https://oktelugu.com/

Komatireddy Rajgopal Reddy: రాజగోపాల్‌కు ఎదురుగాలి.. నియోజకవర్గంలో పడిపోయిన గ్రాఫ్‌

Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలు మునుగోడు నియోజకవర్గంపై దృష్టిపెట్టాయి. ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంలో ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని పదవిని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలిచి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటాలనుకుంటోంది. సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇక రాజీనామా చేసి తమ పార్టీలో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 16, 2022 / 03:56 PM IST
    Follow us on

    Komatireddy Rajgopal Reddy: తెలంగాణలో ఇప్పుడు అన్ని పార్టీలు మునుగోడు నియోజకవర్గంపై దృష్టిపెట్టాయి. ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంలో ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం లేదని పదవిని వదులుకున్నారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార టీఆర్‌ఎస్‌ ఇక్కడ గెలిచి పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత లేదని చాటాలనుకుంటోంది. సిట్టింగ్‌ స్థానం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇక రాజీనామా చేసి తమ పార్టీలో చేరిన రాజగోపాల్‌రెడ్డిని తిరిగి గెలిపించి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రాబోయేది బీజేపీ మాత్రమే అనే సంకేతం ఇవ్వాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నిక విషయంలో క్షేత్ర స్థాయి పరిస్థితిని గురించిన పరిశీలనలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి.

    Komatireddy Rajgopal Reddy

    Komatireddy Rajgopal Reddy

    పనులు జరగక ప్రజల్లో వ్యతిరేకత..
    రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి మూడేళ్లు అయింది. కానీ నియోజకవర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏమీ జరుగలేదు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వివక్ష కారణంగా ఎమ్మెల్యేగా తాను ఇది చేయించానని చెప్పుకునే అవకాశం కూడా రాజగోపాల్‌రెడ్డికి లేకపోయింది. దళితబంధు, డబూల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం ఎమ్మెల్యేకు అప్పగించింది. కానీ మునుగోడుతోపాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మాత్రం ఆ అవగాశం ఇవ్వలేదు. జిల్లా మంత్రులు, లేదా ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు ఎంపిక బాధ్యత తీసుకుంటున్నారు. దీంతో మునుగోడు ప్రజల్లో రాజగోపాల్‌రెడ్డిని ఎందుకు గెలిపించామన్న భావన ఏర్పడింది.

    ఆత్మగౌరవం, ఆత్మాభిమానంతో రాజకీయం..
    కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరెడ్డి చాలాకాలంగా కాంగ్రెస్‌లో ఉంటూ వస్తున్నారు. పార్టీలో సీనియర్‌ నాయకులే అయినా ఎన్నడూ ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మాత్రం చంపుకోలేదు. గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉంటూ వచ్చారు. కానీ పార్టీ విధానాలు నచ్చనప్పుడు అధిష్టానంపై విమర్శలు చేయడానికి కూడా వెనుకాడలేదు. 2018 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నట్లుగానే రాజగోపాల్‌రెడ్డిని కూడా గులాబీ నేతలు టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అయితే అప్పటికే ఆ పార్టీలో చేరిన నేతలపై గులాబీ బాస్‌ ప్రవర్తిస్తున్న తీరు, ఎలాంటి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టిన వైనం, ఉనికే ప్రశ్నార్థకంగా మారడాన్ని గుర్తించిన రాజగోపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ ఆహ్వానాన్ని వ్యతిరేకించారు. కేసీఆర్‌ పార్టీలో చేరి ఆత్మాభిమానం చంపుకోలేక ప్రతపక్షంలోనే ఉన్నారు. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడడంతో రాజగోపాల్‌రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. దీనిని పసిగట్టిన ఎమ్మెల్యే, పదవిలో ఉండి ఏమీ చేయలేకపోతున్నానని ప్రజలకు చెప్పారు. ప్రభుత్వం నియోకవర్గంపై వివక్ష చూపుతోందని వివరించారు. అభివృద్ధికి నిధులు ఇస్తే పదవి వదులుకుంటానని ప్రకటించారు. హుజూరాబాద్‌లో ఇచ్చినట్లు తాయిలాలు ఇవ్వాలని ప్రకటించారు. దీనికి సర్కార్‌నుంచి గానీ, టీఆర్‌ఎస్‌ నేతల నుంచి గానీ ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో పని చేయలేనప్పుడు పదవి వదులుకోవడమే నయమని భావించారు. చివరకు రాజీనామా చేశారు.

    ఉప ఎన్నిక ఎందుకన్న ప్రశ్న..
    అయితే ప్రతిష్టకు పోయిన రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నికలను తెర మీదకు తెచ్చారు. మరి ఇప్పటికే అక్కడ అన్ని పార్టీలూ తమ తమ రచ్చను చేస్తూనే ఉన్నాయి. బీజేపీ తరఫున రాజగోపాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున పాల్వాయి స్రవంతి అభ్యర్థులుగా ఖరారు అయ్యారు. ఇక టీఆర్‌ఎస్‌ ఇప్పటికే తన పని పూర్తి చేసుకుంటోంది. నియోజకవర్గంలో బాధ్యులు, ఇతర కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మూడు పార్టీలకూ ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకం. వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు కొత్తగా పోయేదేమీ కాదు. అయితే కనీసం పోటీలో నిలిచి ఉనికిని చాటుకోవాలనేది కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నం! ఇక తమ హవా తగ్గలేదని నిరూపించుకోవడం టీఆర్‌ఎస్‌ కు అవసరం, ప్రతిష్టను నిలబెట్టుకోవడం బీజేపీకి పరువుతో కూడుకున్న అంశం. అయితే ఉప ఎన్నిక ఎందుకన్న ప్రశ్న నియోజకవర్గ ప్రజల్లో వ్యక్తమవుతోంది.

    ప్రతిపక్షం నుంచి ప్రతిపక్షంలోకే..
    క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఎలా ఉందంటే.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరలేదు. లేదా ఈటల రాజేందర్‌లాగా అధికార టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ను వీడి మరో ప్రతిపక్షం బీజేపీలో చేరారు. దీనివలన ఏమిటి ప్రయోజనం, ఎవరికి ప్రయోజనం అన్న ప్రశ్న క్షేత్రస్థాయిలో వినిపిస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ప్రచారం చేస్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి కేవలం కాంట్రాక్టు కోసమే బీజేపీలో చేరినట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఆయన బీజేపీ తరఫున పోటీ చేసి ఆ పార్టీకి ఊపు ఉందని నిరూపించాల్సిన అవసరం ఏమిటనేది సామాన్యుడి ప్రశ్న అని అంటున్నారు పరిశీలకులు.

    Komatireddy Rajgopal Reddy:

    అయినా రాని సానూభూతి..
    నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్న ఉద్దేశంతోనే తాను పదవికి రాజీనామా చేశారని రాజగోపాల్‌రెడ్డి చెబుతున్నారు. ఆయన ప్రకటించినట్లుగానే రాజీనామా తర్వాత నియోజకవర్గానికి నిధులు వస్తున్నాయి. అభివృద్ధి పనులు మొదలవుతన్నాయి. గొల్ల కుర్మలకు గొర్రెలు పంపిణీ చేసేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రాజగోపాల్‌ రాజీనామా ఫలాలు నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయి. అయితే రాజగోపాల్‌రెడ్డిపై మాత్రం సానుభూతి చూపుతున్నట్లు కనిపించడం లేదు. అనుకూలం కంటే… వ్యతిరేక పవనాలు గట్టిగా వీస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ తరఫున దక్కిన పదవికి రాజీనామా చేసి బీజేపీ వైపు పోటీ చేయడం అనేదే.. జనాలు ఆయన వైపు నిలిచే అవకాశాలను తగ్గించి వేస్తున్నట్టుగా ఉంది. రాజగోపాల్‌ రెడ్డి గెలవడానికి తీవ్రంగానే కష్టపడాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఆయన గ్రాఫ్‌ బాగా తగ్గుముఖం పట్టిందని, పోలింగ్‌ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అనే అభిప్రాయాలే ఇప్పుడు వినిపిస్తున్నాయి

    Tags