అమెరికా భారతీయులకు తీపి కబురు

అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు సంతోషకరమైన సంఘటన నిన్న జరిగింది. సెనేట్ లో దేశవారి కోటా ఎత్తేసి ముందు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ఇచ్చే విధానానికి మార్గం తెరిచారు. ఇది భారతీయ అమెరికన్లు ఎప్పటినుంచో కోరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మొత్తం బిల్లు ఆమోదం పొందటానికి కొంత సమయం పట్టే అవకాశమున్నా ప్రధాన అవరోధం తొలగినట్లే భావించాలి. అదేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం. అమెరికాలో ప్రవాస భారతీయుల స్థితిగతులు  అమెరికా వలస విధానం ఎప్పుడూ ఒకలాగా లేదు. […]

Written By: Ram, Updated On : December 4, 2020 7:42 am
Follow us on

అమెరికాలో పనిచేస్తున్న భారతీయులకు సంతోషకరమైన సంఘటన నిన్న జరిగింది. సెనేట్ లో దేశవారి కోటా ఎత్తేసి ముందు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ఇచ్చే విధానానికి మార్గం తెరిచారు. ఇది భారతీయ అమెరికన్లు ఎప్పటినుంచో కోరుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంకా మొత్తం బిల్లు ఆమోదం పొందటానికి కొంత సమయం పట్టే అవకాశమున్నా ప్రధాన అవరోధం తొలగినట్లే భావించాలి. అదేమిటో ఒక్కసారి పరిశీలిద్దాం.

అమెరికాలో ప్రవాస భారతీయుల స్థితిగతులు 

అమెరికా వలస విధానం ఎప్పుడూ ఒకలాగా లేదు. ముఖ్యంగా ఆసియా వాసుల విషయంలో ఎంతో వివక్ష వుండేది. 19వ శతాబ్దంలో బలవంతంగా ఒక లక్షమంది చైనీయులను రైలు మార్గాలు నిర్మించటానికి తీసుకొచ్చి తర్వాత వారిపై వివక్ష చూపించారు. అలాగే జపాన్ వారిని రెండో ప్రపంచ యుద్ధంలో ప్రత్యేక శిబిరాలకు తరలించారు. భారతీయులు 1965 కి ముందు బహు కొద్దిమంది మాత్రమే వుండేవారు. లిండన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడిగా వలస విధానాన్ని సరళీకృతం చేసిన తర్వాతనే భారతీయులు రావటం మొదలయ్యింది. అదికూడా మరీ ఎక్కువగా జరగలేదు. 1990 లో జార్జి బుష్ తీసుకొచ్చిన హెచ్ 1బి వీసా విధానం తర్వాతే భారతీయులు విరివిగా అమెరికా వెళ్ళటం జరిగింది. సిలికాన్ వేలీ సాంకేతిక విప్లవం తర్వాత అమెరికాకి అవసరం రీత్యా ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ నిపుణులను ఆహ్వానించటం, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని భారతీయులు అమెరికా రావటం, ఆ విద్యలో వున్నత చదువుల కోసం అమెరికా విద్యాలయాలకు రావటం ఇవన్నీ ఒకదానివెంట ఒకటి జరిగిన పరిణామాలు.

1990లో 65వేలమందిని హెచ్ 1బి కేటగిరి కింద ఏటా తీసుకోవటం మొదలయ్యింది. అది తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేసినవారికి, మిగతా వున్నత చదువులు చేసినవారికి అదనంగా ఇంకో 20వేలు తీసుకోవటం 2004 నుంచి మొదలయ్యింది. ఇలా సంవత్సరానికి 85 వేలమంది హెచ్ 1బి కేటగిరి కింద తాత్కాలిక వీసాలు,మంజూరు చేయటం జరుగుతూ వుంది. ఈ కేటగిరీలో అమెరికాలో వుద్యోగం చేస్తున్నవారు అత్యధికంగా భారతీయులే వున్నారు. అంతవరకూ మనందరం గర్వపడాలి. అయితే ఇక్కడే కొంత సమస్య కూడా రావటం మొదలయ్యింది. వుద్యోగాలయితే వచ్చాయి కాని శాశ్వత నివాస దరఖాస్తు చేసుకున్నవాళ్ళు ( గ్రీన్ కార్డు) ఎక్కువకాలం వేచివుండాల్సిన పరిస్థితులు వచ్చాయి. కారణం ఈ వీసా నిబంధనల్లో వున్న తిరకాసు. ఎవరైనా గ్రీన్ కార్డుకి దరఖాస్తు చేసుకుంటే అందులో 7 శాతానికి మించి ఒకే దేశస్థులకు ఇవ్వకూడదని వుంది. ఇది పెట్టటానికి చారిత్రక కారణాలేమైనా ఈరోజు ఆ నిబంధనే మన భారతీయులకు ప్రతిబంధకంగా మారింది. హెచ్ 1బి కింద అమెరికానే ఆహ్వానించి వుద్యోగాలిచ్చినా వారికి గ్రీన్ కార్డు ఇవ్వటానికి ఈ దేశవారి పరిమితులు భారతీయులకు ఇబ్బందిగా మారాయి. మొత్తం వీసాల మంజూరు ప్రక్రియ చూసినా 2019లో మొత్తం 4లక్షలా 62 వేల మందికి వీసాలు మంజూరు చేసినా భారతీయులకు కేవలం 25వేలమందికి మాత్రమే ఇవ్వటం జరిగింది. ఇవి అన్ని రకాల వీసాలు కలిపి. ఇక ఉద్యోగ ఆధారిత వీసాల సంగతి సరే సరి. ఈ ఉద్యోగ ఆధారిత వీసాల్లో అత్యధికంగా నిరీక్షణ లిస్టులో భారతీయులే వున్నారు. ఓ అంచనా ప్రకారం వీరి సంఖ్య ఏడున్నర లక్షలు. ఇప్పుడున్న దేశవారి కోటా ప్రకారమయితే 84 సంవత్సరాలు పడుతుందని అంచనా వేసారు. ఇది భారతీయ అమెరికన్లకు మనోవేదన కలిగించే అంశం. ఇంకే దేశంవారు ఇలా నిరీక్షణలో లేరు. మన పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ దేశస్తులు తక్కువ సమయంలో గ్రీన్ కార్డు పొంద గలుగుతున్నారు. దీనిపై ప్రవాస భారతీయ సంఘాలు గత దశాబ్దంగా ఎన్నో రకాలుగా అమెరికా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసారు. విజ్ఞప్తులు, లాబీలు, ప్రదర్శనలు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

ఎట్టకేలకు పరిష్కార దిశలో 

అమెరికా పార్లమెంట్ సభ్యులు దీని తీవ్రతను గుర్తించేటట్లు మనవాళ్ళు చేయగలిగారు. 2019 జూలైలో అమెరికా ప్రతినిధుల సభ ( మన లోక్ సభ లాంటిది) అత్యధిక మెజారిటీతో ఓ బిల్లుని ఆమోదించారు. అంటే రెండు పార్టీల ప్రతినిధులు ఆమోదించబట్టే అంత మెజారిటీతో బిల్లు పాస్ అయ్యింది. దీని ప్రకారం ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డు కేటగిరిలో 7 శాతం దేశవారి పరిమితిని ఎత్తివేశారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు,బంధువులకు ఇచ్చే కేటగిరి లో పరిమితిని 7శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అంటే మిగతా దేశస్తులకు కూడా న్యాయం చేయటానికే ఆ పరిమితిని పెంచారు. ఇది జరిగి దాదాపు ఒక సంవత్సరం, 5 నెలలు కావస్తున్నా సెనేట్ ( మన రాజ్య సభ లాంటిది) ఆమోదానికి నోచుకోలేదు. ఏదో ఒక వంకతో సెనేట్ సభ్యులు అడ్డుతగులుతూ వచ్చారు. నిన్న అనుకోకుండా బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇది పెద్ద మార్పు. ఈ బిల్లుని 2019లోనే ఇరుపార్టీల సభ్యులు కలిసి సెనేట్ లో ప్రవేశపెట్టారు. అందులో డెమోక్రటిక్ తరఫున ప్రస్తుతం ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ ప్రతిపాదించింది. ఈ ఆమోదంతో ఇప్పట్లో దీనికి మోక్షం లేదనుకున్నది ఒక్కసారి అందరిలో ఆశలు రేకెత్తించింది.

అయితే సెనేట్ ఆమోదించిన బిల్లుకి, ప్రతినిధుల సభ ఆమోదించిన దానికి కొన్ని తేడాలున్నాయి. స్థూలంగా ప్రధాన అంశంలో ఎటువంటి మార్పు లేదు. ఈ బిల్లులో కూడా ప్రతినిధుల సభలో లాగానే ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు 7 శాతం దేశవారి పరిమితిని ఎత్తివేశారు. కుటుంబ సభ్యుల, బంధువుల కోటాని 7 శాతం నుంచి 15 శాతానికి పెంచారు. అయితే సెనేట్ ఆమోదించిన బిల్లులో ఇంకొన్ని అదనపు నిబంధనలు చేర్చారు. ఇది ఈ బిల్లు విమర్శకులను దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిన సవరణలు. ఈ రక్షణాత్మక నిబంధనలతో పాటు ఇంకో నిబంధన కూడా చేర్చారు. అదేమిటంటే చైనీయుల విషయంలో దరఖాస్తు దారుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో గాని, మిలటరీతో గాని సంబంధం వుంటే వాళ్లకు నిరాకరించబడుతుంది. ఇదొక్కటే ఇందులో ప్రధాన చర్చనీయాంశం కావచ్చు. అయితే ప్రస్తుతం అమెరికా లో చైనాపై వ్యతిరేకత పతాక స్థాయిలో ఉండటంతో ప్రతినిధుల సభ కూడా ఈ నిబంధనను ఆమోదించే అవకాశం వుంది. ఇది కొంత సమయం తీసుకొనే అవకాశం వుంది. కాకపోతే ప్రధాన అంశాల్లో రెండు సభలు ఒకే విధానం తీసుకోవటంతో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ రెండు సభలకు సంబంధించి కొంతమంది కూర్చొని అంగీకార ఏకీకృత బిల్లుని ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ అమెరికా పార్లమెంటులో సహజంగా జరిగేదే కాబట్టి అతి త్వరలో దేశవారి కోటా తీసివేయటం జరిగే అవకాశాలు పెరిగాయి. అంచనా ప్రకారం వచ్చే జనవరి పార్లమెంట్ సమావేశాల్లో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలుస్తుంది. అదే జరిగితే అధ్యక్షుడి సంతకమే తరువాయి. అది జనవరి 20వ తేదీ లోపల అయితే ట్రంప్ దగ్గరకు , తర్వాత అయితే బైడెన్ దగ్గరకు వెళుతుంది.

ఈ పరిణామం భారతీయ అమెరికన్లకు పెద్ద తీపి కబురు. ఎన్నో లక్షలమంది నిరీక్షణకు ముగింపు పలికే రోజు అతి త్వరలోనే రాబోతుంది. అంటే ఒక్కసారిగా ఇంకో 7 లక్షలమందికి పైగా గ్రీన్ కార్డు వచ్చే అవకాశం వుంది. అందుకనే నిన్నటిరోజు ప్రవాస భారతీయులకు చారిత్రాత్మక దినంగా చెప్పొచ్చు. ముందు ముందు భారతీయ అమెరికన్లు అమెరికా సమాజంలో ముఖ్యమైన లాబీగా కూడా తయారయ్యే అవకాశం లేకపోలేదు.