GST Rate Hike: కాదేదీ పెంచడానికి అనర్హం అన్నట్టు కేంద్రంలోని మోడీ సర్కార్ వీరబాదుడు బాదుతోంది. అగ్గిపుల్ల, సబ్బుబిల్ల.. ఉప్పు నుంచి పప్పు దాకా.. కూరగాయాల నుంచి పాల ప్యాకెట్ దాకా నిత్యావసరాలు అన్నీ పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది. కరోనా తర్వాత పెరిగిపోతున్న ధరాఘాతంను ఇప్పటికే తట్టుకోలేకపోతున్న సామాన్యుడిపై భారీ భారం వేసింది బీజేపీ ప్రభుత్వం. రేపటి నుంచి జీఎస్టీని నిత్యావసరాలపై భారీగా పెంచింది.
కేంద్రప్రభుత్వం జీఎస్టీని సవరించింది. నిత్యావసర సరుకులపై గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విధింపు అనివార్యమైంది. దీంతో నోట్లోకి ముద్ద దిగాలన్నా నోట్ల ఖర్చుపెట్టాల్సి పరిస్థితి నెలకొనడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. గత నెలలో జరిగిన జీఎస్టీ 47వ సమావేశం నిత్యావసర ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పెరిగిన కొత్త జీఎస్టీ రేట్లు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజులుగా జీఎస్టీ మీటింగ్ లు పెట్టి నిత్యావసరాలపై వీర బాదుడు బాదారు. భారీగా పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. పెరిగిన కొత్త జీఎస్టీ రేట్లు రేపటి నుంచే (జులై 18) అమల్లోకి రానున్నాయి.
రేపటి నుంచి ప్రీ ప్యాక్ డ్ అండ్ ప్రీ లేబుల్డ్ రీటైల్ ప్యాకెట్ ఉత్పత్తులపై పెంచి సామాన్యులకు షాకిచ్చారు. పెరుగు, లస్సీ, బటర్ మిల్క్ ప్యాకెట్లపై 5శాతం జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు చెక్కులు జారీ చేయడానికి బ్యాంకులు వసూలు చేసే రుసుముపై 18శాతం జీఎస్టీ, ఇన్వర్టడ్ డ్యూటీ స్ట్రక్చర్ లో 12 శాతం నుంచి 18 శాతానికి సవరించాలని జీఎస్టీ కౌన్సిల్ సిఫారసులతో ఎల్.ఈడీ లైట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉపయోగించే ఫిక్సర్లు (టూల్స్), ఎల్ఈడీ ల్యాంప్స్ ధరలు పెంపునకు సిద్ధంగా ఉన్నాయి.
ఇక రోగుల ఆస్పత్రుల గదులపై కూడా జీఎస్టీ వసూలు చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించింది. అసలు రోగాలతో రొప్పులతో బాధపడుతున్న వారి నుంచి కూడా 5 శాతం జీఎస్టీ వసూలు చేయనున్నారు. హోటల్ గదులపై 1000 లోపు 12శాతం జీఎస్టీ స్లాబ్ పరిదిలోకి తెచ్చారు.
ఇలా పాలు , పెరుగు నుంచి మొదలుపెడితే రోగుల రూములు, హోటల్స్ రూములపై కూడా జీఎస్టీ వేసి వసూళ్ల పరంపరకు తెరతీసింది మోడీ ప్రభుత్వం..