Pawan kalyan:అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆయనకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా ఒక ప్రకటనను జారీ చేశారు. ‘‘కారణజన్ములు … అని అరుదుగా వింటుంటాం. అరుదుగా చూస్తుంటాం. అటువంటి అరుదైన మచ్చలేని మారాజు శ్రీ ఎ.పి.జె.అబ్దుల్ కలాం. ఆయన గురించి విన్నా.. తెలుసుకున్నా.. చదివినా.. కళ్ళు చెమ్మగిల్లక, గుండెలు బరువెక్కక తప్పదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన భరతమాత ముద్దు బిడ్డడు. ఎందుకంటే ఆయన దేశం మీద పడి కాకుండా దేశం కోసం బతికారు. దేశం కోసం తన జీవితాన్ని ధారపోశారు. అటువంటి గొప్ప దేశభక్తుని జయంతి సందర్భాన ఆయనకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. శ్రీ కలాం ఏ ఉద్యోగ బాధ్యత నెరవేర్చినా.. ఏ పదవిని అలంకరించినా దానికి వన్నె తెచ్చారు. తనదైన ముద్ర వేశారు’’ పవన్ ప్రకటనలో పేర్కొన్నారు..

దేశ భవిష్యత్తు కోసం బాల్యం నుంచే కలలు కన్నారని కలాంను పవన్ కళ్యాణ్ పొగిడారు.. దుర్భేద్య దేశంగా ఇండియా అవతరించిన నాడే ప్రపంచంలో అగ్రగ్రామి దేశంగా ప్రకాశించగలదని కలలు కన్న గొప్ప స్వాప్నికుడు శ్రీ కలాం. ఆ కలలను సాకారం చేసే దిశగా అణు, క్షిపణి రంగాలలో భారత దేశాన్ని ప్రబల శక్తిగా రూపుదిద్దడంలో ముందు వరుసలో నిలిచారు. నాయకుడిగా ముందుండి నడిపారు. భారతరత్నగా అవతరించారు. దేశం పట్ల ఆయనకున్న అంచంచలమైన విశ్వాసం, ప్రేమ, భక్తి ఆయనను రాష్ట్రపతి పదవికి దరి చేర్చాయి. ఎన్నో అవార్డులు, రివార్డులు శ్రీ కలాం గారికి అలంకృతమై తరించాయి. ప్రపంచంలోని 40 విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవించి తమను తాము గౌరవించుకున్నాయి. అందులో ఏడు డాక్టరేట్లు ఉండడం శ్రీ కలాం గొప్పతనానికి చిరు నిదర్శనం.
ఈ దేశానికి రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన ఈ నిష్కామయోగి జీవిత నిష్క్రమణలో ఉన్న ఆస్తులు.. ఒక వీణ, కొన్ని పుస్తకాలు, ఒక సి.డి.ప్లేయర్. ఇదొక్కటి చాలు ఆయన అంతరాత్మను తెలుసుకోడానికి. ఆ పుణ్యమూర్తి జీవించిన కాలంలో నేను సైతం మనుగడ సాగించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పవన్ అన్నారు. తన జీవితపు చివరి క్షణం వరకు ఈ దేశ యువతను జాగృతం చేస్తూనే ఉన్న ఆ మహానుభావుని జయంతి సందర్భంగా నా పక్షాన, జనసేన శ్రేణులు పక్షాన పవన్ కళ్యాణ్ అంజలి సమర్పించారు. ఆయన బాటలో పయనం కొనసాగిస్తానని ప్రమాణం చేస్తున్నట్టు తెలిపారు.