Delhi Car Blast: జమ్ము కాశ్మీర్.. ఈ రాష్ట్రం మాత్రమే కాదు.. మనదేశంలోని అనేక రాష్ట్రాలు పాకిస్తాన్ దేశంతో సరిహద్దు రేఖను కలిగి ఉన్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. పాకిస్తాన్ కూడా ముస్లిం దేశం కాబట్టి.. పైగా ఈ రాష్ట్రం లో కొంత ప్రాంతాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది కాబట్టి.. ఇక్కడ సరిహద్దు గుండా నిత్యం అక్రమంగా రాకపోకలు జరిగేవి కాబట్టి.. ఈ ప్రాంతం సైన్యం ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ నిత్యం సైనికులు పహారా కాస్తూ ఉంటారు.
వాస్తవానికి జమ్ము కాశ్మీర్ సున్నితమైన రాష్ట్రం. గతంలో ఈ రాష్ట్రంలో సరిహద్దుల వెంట పాకిస్తాన్ ముష్కరులు మనదేశంలోకి అడుగుపెట్టేవారు. ఇక్కడ బాంబు పేల్చివేతలు చేసి జనజీవనాన్ని ఇబ్బందికి గురి చేసేవారు. నకిలీ నగదు.. మాదకద్రవ్యాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దారుణమైన పనులు చేసేవారు. చివరికి పర్యాటకుల మీద కూడా కాల్పులు జరిపేవారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ ముష్కరుల దృష్టి జమ్మూ కాశ్మీర్ మీద మాత్రమే కాకుండా హర్యానా, రాజస్థాన్, పంజాబ్ మీద పడింది. గతంతో పోల్చి చూస్తే ఈ రాష్ట్రాలలో ఉన్న సరిహద్దు వెంట పకడ్బందీగా రక్షణ వ్యవస్థను భారత్ ఏర్పాటు చేసింది. అక్రమ చొరబాట్లను పూర్తిగా నియంత్రించింది. తద్వారా ఉగ్రవాదుల రాకపోకలు ఆగిపోయాయి. అయితే ఇటీవల భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. వారి శిబిరాలను నేలమట్టం చేసింది. అయితే దీనిని మనసులో పెట్టుకున్న ఉగ్రవాదులు భారత్ మీద విషం చిమ్మడం మొదలుపెట్టారు. భారత్లో కుట్రలకు తెర లేపారు. ఇందులో భాగంగానే డ్రోన్లను ఆయుధాలుగా వాడుకుంటున్నారు.
పాకిస్తాన్ నుంచి పేలుడు పదార్థాలను, ఆయుధాలను, మాదకద్రవ్యాలను డ్రోన్స్ ద్వారా మనదేశంలోకి పంపిస్తున్నారు. ఫరీదాబాద్ లో లభ్యమైన భారీ పేలుడు పదార్థాలు ఇలానే మన దేశానికి వచ్చినట్లు తెలుస్తోంది. పైగా ఈ పేలుడు పదార్థాలను వివిధ ప్రాంతాలలో నిల్వ చేశారు. ఉగ్రవాదులు వైట్ కాలర్ రూపంలో తమ దారుణాలను చేపట్టడం మొదలుపెట్టారు. అయితే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టడంతో ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్ బయటికి వచ్చింది. ఇదే క్రమంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు పాకిస్తాన్ సరఫరా చేస్తున్న మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాల లింక్ గుట్టు రట్టు చేసింది. ఇవన్నీ కూడా విశాల్ ప్రచార్ అనే వ్యక్తి చేస్తున్నట్టు తేలింది. సరిహద్దులలో డ్రోన్ల ద్వారా ఆయుధాలు, మాదకద్రవ్యాలు, అమోనియం వంటివి వివిధ గ్యాంగుల ద్వారా పంజాబ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది. సామాజిక అస్థిరత సృష్టించే విధంగా ఈ గ్యాంగులు పనిచేస్తున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సరిహద్దుల వెంట భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి నిన్న మొన్నటి వరకు జమ్మూ కాశ్మీర్ సరిహద్దునే అత్యంత సున్నితమైందని అనుకునేవారు. కానీ ఇప్పుడు వాటిని మించిపోయాయి హర్యానా, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దులు.