddy vs Mega Family: కులం నీకు ఏమిచ్చిందంటే..? చంపుకోవడానికి పగలు ఇచ్చింది.. కొట్టుకోవడానికి కావాల్సినంత వైషమ్యాలను పెంచింది.. తిట్టుకోవడానికి అగ్ర, అథమ తేడాలు చూపించింది.. ఇప్పుడు ఆ కుల జాఢ్యం తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో ఎక్కువ అని ఎవరిని అడిగినా చెబుతారు.. ఏపీ అంటేనే కులాల ఆదిపత్యపోరుగా చెప్పొచ్చు.. ఇప్పటికీ రెండు మూడు సామాజికవర్గాల ఆధిపత్యం ఏపీ రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కులాల వారీగా జనాభా కూడా విడిపోయింది. ఆ పట్టింపులు కూడా ఏపీ సమాజంలో ప్రస్ఫుటిస్తాయి. ప్రజలే అలా ఉన్నప్పుడు ఇక నేతలు అలా ఉండకుండా ఎలా ఉంటారు. ఇప్పుడా కులాల కొట్లాటలో పడిపోయి ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు.
తాజాగా రెడ్డి సామాజికవర్గం నుంచి దిగిన ఒక హాట్ సినీ లేడి టాలీవుడ్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతా చేయడానికి కంకణం కట్టుకుంది.. ఆమె టాలీవుడ్ పెద్దలను తిడుతూ.. వైసీపీ ప్రభుత్వాన్ని పొగుడుతోంది. ఇప్పుడు వైసీపీ వర్గాలు సంబరపడుతున్నా కానీ.. ఆమె వల్ల చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా జగన్ సర్కార్ కు కూడా ఎఫెక్ట్ పడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్ అయినప్పుడు సినీ ఇండస్ట్రీ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదన్న ఆవేదన వైసీపీ వర్గాల్లో ఉంది. ఆది నుంచి టాలీవుడ్ తెలుగుదేశం వెంట నడిచింది. నాడు ఎన్టీఆర్ ను.. ఆ తర్వాత చంద్రబాబును నెత్తినపెట్టుకుంది. చంద్రబాబు సైతం ఎంతో మంది సినీ ప్రముఖులకు టికెట్లు ఇతర సహాయాల విషయంలో ఉదారంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే అసలు వైసీపీ పెట్టిన జగన్ ను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదన్న వాదన ఉంది.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా.. చంద్రబాబు ఓడి జగన్ గెలిచాడు. మోహన్ బాబు అన్నట్టు గెలిచాక సినీ పెద్దలంతా పోయి జగన్ ను సన్మానించి ఓ బొకే అందజేస్తే ఖేల్ ఖతమయ్యేది. కానీ ఎవరూ పట్టించుకోలేదు. అదే జగన్ సహా వైసీపీలో మంటపుట్టించింది. సినిమా టికెట్ల రేట్లు సహా ఆన్ లైన్ టికెటింగ్ అంటూ మెలిక పెట్టి సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడం జగన్ సర్కార్ మొదలుపెట్టింది. ఇప్పుడు కక్కలేక మింగలేక టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
దీన్ని పవన్ కళ్యాణ్ వద్ద మొరపెట్టుకుంటే ఆయన ‘రిపబ్లిక్’ మూవీ వేడుకలో బరస్ట్ అయ్యాడు. టికెట్ల రేట్లను నిర్ధేశించడానికి మీరెవరూ అంటూ జగన్ సర్కార్ కు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు. అక్కడ మొదలైంది లొల్లి. పవన్ కళ్యాణ్ ను, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి వైసీపీ అనుకూల వర్గాలు చేసిన రచ్చ అంతా ఇంతాకాదు.ఇప్పటికీ కూడా ఆ టికెట్ల లొల్లి రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
ఈ మధ్య చిరంజీవి స్వయంగా జగన్ ను కలవడానికి ప్రయత్నించినా అది వీలు కాలేదని.. టాలీవుడ్ విషయంలో జగన్ చాలా పట్టుదలగా ఉన్నట్టు అర్థమైంది. సినిమా టికెట్ల రేట్లను పెంచేది లేదని జగన్ సర్కార్ డిసైడ్ అయ్యింది.
ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ నుంచి నిరసన స్వరాలు వినిపించాయి. హీరో నాని, ఆర్ . నారాయణమూర్తి సహా పలువురు నిర్మాతలు, హీరోలు ఏపీ ప్రభుత్వంపై గళం వినిపించారు. తప్పుపట్టారు. కొందరు హైకోర్టుకు కూడా ఎక్కారు. దీంతో ఏపీ సర్కార్ పై టాలీవుడ్ ముప్పేట దాడి మొదలైందనే చెప్పాలి.
దీనికి కౌంటర్ గానే తాజాగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నటి శ్రీరెడ్డి రంగంలోకి దిగింది. జగన్ సర్కార్ పై ఈగవాలితే ఊరుకునేది లేదని ఆమె ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయింది. ‘చిరంజీవిది ఏంటి బోడిపెత్తనం’ అని విరుచుకుపడింది. మెగా ఫ్యామిలీని తీసిపారేసింది. మోహన్ బాబు, బాలక్రిష్ణను నెత్తిన పెట్టుకుంది. ఫక్తు వైసీపీ ప్రతినిధిగా మాట్లాడేసింది.
శ్రీరెడ్డి మాటలను బట్టి చూస్తుంటే వైసీపీనే మెగా ఫ్యామిలీపై, టాలీవుడ్ పై రంగంలోకి దించిందని.. జగన్ వదలిని బాణం శ్రీరెడ్డి అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉండబట్టలేక కొందరు జర్నలిస్టులు అడగనే అడిగేశారు. ‘ఈఎంఐ, రెంట్ కట్టడానికి కూడా డబ్బుల్లేని శ్రీరెడ్డి ఈరోజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో ఎలా సభ్యత్వం తీసుకుంది? ఎలా నిర్మాతగా మారింది?’ అని ప్రశ్నించారు. దీనికి సింపుల్ గా సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక్కరోజులో కోట్లు వస్తాయి.. కోట్లు పోతాయి.. తనకు మద్దతుగా తన స్నేహితులు, బంధువులు, కొందరు సామాజికవర్గ పెద్దలు అండగా ఉన్నారు. వారి అండదండలతోనే తాను నిర్మాతగా మారాను అని శ్రీరెడ్డి వివరించింది.
దీన్ని బట్టి శ్రీరెడ్డికి భారీగా డబ్బులు ఇచ్చి.. ఆమెను నిర్మాతగా మార్చి ‘రెడ్డి’ నేతలు కొందరు మెగా ఫ్యామిలీని, టాలీవుడ్ ను టార్గెట్ చేశారని.. వైసీపీ సర్కార్ కు మద్దతుగా మాట్లాడిస్తున్నారని అర్థమవుతోంది. మరి శ్రీరెడ్డి వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఎవరన్నది తేలాల్సి ఉంది.