Guillain-Barre Syndrome
Guillain-Barre Syndrome : దేశం ఈ రోజుల్లో అనేక తీవ్రమైన, అంటు వ్యాధుల బారిన పడుతుంది. మొదట HMPV, తరువాత H5N1 (బర్డ్ ఫ్లూ) ఇన్ఫెక్షన్ ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేశాయి. ఇప్పుడు మహారాష్ట్రలోని అనేక నగరాల్లో పెరుగుతున్న గిలియన్ బారే సిండ్రోమ్ (GBS) కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. మహారాష్ట్ర ఇప్పటికే బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడింది. అదే సమయంలో GBS ప్రవేశం ఆరోగ్య రంగంపై మరింత ఎక్కువ ఒత్తిడిని పెంచింది.
గిలియన్ బారే సిండ్రోమ్‌కు సంబంధించి ఇటీవల వస్తున్న సమాచారం ప్రకారం, పూణేలో ఒక రోగి మరణించాడు. మహారాష్ట్రలో ఈ వ్యాధి కారణంగా మొదటి అనుమానాస్పద మృతి ఇదే. పూణేలో 100 కంటే ఎక్కువ GBS కేసులు నమోదయ్యాయి. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వీరిలో 16 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన విశ్లేషణలో 19 మంది రోగులు 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. 10 మంది రోగులు 65-80 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు. దీంతో ఈ వ్యాధి చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు వణికిస్తోందని స్పష్టమవుతోంది.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో పెరుగుతున్న వ్యాధి దృష్ట్యా, ఆరోగ్య నిపుణులు ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. ఇది కొత్త అంటు వ్యాధా? ఈ వ్యాధి ఎలా పెరుగుతోంది? దీనిని నివారించడానికి ఏం చేయాలి? అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం.
జూన్ 2021లో, కోవిడ్ రెండవ సారి ప్రబలినప్పుడు కూడా ఈ వ్యాధి చర్చలో ఉంది. అనేక దేశాలలో గిలియన్ బారే సిండ్రోమ్ కేసుల గురించిన చర్చ కూడా తీవ్రమైంది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్‌గా కొంతమందిలో గులియన్-బార్రే సిండ్రోమ్ సమస్య కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో నివేదించారు . అయితే, తరువాత కొన్ని ఇతర అధ్యయనాలలో టీకా ఈ దుష్ప్రభావం తిరస్కరించారు. ఇక ఈ Guillain Barre Syndrome అనేది మీ శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుంది. దీని కారణంగా, రోగులు బలహీనత, తిమ్మిరి లేదా పక్షవాతం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆరోగ్య నిపుణులు GBSని తక్షణ చికిత్స అవసరమయ్యే వైద్య అత్యవసర పరిస్థితిగా చూస్తారు. చికిత్స తీసుకోకపోతే, మరణం సంభవించే ప్రమాదం ఉందట.
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ నివేదికను పరిశీలిస్తే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు లక్ష మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అయినప్పటికీ ఈ సమస్య ఎందుకు సంభవిస్తుందో ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. వ్యాధికి సకాలంలో చికిత్స అందిస్తే సులువుగా నయమవుతుంది. ఈ వ్యాధి మీ పరిధీయ నరాలపై దాడి చేస్తుంది. ఈ నరాలు శరీరంలో కండరాల కదలిక, నొప్పి సంకేతాలు, ఉష్ణోగ్రత, స్పర్శ అనుభూతులను గ్రహిస్తాయి. ఈ నరాలు దెబ్బతినడం వల్ల, మీరు అనేక సమస్యలను ఎదుర్కోవచ్చు.
చేతులు, కాలి, చీలమండలు లేదా మణికట్టులో పిన్స్, సూదులు గుచ్చుతున్న ఫీలింగ్ వస్తుంటుంది. కాళ్ళలో బలహీనత శరీర పైభాగానికి వ్యాపించవచ్చు. నడవలేక, మెట్లు ఎక్కలేని పరిస్థితి. మాట్లాడటం, నమలడం లేదా మింగడం కష్టం అవుతుంది. మూత్రవిసర్జనపై నియంత్రణ కోల్పోవడం లేదా హృదయ స్పందన రేటు పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ వ్యాధి ఎందుకు వస్తుంది?
Guillain-Barré సిండ్రోమ్ ఎందుకు సంభవిస్తుందో ఖచ్చితమైన కారణం తెలియదు. ఇటీవలి శస్త్రచికిత్స లేదా టీకా తర్వాత కూడా కొంతమందిలో ఈ కేసులు కనిపిస్తున్నాయి. Guillain-Barré సిండ్రోమ్‌లో, మీ రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా సిరల రక్షణ కవచం దెబ్బతింటుంది. ఈ నష్టం మీ మెదడుకు సంకేతాలను పంపడం నరాలకు కష్టతరం చేస్తుంది. ఇది అనేక సమస్యలకు దారితీస్తుంది.
కొన్ని రకాల బ్యాక్టీరియా లేదా వైరస్‌లు కూడా ఈ సమస్యను ప్రేరేపిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ సమస్య క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది తరచుగా ఉడకని మాంసంలో కనిపిస్తుంది. ఇన్‌ఫ్లుఎంజా వైరస్, సైటోమెగలోవైరస్, జికా వైరస్, హెపటైటిస్ A, B, C, E వంటి ఇన్‌ఫెక్షన్‌లు కూడా గ్విలియన్-బారే సిండ్రోమ్‌ను ప్రేరేపిస్తాయి.
Guillain-Barré సిండ్రోమ్‌కు ఎటువంటి నివారణ లేదు, కానీ సహాయక చికిత్సలు రికవరీని వేగవంతం చేస్తాయి. లక్షణాలను తగ్గించవచ్చు. ఇది ప్లాస్మా థెరపీ, ఇమ్యునోగ్లోబిన్ థెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. ఈ వ్యాధిని నివారించే మార్గం ఏదీ లేదని, అయితే మంచి పరిశుభ్రత పాటించడం ద్వారా ఇలాంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మీ చేతుల పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి.